కరోనాను కట్టడి చేయడానికి విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రాలు లాక్‌డౌన్ల బాట పడుతున్నాయి. దీనితో ఉపాధి అవకాశాలు కొరవడి అనేక మంది పేదరికంలోకి జారిపోతున్నారని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ కారణంగా ఆదాయ వనరులు కుంచించుకుపోవడంతో దేశంలో పేదరికం గణనీయంగా పెరిగిందని ఈ నివేదిక స్పష్టంచేస్తోంది. సుమారు 23 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు పడిపోయారు. శ్రమజీవుల ఆదాయం గతంలో కంటే సగటున 17 శాతం మేర కోసుకుపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో దారిద్య్రం ఇంకా పెరిగే ప్రమాదముంది. కాబట్టి ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కృషి చేస్తూనే ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి.
పెరుగుతున్న అప్పుల భారం
ఏడాది కాలంగా ఉద్యోగ, ఉపాధి భద్రత లేక కోట్ల మంది శ్రామికులు, ప్రైవేటు ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల్లో భారీ కోతల నుంచి ఉద్యోగాలను పూర్తిగా కోల్పోవడం వరకు అన్నిచోట్లా అభద్రత రాజ్యమేలుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు పేదలకు కాస్త ఊరట కలిగించినా, పట్టణ ప్రాంత శ్రామిక వర్గాలకు ఆ భరోసా సైతం కరవైంది. అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వస్తున్న ఆదాయానికీ ఖర్చులకూ లంకె కుదరక చాలామంది నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడటంతో వాటిలో పనిచేసే సుమారు 60 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి కోల్పోయారు. పేరున్న పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం పది శాతానికి మాత్రమే ఉద్యోగ భద్రత ఉంటోంది. వారూ చాలీచాలని జీతాలతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వారు కుటుంబ పోషణ కోసం అసంఘటిత రంగంలో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. ఇటువంటి వారి ముందస్తు ఆర్థిక ప్రణాళికలన్నీ దెబ్బతిన్నాయి. అనేక మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లూ ఉన్నారు.
ఆదాయంలో 60 శాతాన్ని..
మరోవైపు, నానాటికీ క్షీణిస్తున్న ఉపాధి అవకాశాల ప్రభావం పేదలు, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం మీదా పడుతోంది. పౌష్టికాహారానికి దూరమైన వారు త్వరగా వ్యాధుల బారిన పడతారు. దీనికి తోడు దేశంలో సామాన్యుల ఆరోగ్య అవసరాలకు తగిన ఆర్థిక రక్షణలు లేకపోవడంతో ఏటా సుమారు 6.3 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోతున్నారని నీతిఆయోగ్ అంచనా వేసింది. ప్రస్తుతం జనాభాలో అధిక శాతం తమ ఆదాయంలో 60 శాతాన్ని వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా 24 వేల ఆసుపత్రులలో పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని అందిపుచ్చుకోకపోవడంతో ప్రజలకు మేలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పంతాలూ పట్టింపులు మాని ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తే పేదలకు అప్పుల భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తే ఎక్కువ మందికి సురక్షిత వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది.