తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వ్యయం పెరిగితేనే ఆర్థికానికి ఊపు - corona pandemic effect on indian economy

కరోనా రెండో దశ విజృంభణ- ఆర్థిక వృద్ధి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారతదేశ జీడీపీకి అత్యధిక వాటాను అందించే పారిశ్రామిక రాష్ట్రాల్లో కొవిడ్‌ దెబ్బకు పాక్షిక లాక్‌డౌన్‌లు విధించడం దేశ జీడీపీని కుంగదీయనుంది. ఈ గడ్డు పరిస్థితుల్లో పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీని అత్యవసరంగా పునరుద్ధరించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి అయ్యే ఖర్చును తట్టుకోవాలంటే ప్రభుత్వం అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకుని, డబ్బు ఆదా చేసి కొవిడ్‌ సహాయ ప్యాకేజీలకు మళ్లించాలని సూచిస్తున్నారు.

economy
ఆర్థిక వృద్ధి సాధించాలంటే వ్యయం చేయాల్సిందే!

By

Published : May 8, 2021, 6:33 AM IST

మొదటి దశ కొవిడ్‌ విజృంభణ సద్దుమణిగిన తరవాత భారతదేశం మళ్లీ ఆర్థిక వృద్ధి పథంలో పరుగు ప్రారంభిస్తుందని ఆశలు వెల్లివిరిశాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 12.6 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 10.5శాతం వృద్ధిని ఊహించింది. ఇంతలో కొవిడ్‌ రెండో దశ సునామీలా విజృంభించి- వృద్ధి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారతదేశ జీడీపీకి అత్యధిక వాటాను అందించే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్‌ బంగ, కర్ణాటక, దిల్లీ వంటి పారిశ్రామిక రాష్ట్రాలు కొవిడ్‌ దెబ్బకు పాక్షిక లాక్‌డౌన్‌లు విధించడం మన జీడీపీని కుంగదీయనుంది.

అమెరికా విజయం

కొవిడ్‌ విపత్కాలంలో కేంద్రం విత్తలోటుకు వెరవకూడదని, చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తేనే జన జీవితాలు మెరుగుపడి, ఆర్థిక రథం వృద్ధి పథంలో దూసుకుపోతుందని అమెరికా నిరూపిస్తోంది. గడచిన సంవత్సర కాలంగా అమెరికా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలపై ఆరు లక్షల కోట్ల డాలర్లు వెదజల్లి, నేడు సంపన్న దేశాల్లోకెల్లా అత్యధిక వృద్ధిరేటు సాధించింది. ఈ ఏడాది ఆ దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతాన్ని మించవచ్చు. ప్రజలకు నగదు సహాయం అందించడంతోపాటు వేగంగా టీకాలు వేయడం ద్వారా అమెరికా ఈ ఘన విజయం సాధించింది. భారీ సహాయ ప్యాకేజీ వల్ల అమెరికాలో ఇప్పటికే 100 శాతం దాటిన అప్పులు- జీడీపీ నిష్పత్తి క్రమంగా 109శాతానికి, అక్కడి నుంచి 127శాతానికి పెరగవచ్చునని రేటింగ్‌ సంస్థల అంచనా.

అల్పాదాయ వర్గాలకు, నిరుద్యోగులకు, చిన్న వ్యాపార సంస్థలకు అందించిన నగదు సహాయాలు అమెరికా విత్తలోటును పెంచాయి. అదే సమయంలో జనం చేతికి అందిన డబ్బు మార్కెట్‌లోకి ప్రవహించి వస్తుసేవల అమ్మకాలను పెద్దయెత్తున పెంచి, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి తోడ్పడుతోంది. కొవిడ్‌ వల్ల 2020 ఫిబ్రవరిలో మొదలైన ఆర్థిక మాంద్యం అమెరికా చేపట్టిన బృహత్తర సహాయ ప్యాకేజీ వల్ల 2023లో అంతం కానుంది. ఈ ప్యాకేజీకి తోడు టీకా కార్యక్రమం జోడు గుర్రాలై అమెరికా ఆర్థిక రథాన్ని వేగంగా ముందుకు ఉరికిస్తున్నాయి. ఏప్రిల్‌ 30 నాటికి అమెరికా జనాభాలో 30శాతానికి (10కోట్ల మందికి) రెండు డోసుల టీకాలు వేయడం పూర్తయింది. 43శాతం జనాభాకు ఒక డోసు ఇచ్చారు. ప్రతి వయోజనుడికి వేయడానికి కావలసిన టీకాలకన్నా ఎక్కువ నిల్వలనే అమెరికా సిద్ధం చేసుకుంది. జో బైడెన్‌ అధ్యక్ష పదవిని చేపట్టాక అమెరికాలో కొవిడ్‌ మరణాలు రోజుకు 4,000 నుంచి 1,000 లోపునకు తగ్గాయి.

ఇదీ చూడండి:'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ

నగదునంతా ఖర్చుపెట్టేయకుండా..

టీకాలు తెచ్చిపెట్టిన ధీమా, సర్కారు అందించిన నగదు చెక్కుల వల్ల జనం బయటికొచ్చి మోటారు వాహనాలు, ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గేమింగ్‌ పరికరాలు, కిరాణా సరకులు కొంటున్నారు. అమెరికా జీడీపీలో మూడింట రెండు వంతులు వస్తుసేవల వినియోగంపై జనం చేసే ఖర్చు నుంచే సమకూరుతోంది. ప్రజలు తమచేతికందిన నగదునంతా ఖర్చుపెట్టేయకుండా గణనీయ భాగాన్ని బ్యాంకుల్లో సైతం దాచుకుంటున్నారు. వారు ఇలా పొదుపు చేసిన మొత్తం రెండు లక్షల కోట్ల డాలర్లకు పైమాటే. వస్తు సేవలకు జనం నుంచి పెరిగిన గిరాకీని తీర్చాలంటే ఉత్పత్తిని పెంచాలి. అందుకు కావలసిన పెట్టుబడులు ఈ పొదుపు సొమ్ము నుంచి కూడా సమకూరుతాయి. అమెరికాలో నిరుద్యోగం తగ్గుతున్నా కొవిడ్‌ వల్ల ఊడిపోయిన ఉద్యోగాల్లో 84 లక్షలు ఇంకా తిరిగిరావలసి ఉంది. అమెరికా మళ్లీ ఆర్థికంగా విజృంభిస్తున్నందున కొత్త ఉద్యోగాలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తాయనే ఆశాభావాన్ని కార్పొరేట్‌ రంగం వ్యక్తీకరిస్తోంది. కొవిడ్‌ కాలంలో ఇంటి నుంచి పని ఎక్కువై డిజిటల్‌ సాంకేతికతలు విజృంభించాయి. ఈ సాంకేతికతల వల్ల ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత వికసించనుంది.

భారతదేశ అనుభవం

ఆర్థిక ఊర్ధ్వ గమనానికి టీకా కార్యక్రమమే ప్రాతిపదిక అని అమెరికా నిరూపిస్తుండగా, భారత దేశం ఆ విషయంలో ఇంకా వెనకబడి ఉంది. ఏప్రిల్‌ నెలాఖరుకు రెండు శాతం జనాభాకు మాత్రమే రెండు డోసులు పడగా, 11 శాతానికి ఒక్క డోసు వేశారు. 60శాతంకన్నా ఎక్కువ జనాభాకు వేగంగా టీకాలు వేసి, వారి చేతికి నగదు అందించడం ద్వారానే భారత్‌ మళ్లీ ప్రగతి సాధించగలుగుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్లమంది లబ్ధిదారులకు అదనంగా అయిదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందిస్తానని కేంద్రం ప్రకటించడం స్వాగతించాల్సిన విషయమే. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాలను మరింత పెంచాల్సి ఉంది. పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీని అత్యవసరంగా పునరుద్ధరించాలి.

దేశంలో పలు చోట్ల పాక్షిక లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నంతకాలం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం కష్టం. ఈ గడ్డు పరిస్థితిలో జనావళికి ఉచితంగా, వేగంగా టీకాలు వేస్తే వారు మళ్లీ జీవన పథంలోకి ధీమాగా అడుగుపెట్టగలుగుతారు. వ్యాపారాలూ పుంజుకొని ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. దీనంతటికీ అయ్యే ఖర్చును తట్టుకోవాలంటే ప్రభుత్వం అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకుని, డబ్బు ఆదా చేసి కొవిడ్‌ సహాయ ప్యాకేజీలకు మళ్లించాలి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలకన్నా ఎక్కువ సొమ్మునే మార్కెట్‌ రుణాలుగా స్వీకరించాలి. బడ్జెట్‌, విత్త లోటులకు వెరవకుండా ధారాళంగా ఖర్చు చేయడం ద్వారా మాత్రమే ప్రస్తుత విపత్తు నుంచి బయటపడగలం. తాము లోటులకు వెరవబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో ప్రకటించి ఉన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది.

కొవిడ్‌ రెండోదశతో ఆశలు వమ్ము

కొవిడ్‌ మొదటి దశలో కేంద్రం, రాష్ట్రాలు పేదలకు నేరుగా నగదు, రేషన్‌ సరకుల పంపిణీ చేపట్టాయి. పరిశ్రమలు, వ్యాపారాలకు కేంద్రం ఎంతో కొంత ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చింది. ఇలాంటి చర్యలతో ప్రభుత్వానికి ఖర్చులు పెరిగి 2020-21 జీడీపీలో విత్త లోటు 9.5శాతానికి చేరింది. 2021-22లో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకొంటే పన్నుల ఆదాయం పెరిగి విత్త లోటు 6.8శాతానికి తగ్గుతుందని కేంద్రం ఆశపడింది. కానీ, కొవిడ్‌ రెండో దశ విజృంభణ ఆ అంచనాను వమ్ము చేస్తోంది. ఇప్పటికే మన జీడీపీలో అప్పులు 74శాతం నుంచి 90శాతానికి చేరి, 2021 చివరికి 99శాతానికి పెరగనున్నాయి. ఈ పరిస్థితిలో కేంద్రం విత్తలోటును మరింత పెంచే నగదు సహాయాలు, ఉద్దీపనలను చేపట్టబోదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చూడండి:'కొవిడ్​ను వదిలేసి విమర్శకులపై మోదీ ప్రభుత్వం కొరడా'

ABOUT THE AUTHOR

...view details