కరోనా మహమ్మారి దెబ్బకు బడులు, కళాశాలలకు తాళాలు పడి, ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరగడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉపకరణాల పాత్ర పెరిగింది. తరగతులతో సంబంధం లేకుండా విద్యార్థులంతా వీటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉపకరణాల్ని అందించలేకపోతున్నారు. పేదరికం వల్ల ప్రతి 100 మందిలో 27 మంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు నోచుకోవడంలేదని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సర్వేలో వెల్లడైంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం నాలుగు శాతం కుటుంబాలకే కంప్యూటర్లు ఉంటే, 14 శాతం కంటే తక్కువ మందికి అంతర్జాల సదుపాయం ఉన్నదని ఇటీవలి 'ఆక్స్‌ఫామ్' సర్వేలో వెల్లడైంది. ఈ సౌకర్యాలు కరవై చాలామంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు దూరమయ్యారని ఆ సర్వే కళ్లకు కట్టింది.
ఆత్మహత్యల ఉదంతాలు..
ఉపకరణాల్ని కొనుగోలు చేయలేక, ఆన్‌లైన్‌లో పాఠాలు వినలేక ఒత్తిడికి లోనవుతున్న కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ చోటుచేసుకోవడం బాధాకరం. ఉపకార వేతనాలు అందక చదువుకోవడమే భారంగా మారిన పరిస్థితుల్లో- ఆన్‌లైన్ తరగతుల కోసం ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే మార్గం లేక ఆందోళనకు గురైన తెలంగాణకు చెందిన ఐశ్వర్యారెడ్డి అనే బీఎస్సీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ లేక ఆన్‌లైన్ పాఠాలు వినలేకపోతున్నానన్న కలతతో కేరళకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఉదంతాలు కలవరపరుస్తున్నాయి.
అంతర్జాల సదుపాయ కల్పన
ప్రపంచంలో చైనా (85.4 కోట్ల) తరవాత ఎక్కువ మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నది భారత్‌లోనే (56కోట్ల). పేద పిల్లల విద్యావసరాలకు ఉపకరణాలు లేకపోవడం, వారు ఆన్‌లైన్ తరగతులు వినడానికి వీలుగా అంతర్జాల సదుపాయాన్ని కల్పించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 'జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్ (ఎన్‌డీఎల్‌ఎం)'లో భాగంగా చేపట్టిన 'ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ (పీఎందిశ)' కార్యక్రమంలో డిజిటల్ అక్షరాస్యులుగా మారేవారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది.
నిరుపేదలకు బాసటగా..
ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగానో, రాయితీలపైనో ఉపకరణాలు అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరముంది. 12వ తరగతిలో అధిక మార్కులు సాధించిన 36వేల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 'కేరళ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం-2021' కింద ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అందించనుంది. నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలిచేందుకే రూ.311 కోట్లతో ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. పేద విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకు దూరమవుతున్నారని గ్రహించిన దిల్లీ హైకోర్టు- వారికి ఉపకరణాలను, ఉచిత అంతర్జాల సదుపాయాన్ని కల్పించాలని విద్యాసంస్థలను ఆదేశించింది.
సహృదయుల సహకారం..