కొవిడ్ వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పట్టాలెక్కించడానికి, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉనికిని కాపాడటానికి, పెద్ద కార్పొరేట్ సంస్థల దివాలా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలకు ఉపక్రమించింది. ఆ దిశగా మూడు ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించింది. వీటితోపాటు రిజర్వు బ్యాంకు తీసుకున్న మద్దతు చర్యల విలువ కలిపి రూ.29.87 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 15శాతం. ఈ ఉద్దీపన విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎప్పుడు, ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడే చెప్పలేం. కార్పొరేట్ సంస్థల ద్రవ్యత్వంపై దృష్టి సారించిన ఈ ఉద్దీపన చర్యలు.. కార్పొరేట్ రంగంలో పరిస్థితులు మరింత దిగజారకుండా నిరోధించగలిగాయి.
వడ్డీలు చెల్లించే స్థితికి..
రుణ కేటాయింపులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న కంపెనీలపై అధిక భారం పడుతుంది. ఈ రూపాల్లో అందించే సహాయం ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసే సహాయానికి ఎంత మాత్రం సమానం కాదు. భారతీయ కంపెనీలు దివాలా అంచుకు జారితే వాటి విలువ తగ్గుతుంది. అప్పుడు విదేశీ పెట్టుబడిదారులు లిస్టెడ్ కంపెనీలను తక్కువ విలువకే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలు వాటి అప్పులపై వడ్డీలు చెల్లించే స్థితికి ఎదగడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. ఎంతోమందికి జీవనాధారమైన, ప్రభుత్వాలకు ప్రధాన వనరులైన కార్పొరేట్ సంస్థలను కాపాడి, వాటి సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
సంక్షోభాలను ఎదుర్కొనేలా..
కొవిడ్ సంక్షోభంలో కార్పొరేట్ రంగం పునరుజ్జీవనంపై ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది. దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ 'కో-చైర్'గా వ్యవహరించారు. ఇది కార్పొరేట్ రంగ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు, రూపొందించాల్సిన విధివిధానాలపై సమగ్ర నివేదిక ఇచ్చింది. కార్పొరేట్ కంపెనీలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) అందించే మద్దతు కేవలం వాటి రుణ సమస్యలను పరిష్కరించేలా మాత్రమే కాదు- భవిష్యత్తులోనూ సంక్షోభాలను ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాన్ని కల్పించేలా ఉండాలి. దేశంలోని అన్ని కంపెనీలకూ ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మార్కెట్ వైఫల్యాలను అదుపులో ఉంచుకుంటూ- ఆర్థిక వనరులను సంరక్షించి, విలువను సృష్టించే సంస్థలకు ప్రభుత్వ వనరులను తరలించాలని సూచించింది.
ఎంఎస్‌ఎంఈల ప్రాధాన్యం..
ప్రభుత్వం ఏ కంపెనీలకు సహాయం చేయాలనేది- దాని ప్రాధాన్యాలు, అందుబాటులో ఉన్న వనరులు, మార్కెట్ వైఫల్యాలకు సామాజిక వ్యయాలకుగల అనుసంధానం, ఏ కంపెనీలు ఏ విధమైన ప్రభుత్వ మద్దతు పొందాలనే నాలుగు అంశాలపై ఆధారపడి ఉండాలి. పెద్ద కంపెనీలు లాబీయింగ్ చేయగలవు. భారత్ లాంటి దేశాల్లో ఎంఎస్‌ఎంఈల వైఫల్యాలు సంఘటిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని దెబ్బతీసి అనధికారిక ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని పెంచుతాయి. కొన్ని రంగాల్లో కొన్ని పెద్ద కంపెనీలు- మార్కెట్‌ను శాసించకుండా పోటీ పరిస్థితులను సృష్టించడానికి ఎంఎస్‌ఎంఈల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. ఉన్న ఉద్యోగాలను సంరక్షించాలి. 'సృజనాత్మక విధ్వంసం (క్రియేటివ్ డిస్ట్రక్షన్)' విధానాలను ప్రోత్సహించాలి. దీనివల్ల పాత సంస్థలు మన ఆర్థిక వ్యవస్థకు సరిపోయే కొత్త సంస్థలుగా రూపాంతరం చెందడానికి అవసరమైన చొరవ తీసుకున్నట్లవుతుంది.
భరించతగ్గ స్థాయిలోనే..
ఇండియా రుణ-జీడీపీ నిష్పత్తి 85శాతానికి చేరింది. ఇది ప్రమాద స్థాయికి చేరిందా అన్న విషయం దేశంలో వడ్డీరేటుకు వృద్ధిరేటుకు మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది. వడ్డీరేటు దేశంలో వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వ రుణం భరించతగ్గ స్థాయిలోనే ఉన్నట్లని ఇటీవలి ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ లెక్కన దేశంలో ఇప్పటివరకు రుణాలపై ప్రభుత్వం చెల్లించే వడ్డీరేటు వృద్ధిరేటుకంటే తక్కువగానే ఉంది. కాబట్టి ప్రభుత్వ రుణం భరించదగ్గ స్థాయిలోనే ఉందని అభిప్రాయపడాల్సి ఉంటుంది.