ఉత్తరాఖండ్‌లో మంచుకొండ విరిగిపడి జలప్రళయం సంభవించింది. అమెరికాలోని టెక్సాస్ వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో గడ్డ కట్టించే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పును నిలువరించే తక్షణ చర్యలు తీసుకోనట్లయితే- రాబోయే కాలంలో మానవాళి మనుగడనే ఇది ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. ప్రతి సెకనుకూ ఒక ఫుట్‌బాల్ మైదానం అంత అడవి ఈ భూమినుంచి అంతరించిపోతోందని అంచనా. రానున్న ఉపద్రవాన్ని గుర్తించిన దేశాలు ఇప్పటికే మేల్కొని- వాతావరణ మార్పును అడ్డుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ఆశావహ పరిణామం. భారత్ వంటి దేశాలు సైతం పర్యావరణ ప్రతికూలమైన పాతకాలపు ఆర్థిక వృద్ధి మూసల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి. సుస్థిర అభివృద్ధికి దోహదపడే నూతన వనరులను గుర్తించాలి.
తరుముతున్న విపత్తులు
వాతావరణ మార్పుల ఫలితంగా భూమిపై తరచూ అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి. ఆకస్మిక వరదలు వెల్లువెత్తుతాయి. కరవుకాటకాలు సంభవిస్తాయి. ఇలాంటి విధ్వంసకర దుష్ప్రభావాలవల్ల పేద దేశాలే అత్యంత అధికంగా దెబ్బతింటాయి. గ్రీన్ హౌస్ ఉద్గారాలు 1990లో 24.8 బిలియన్ టన్నులు ఉండగా, 2017నాటికి అవి 50.8 బిలియన్ టన్నులకు రెట్టింపు అయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక టన్ను కర్బన ఉద్గారాల సామాజిక వ్యయం 100 డాలర్లు ఉంటుందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత జోసెఫ్ స్టిగ్లిజ్ లెక్కగట్టారు. ఆర్థిక వ్యవస్థపై వీటి నివారణ చర్యల భారం తీవ్రంగానే ఉంటుంది. ఉదాసీనంగా ఉండిపోతే, సమాజం ఎదుర్కోవలసి వచ్చే ప్రకృతి విపత్తులు బీభత్సంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అటు సమాజాన్నీ ఇటు ఆర్థికాన్నీ రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది నిజంగా సవాలే. ఎందుకంటే.. రేపటి విపత్తును కచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదు. వాతావరణ మార్పు విషయంలో ఇది మరీ కష్టం. కాలుష్యం, గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఎంత ఎక్కువైతే వాటి విపరిణామాలు అంత అధికమవుతాయి. అవి ఎంత అధికమైతే వాటిని ఎదుర్కోడానికి అయ్యే వ్యయాలూ అంత పెరుగుతాయి. చివరకు ఇదొక విష వలయంగా మారిపోతుంది.
హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా..
ప్రపంచం ఇప్పటికే సుస్థిర హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టదలచే పారిశ్రామికవేత్తలకు, దేశాలకు నిధుల లభ్యత క్రమంగా పెరుగుతోంది. హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పరివర్తన వేగవంతం కావాలి. ఇందుకు వీలుగా ప్రభుత్వ చట్టాలూ నిబంధనలూ మారాలి. ప్రాజెక్టుల రుణ సమీకరణ అర్హతల్లో మార్పులు తీసుకురావాలి. బ్యాంకులతో సంప్రదించి ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించాలి. పర్యావరణ కాలుష్యం, గ్రీన్‌హౌస్ ఉద్గారాల కొలమానం ఆధారంగా రుణాలు ఇవ్వాలి. కేవలం నిర్మాణ కాలంలోనే కాకుండా, ప్లాంటు జీవితకాలంలో అది వెలువరించే మొత్తం ఉద్గారాలను పరిగణనలోకి తీసుకునేలా- ప్రస్తుత పర్యావరణ ప్రభావ మదింపునకు భిన్నంగా నూతన నిబంధనలు ఉండాలి. పరామితులకు అనుగుణంగా ఉంటేనే రుణాలు అందించాలి. వడ్డీ రేట్లకూ ఈ అర్హతలను వర్తింపజేయాలి. అదేవిధంగా, క్రెడిట్ రేటింగును ఉద్గారాలతో ముడిపెట్టాలి. ఈ చర్య పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
వినూత్న విధానాలు..