స్వేచ్ఛాయుత ఆలోచన భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కులని, తెలుసుకొనేందుకు ప్రజలకుగల హక్కును ఐటీ చట్టంలోని 66ఏ నేరుగా ప్రభావితం చేస్తోందంటూ ఆ నిబంధనను సుప్రీంకోర్టు ఆరేళ్లనాడు అడ్డంగా కొట్టేసింది. ఏదైనా సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం, కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి సంబంధించిన ఐటీ చట్టంలోని 69ఏ, 79 సెక్షన్లను కొట్టేయకుండా, కొన్ని నియంత్రణలతో వాటిని అమలు చేయవచ్చనీ ఆనాడు న్యాయపాలిక ప్రకటించింది.
భావప్రకటన స్వేచ్ఛకు బంధనాలు..
ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన వివాదాస్పద కార్యక్రమంపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా- దేశంలో డిజిటల్ మీడియా పూర్తిగా అదుపు తప్పిందని, మొదట ఆ మాధ్యమాన్నే నియంత్రించాలనీ గత సెప్టెంబరులో 'గోడు' వెళ్ళబోసుకొన్న కేంద్ర ప్రభుత్వం రెండువారాలనాడు అన్నంత పనీ చేసింది. ఐటీ చట్టంలోని 69ఏకి కఠిన నిబంధనల కోరలు తొడిగి- 'సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం' నెలకొల్పుతున్నామంటూ డిజిటల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛకు బంధనాలు బిగించేసింది. సామాజిక మాధ్యమాల్లో విశృంఖలత్వాన్ని అదుపు చేసే పేరిట మీడియా స్వేచ్ఛకు గల రాజ్యాంగ రక్షణల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చజాలదని తాజాగా ఎడిటర్స్ గిల్డ్ ఆక్షేపించింది. అంతర్జాల వేదికపై వార్తాప్రచురణకర్తల పనిపోకడల్ని మౌలికంగా మార్చేసేలా కొత్త నిబంధనలున్నాయన్న గిల్డ్- డిజిటల్ వార్తా మాధ్యమాన్ని అహేతుక ఆంక్షల చట్రంలో కొత్త నిబంధనలు ఇరికిస్తున్నాయని గళమెత్తింది.
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుకను ఊడ్చేసేలా రూపొందించిన నిబంధనల్ని అమలు చేసే అధికారం తమకు మాత్రమే ఉందని కేంద్రం అంటోంది. మొట్టమొదటి సారిగా సర్కారీ నియంత్రణలోకి తెచ్చి, కఠిన ఆంక్షల కత్తుల బోనులో డిజిటల్ మీడియాను బంధించే అప్రజాస్వామిక నిబంధనల్ని ఉపసంహరించడమే సరైనది!
ఏ పార్టీ ప్రభుత్వాలన్న దానితో నిమిత్తం లేకుండా, నిక్కచ్చిగా నిజాల్ని ప్రచురించే/ప్రసారం చేసే మీడియా వేదికల్ని స్వీయ నియంత్రణలో ఉంచుకోవాలన్నదే తరతమ భేదాలతో అందరి బాణీ! పన్నెండేళ్ల క్రితం వార్తా ఛానళ్లలో ప్రసారాలకు కంటెంట్ కోడ్ పేరిట లక్ష్మణ రేఖలు గీయడానికి ప్రయత్నించి నాటి యూపీఏ సర్కారు భంగపడింది.