భవితను పొదుపు ద్వారా మలుపు తిప్పవచ్చు అన్నమాట ఇప్పటిది కాదు. భారతీయుల నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన భావన.. పొదుపు! రూపాయి రూపాయి కూడగట్టుకుని పొదరిల్లు కట్టుకుని అందులో శేషజీవితం అంతా కులాసాగా కాలక్షేపం చేయాలన్నదే భారతీయుల్లో అత్యధికుల ఆలోచన. బడాబాబుల మాట అటుంచితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో చాలామందికి పొదుపు చేయడం జీవితంలోను, జీతంలోను అతి పెద్ద భాగం, బాధ్యత. ఇలా పొదుపు చేసుకున్న మొత్తంలోంచే పిల్లల చదువులు, వాళ్ల పెళ్లిళ్లు, ఇంట్లో వాళ్ల ఆరోగ్య ఖర్చులు.. ఇలా సమస్తం చూసుకుంటారు. పెద్ద ఆపద ఏదైనా ముంచుకొచ్చినా తాము కూడబెట్టుకున్న సొమ్ము ఆదుకుంటుందనే ధైర్యమే సగటు భారతీయుడిని ముందుకు నడిపిస్తుంటుంది. ఒక్క ముక్కలో- భారతీయ ఆర్థిక వ్యవస్థకు పొదుపే పట్టుగొమ్మగా నిలుస్తోంది.
సింహభాగం పొదుపు ఖాతాల్లోకే
దేశ జనాభాలో సగానికి పైగా మధ్యతరగతి వర్గమే. వీళ్లు సాధారణంగా రోజుకు రూ.75 నుంచి రూ.150 వరకు ఖర్చుచేస్తారన్నది ముంబయి విశ్వవిద్యాలయ ఆర్థికవేత్తల అధ్యయన సారాంశం. మధ్యతరగతి సంపాదనలో సింహభాగం పొదుపు ఖాతాల్లోకే వెళుతోంది. దేశంలో సగానికిపైగా మధ్యతరగతి జీవుల పొదుపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. ఆ పొదుపు ద్వారా సమకూరిన డబ్బుతోనే బ్యాంకులు అనేకమందికి అప్పులు ఇస్తుంటాయి. పొదుపు చేసేవాళ్లకు ఇచ్చే వడ్డీ కంటే అప్పు ఇచ్చినవాళ్ల వద్ద నుంచి తీసుకునే వడ్డీ మొత్తం అధికం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే బ్యాంకులకు వచ్చే లాభం. వాటి నిర్వహణ వ్యయం, సిబ్బంది జీతాలు అన్నింటికీ అది సరిపోతుంది. అదీ మధ్యతరగతి పొదుపు మహిమ!
ఆర్థిక వృద్ధికి భరోసా
ఓ జీవిత బీమా సంస్థ 2019లో చేసిన సర్వే ప్రకారం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల్లో దాదాపు 75శాతం తమ జీతాల్లోంచి అత్యధిక భాగాన్ని 'సేవింగ్స్ బ్యాంక్' ఖాతాల్లోనే దాచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసి, 24 గంటల్లోనే ఉపసంహరించుకున్న ఓ పెద్ద ప్రకటన- ఇలాంటి మధ్యతరగతి పొదుపు జీవుల గుండెల్లో గుబులు రేపింది. కిసాన్ వికాస పత్రాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్యా సమృద్ధి యోజన వంటి వివిధ పథకాల్లో చాలామంది భారతీయులు పొదుపు చేసుకుంటారు. ఇవి దీర్ఘకాలంలో వచ్చే అవసరాలకు ఉపయోగపడతాయని, పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు తమను ఆదుకుంటాయన్నది వారి ప్రగాఢ విశ్వాసం. కానీ, వీటన్నింటిపైనా వడ్డీని దాదాపు 0.7 శాతం నుంచి 0.9 శాతం వరకు తగ్గిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆర్థికవృద్ధి రేటును పెంచాలని..