ప్రపంచంలోనే అగ్రస్థాయి బియ్యం ఎగుమతిదారుగా థాయ్‌లాండ్‌కు 30 ఏళ్లుగా ఉన్న పేరును భారత్ 2012లోనే చెరిపేసింది. ఆ స్థానాన్ని తాను ఆక్రమించింది. ఆ తరవాత నుంచి రెండు, మూడో స్థానాలను వియత్నాం, థాయ్‌లాండ్ తరచూ పంచుకుంటూ వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా 2020-21 సీజనులో భారత్ నుంచి 70,000 టన్నుల నూకల దిగుమతికి వియత్నాం ఒప్పందం కుదుర్చుకొంది. అసలు 2016-17 నుంచే వియత్నాం నాసిరకం బియ్యాన్ని భారత్ నుంచి కొనుగోలు చేసి పశువుల దాణాకు, బీరు తయారీకీ ఉపయోగిస్తోంది. ఈ ఏడాది వియత్నాం నుంచి మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచంలో అత్యధికంగా బియ్యం దిగుమతి చేసుకునే చైనా మూడు దశాబ్దాల తరవాత మొదటిసారి 2020లో భారత బియ్యాన్ని కొనుగోలు చేసింది. 2021లో కూడా కొనుగోళ్లు కొనసాగించనుంది. చైనాకు లక్ష టన్నుల నూకల ఎగుమతికి ఒప్పందాలు కుదిరాయి. చైనా సాధారణంగా భారతీయ బియ్యం నాణ్యతకు వంకలు పెడుతూ పాకిస్థాన్, థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్‌ల నుంచి దిగుమతి చేసుకొంటూ ఉంటుంది. ఈ ఏడాది చైనాలో బియ్యానికి బాగా కొరత ఏర్పడటంతో మన బియ్యాన్ని కొనక తప్పలేదు. గత జులైలో యాంగ్ట్సే నదికి తీవ్రస్థాయి వరదలు రావడంతో చైనాలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తరవాత మిడతల దండు వచ్చిపడింది. మరోవైపు చైనాలో ఆహార వృథా ఎక్కువవుతూ వస్తోంది. ఇది చాలదన్నట్లు 3.7 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు పారిశ్రామికీకరణ, పట్టణీకరణపరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చైనా ఆహార భద్రత కోసం భారత్ నుంచి బియ్యాన్ని కొనక తప్పడం లేదు.
వరుణుడి కరుణ..
ఇతర దేశాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలించినా భారత్‌లో విస్తారమైన వర్షాలు కురిసి వరి పంట విరగపండినందువల్ల, గత నవంబరు నాటికే 70 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయగలిగింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లోనూ కుండపోత వర్షాలు, వరదల వల్ల వరి పంట దెబ్బతిని బియ్యం ధరలు పెరిగిపోవడం వల్ల భారత్ లక్షన్నర టన్నుల బియ్యం ఎగుమతి చేసి ధరల స్థిరీకరణకు తోడ్పడింది. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం జరిగిన ఎగుమతి. భారత్, సింగపూర్‌ల నుంచి మరో రెండున్నర లక్షల టన్నుల బియ్యం కొనాలని నిర్ణయించిన బంగ్లా ప్రభుత్వం, బియ్యం దిగుమతులపై సుంకాన్ని 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. దీంతో బంగ్లాకు ఎగుమతులు పెంచడానికి భారతీయ సరఫరాదారులు సిద్ధమవుతున్నారు.
గిరాకీ పెరిగింది..
2020-21 సీజను ముగిసేసరికి భారత్ నుంచి మొత్తం బియ్యం ఎగుమతులు కోటి టన్నులకు చేరతాయని అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం (ఐరియా) అధ్యక్షుడు బి.కృష్ణారావు అంచనా. ఈ కోటి టన్నులూ సాధారణ బియ్యమే తప్ప బాస్మతి రకం కాదు. సీజను ముగిసేనాటికి బాస్మతి, సాధారణ బియ్యం ఎగుమతులు కలిసి మొత్తంకోటి 40 లక్షల టన్నులకు చేరవచ్చు. థాయ్‌లాండ్, వియత్నాంలకన్నా 10 శాతం తక్కువ ధరకే బాస్మతియేతర బియ్యాన్ని భారత్ సరఫరా చేస్తున్నందు వల్ల మన బియ్యానికి గిరాకీ పెరిగిందని కృష్ణారావు వివరించారు. థాయ్ కరెన్సీ విలువ పెరగడం వల్ల ఆ దేశ బియ్యం ప్రియమైంది. అది చాలదన్నట్లు తీవ్ర అనావృష్టి వల్ల నిరుడు థాయ్ వరి పంట దెబ్బతిన్నది. గత ఏడాది 75 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన థాయ్‌లాండ్ ఈ ఏడాది 50 లక్షల టన్నులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కొవిడ్ లాక్‌డౌన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం బియ్యం ఎగుమతులను నిలిపేయగా, భారత్ ఎగుమతులు కొనసాగించి నికరమైన సరఫరాదారుగా పేరుతెచ్చుకొంది. ఇది మరిన్ని ఎగుమతి ఆర్డర్లు రావడానికి తోడ్పడింది.