వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతుల ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చట్టాలు చివరకు సేద్యాన్ని కార్పొరేట్ పరం చేస్తాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి భారీ టెక్ సంస్థలు నేడు వ్యవసాయ సాంకేతికతల అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్ర, రేపు సేద్యంలో డిజిటల్ వలసవాదానికి దారితీస్తుందనే విమర్శలున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అమెరికాలో అందరికన్నా ఎక్కువ పంట పొలాలున్న భూస్వామిగా అవతరించడం గమనార్హం. అమెరికాలో గేట్స్, ఆయన భార్య మెలిండా కలిసి 2,68,984 ఎకరాలు కొన్నారు. భారత్‌తో సహా ఇతర దక్షిణాసియా దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో అధిక దిగుబడి ఇచ్చే సుస్థిర వ్యవసాయాభివృద్ధికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందిస్తోంది. వాతావరణ మార్పులను తట్టుకోగల పంటలనూ ప్రోత్సహిస్తోంది.
అయితే, సామాజిక, పర్యావరణ ఉద్యమకారిణి వందనా శివ- గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను దానధర్మ పెట్టుబడిదారీ విధానంగా వర్ణిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన ఎజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతికత ఆధారంగా ఎజ్యూర్ ఫార్మ్ బీట్స్ అనే డిజిటల్ వ్యవసాయ వేదికను నిర్మిస్తోంది. నేలలో తేమ, ఇతర అంశాలను పసిగట్టే సెన్సర్లు, డేటా ఎనలిటిక్స్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలతో రైతులకు కీలకమైన డేటా అందించే వేదిక అది. ఎజ్యూర్ డేటాతో డ్రైవర్ రహిత ట్రాక్టర్లు, నాట్లు, కోత యంత్రాలు, క్రిమినాశనులను చల్లే డ్రోన్లను, సెన్సర్లను అభివృద్ధి చేయడానికి భారీ వ్యవసాయ సాంకేతిక కంపెనీలతో మైక్రోసాఫ్ట్ చేతులు కలిపింది. గేట్స్‌లానే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా 4,20,000 ఎకరాల భూమి కూడగట్టారు. ఇందులో ఎక్కువ భాగం ఆయన కుటుంబ వారసత్వంగా సంక్రమించినదే.
చిన్నరైతులపై ప్రభావం
ఇక ఫేస్‌బుక్ సంస్థ భారత్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.44,000 కోట్ల పెట్టుబడి పెట్టడం, రిలయన్స్ ఆన్‌లైన్ కిరాణా వ్యాపార వేదిక జియోమార్ట్‌కు గొప్ప ఊతమిస్తుంది. భారత వ్యవసాయంలో ఫేస్‌బుక్ ఇప్పటికే ప్రముఖ పాత్రధారి అయింది. వ్యవసాయ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి భారత రైతు బృందాలు అత్యధికంగా ఉపయోగిస్తున్న సాంకేతిక సాధనాలు- ఫేస్‌బుక్, దాని అనుబంధ వాట్సాప్‌లే. మహారాష్ట్రలో హోయ్ అమీ షేట్కారీ (హెచ్‌ఏఎస్) వాట్సాప్ గ్రూపులో నేడు ఆరు లక్షలకుపైగా సభ్యులున్నారు. హెచ్‌ఏఎస్- ఫేస్‌బుక్ గ్రూపు చీడపీడలు, తెగుళ్ల గురించి రైతులను హెచ్చరిస్తూ, పంట దిగుబడులు పెంచడానికి తోడ్పడే సమాచారాన్నీ పంచుతోంది.
జియో కృషి యాప్ సునిశిత వ్యవసాయ పద్ధతులను రైతులకు అందిస్తోంది. ఈ యాప్‌లో నమోదయ్యే రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు, నాట్లు, పంటకు నీరు పెట్టాల్సిన సమయం, తెగుళ్ల నిరోధానికి సంబంధించిన సమాచారం (డేటా) అందుతుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), గూగుల్ సంస్థలు కలిసి రైతులకు బిగ్‌డేటా టూల్‌ను ఆవిష్కరించాయి. ఆపిల్ సంస్థ సునిశిత వ్యవసాయ సాధనంగా ఆపిల్ వాచ్‌ను మలచింది. ఇలా ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక దిగ్గజ సంస్థలు ఆహార, వ్యవసాయ రంగాల్లోకి ప్రవేశించడం చిన్న రైతులను, ఆహార విపణులను అధికంగా ప్రభావితం చేయనున్నది. తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న ప్రపంచ జనాభా ఆహార అవసరాలను తీర్చాలంటే కొత్త సాంకేతికతలు అవసరమని టెక్ కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ రంగంలో టెక్ కంపెనీలకన్నా బహుళజాతి వ్యవసాయ, వ్యాపార కంపెనీలు ముందున్నాయి.
కొనుగోలుదారులతో సంబంధాలు
సేద్య యాప్‌లు, డ్రైవర్ లేని ట్రాక్టర్లు, డ్రోన్లు వేల ఎకరాల్లో విస్తరించిన పంట భూముల్లో సాగుకు ఉపయోగపడతాయి కానీ, చిన్నకమతాలకు పొసగవు. ప్రపంచ దేశాల్లోని 50 కోట్ల చిన్న కమతదారులే మన ఆహార అవసరాలను తీరుస్తున్నారు. వీరికి యాప్‌ల వల్ల ఉపయోగం ఎంత అనేది ప్రశ్నార్థకం. క్లౌడ్ సాయంతో నడిచే డ్రైవర్ రహిత ట్రాక్టర్లు, డ్రోన్లను కొనే స్తోమత వారికి ఎటూ ఉండదు. వేల ఎకరాల్లో మొక్క జొన్న, గోధుమ, సోయా వంటి ఏక పంటలను వేసే భూస్వాములకు, వ్యవసాయ వ్యాపార కంపెనీలకు మాత్రమే ఆ స్తోమత ఉంటుంది. యాప్‌ల ద్వారా సేకరించే సమాచారాన్ని వినియోగించుకునే సామర్థ్యమూ వాటికే ఉంటుంది.