ఐదు శాసన సభల్లోని 824 స్థానాలకు 18 కోట్ల మంది ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొనే మినీ సార్వత్రిక సమరంలో తొలి విడత పోలింగ్ ప్రక్రియకు నేడే తెరలేస్తోంది. 2016 ఎన్నికల్లో మొత్తం మీద 64 సీట్లు సాధించిన కమలనాథులు అందులో 60 స్థానాల్ని అసోంలోనే ఒడిసిపట్టి ఈశాన్యంలో మొట్టమొదటిసారిగా అధికారమనే ఉట్టికొట్టడం తెలిసిందే. తక్కిన నాలుగులో ఒకటి కేరళలో, మరో మూడు పశ్చిమ్ బంగలో దక్కడం- భాజపా శ్రేణులకు కొత్త ఊపిరులూదిన పరిణామమే! 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసోమ్‌లో తొమ్మిది, పశ్చిమ్‌బంగలో అంతకు రెట్టింపు గెలిచిన కమలం పార్టీ తక్షణ లక్ష్యం- తృణమూల్ కాంగ్రెస్‌ను పరాజయం పాలు చెయ్యడం, అసోమ్‌లో పునరధికారం సాధించడం!
క్రితంసారి గువాహటీలో అధికారం చేపట్టాకే- త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ అందలం అందుకొన్న భాజపా- నాగాల్యాండ్, మేఘాలయల్లోనూ చక్రం తిప్పగలిగిందన్నది గమనార్హం. తరుణ్ గొగోయ్ లాంటి దిగ్గజ నేతను కోల్పోయిన కాంగ్రెస్- భాజపా కూటమిని దీటుగా ఎదుర్కోవడానికి బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్‌తో జతకట్టి మహా జోత్ (మహా కూటమి) ఏర్పాటు చేసింది. తాము అధికారానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేదే లేదని కాంగ్రెస్ కరాఖండీగా ప్రకటిస్తుంటే, తరుణ్ గొగోయ్‌కి మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం ద్వారా రాజకీయ చాణక్యం ప్రదర్శించిన భాజపా- సీఏఏపై వెనక్కి తగ్గేదే లేదంటోంది. వరదలతోపాటు అక్రమ వలసల్నీ నివారించగలిగేది తామేనంటున్న భాజపా కూటమి- కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే శీఘ్రగతిన అభివృద్ధి (డబుల్ ఇంజిన్ గ్రోత్) సాధ్యపడుతుందని ఢంకా బజాయిస్తోంది. ఏ స్థాయి ఎన్నికలన్న దానితో నిమిత్తం లేకుండా మింటినీ మంటినీ ఏకం చేసే బహుముఖ ప్రచారార్భాటంతో భాజపా నేతల ముట్టడి- మూడంచెల పోలింగ్ జరిగే అసోమ్‌ను వచ్చే నెల ఆరు దాకా అట్టుడికించనుంది.