బాలికలకు సమానావకాశాలు, భద్రమైన భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ఏటా అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2012 నుంచి నిర్వహిస్తోంది. అంతకు నాలుగేళ్ల ముందు నుంచే జాతీయ స్థాయిలో అదే తరహా చొరవ కనబరుస్తున్న ఇండియాలో- లింగపరమైన దుర్విచక్షణ సామాజిక జాడ్యంగా తరాల తరబడి ఊడలు దిగి విస్తరించింది. పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలకు తెగబడే నైచ్యం మొదలు బాల్యవివాహాల దాకా చట్ట విరుద్ధంగా సాగుతున్న అమానుషాలది అక్షరాలా అంతులేని కథ.
ఆరేళ్లలోపు పిల్లల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 1961లో 976 మంది బాలికలు ఉండగా, ఆ నిష్పత్తి 2001 నాటికి 927కు, 2011 వచ్చేసరికి 918కి పడిపోవడమే- పురుషాధిక్య భావజాలం ఆడపిల్లలకెంతగా ప్రాణాంతకమవుతున్నదీ వెల్లడిస్తోంది. ఆ దురవస్థను దునుమాడటానికే 'బేటీ బచావ్ - బేటీ పడావ్' పేరిట ఎన్‌డీఏ తొలి జమానా 2015లో పట్టాలకెక్కించిన పథకం సత్ఫలితాలనిస్తోందని, బాలబాలికల నిష్పత్తి అయిదేళ్ల కాలావధిలో పదహారు పాయింట్లు పెరిగి 934కు చేరిందని కేంద్ర ప్రభుత్వం చాటుతోంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు గాను 422 చోట్ల జనన సమయ లింగ నిష్పత్తి మెరుగు పడిందని, యూపీ, పంజాబ్, హరియాణాలాంటి రాష్ట్రాల్లో బేటీ బచావ్ గణనీయ ప్రభావం కనబరచిందని నిన్న బాలికా దినోత్సవ సందర్భంగా సర్కారు వెల్లడించింది.
కొవిడ్ వేళ..
బాలింతల నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, సెకండరీ స్థాయి చదువుల్లో ఆడపిల్లల ప్రవేశాలు తొలి నాలుగేళ్లలో బాగా పెరిగాయంటున్నా- కొరివిగా దాపురించిన కొవిడ్ సంక్షోభం బాలికల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసింది. ప్రతి వెయ్యిమంది బాలలకు 950 మంది బాలికలు ఉండటం సానుకూల నిష్పత్తి కాగా, ఆ లక్ష్యానికి ఎంతో దూరంగా ఉన్న ఇండియాలో- కొవిడ్ వేళ బాల్య వివాహాల జాతర గుండెల్ని మెలిపెడుతోంది. సాధికార శక్తిగా బాలిక ఎదగగలిగే వాతావరణంలోనే యావద్దేశమూ ధీమాగా పురోగమించగలుగుతుంది!