తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వ్యాక్సిన్ల అనిశ్చితి కేంద్రం పుణ్యమే - ఈనాడు సంపాదకీయం తాజా

శాస్త్రీయ విధానాలే పునాదులుగా జాతీయ టీకా వ్యూహాన్ని నిర్మించామని నిన్నమొన్నటి వరకు నమ్మబలికిన కేంద్రం- ప్రజలకు పక్కాగా వ్యాక్సిన్లు అందకపోవడానికి రాష్ట్రాలే కారణమంటూ తప్పును తాజాగా వాటిపైకి తోసేస్తోంది. 130 కోట్లకు పైబడిన జనాభా కలిగిన దేశం రెండు టీకాలపైనే ఆధారపడటం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నా.. విదేశీ వ్యాక్సిన్లకు పచ్చజెండా ఊపేందుకూ ప్రాణాంతక నిర్లక్ష్యమే చోటుచేసుకుంది. టీకాలకు కేంద్రీకృత సేకరణ, పంపిణీ వ్యవస్థ ఉండాలన్న సూచనలూ కేంద్రానికి రుచించడం లేదు.

vaccination
వ్యాక్సినేషన్​, దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ

By

Published : May 29, 2021, 7:31 AM IST

టీకాల కోసం ఇప్పుడు మొత్తం ప్రపంచం మనవైపు ఆశగా చూస్తోందని ప్రధానమంత్రి ప్రకటించి పట్టుమని అయిదు నెలలు కాలేదు- వ్యాక్సిన్ల కొరతతో దేశీయంగా కరోనాపై కదనం కట్టుతప్పిపోయింది! శాస్త్రీయ విధానాలే పునాదులుగా జాతీయ టీకా వ్యూహాన్ని నిర్మించామని నిన్నమొన్నటి వరకు నమ్మబలికిన కేంద్రం- ప్రజలకు పక్కాగా వ్యాక్సిన్లు అందకపోవడానికి రాష్ట్రాలే కారణమంటూ తప్పును తాజాగా వాటిపైకి తోసేస్తోంది. వ్యాక్సిన్ల సేకరణలో నెలకొన్న గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటున్న నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ వాదన విస్మయం కలిగిస్తోంది!

నిపుణులు హెచ్చరిస్తున్నా..

ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాలు దూరదృష్టితో టీకాలను నిరుడే పురమాయిస్తున్నప్పుడు కేంద్రం అక్షరాలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంది. నిధులు సమకూర్చితే ఉత్పత్తిని పెంచగలమన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ తయారీదారుల అభ్యర్థనకు సైతం సకాలంలో స్పందించలేదు. నూటముప్ఫై కోట్లకు పైబడిన జనాభా కలిగిన దేశం రెండు టీకాలపైనే ఆధారపడటం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నా విదేశీ వ్యాక్సిన్లకు పచ్చజెండా ఊపడంలోనూ ప్రాణాంతక నిర్లక్ష్యమే చోటుచేసుకుంది. 'డిసెంబరులోనే దరఖాస్తు పెట్టినా దురదృష్టవశాత్తూ మాకు ఇంత వరకు అనుమతి లభించలేదు' అన్న ఫైజర్‌ సీఈఓ అల్బర్ట్‌ బౌర్లా ఇటీవలి వ్యాఖ్య- విదేశీ వ్యాక్సిన్ల దిగుమతిని సరళతరం చేశామంటున్న కేంద్రం మాటల్లోని డొల్లతనాన్ని వేలెత్తిచూపుతోంది.

అదెలా సాధ్యమో..

ఈ సంవత్సరాంతానికల్లా భారతీయులందరికీ టీకాలు అందిస్తామని కేంద్రం చెబుతున్నా అదెలా సాధ్యమో ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. వ్యాక్సిన్ల కోసం సొంతంగా గ్లోబల్‌ టెండర్లకు వెళ్లిన పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు బహుళజాతి సంస్థల నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది. టీకాల సేకరణలో కేంద్రీకృత వ్యూహాన్ని కేంద్ర సర్కారు కాలదన్నిన ఫలితంగా నెలకొన్న నిరాశావహ వాతావరణం ఇలాగే కొనసాగితే- ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులందరికీ వ్యాక్సిన్లు అందేసరికి నాలుగేళ్లు; అదే బిహార్‌, తమిళనాడులకయితే మూడేళ్లు చొప్పున పడుతుందంటున్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని పక్కనపెట్టి దేశవ్యాప్తంగా ఇంత అనిశ్చితికి కారణమైన కేంద్రం ఈ గందరగోళానికి రాష్ట్రాలనే బాధ్యులను చేయడం పూర్తి అసంబద్ధంగా ఉంది.

ప్రయోగపరీక్షల దశలోనే..

ప్రస్తుతం దేశీయంగా నెలకు ఏడు కోట్లుగా ఉన్న టీకాల ఉత్పత్తి జులై నాటికి రెండు రెట్లకు పెరుగుతుందని, ఆపై అయిదు మాసాల్లో ఆరు రెట్లు అవుతుందని కేంద్రం చిటికెల పందిళ్లు వేస్తోంది! కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పూత్నిక్‌-వి లకు తోడుగా అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెబుతున్న టీకాల్లో అత్యధికం ఇంకా ప్రయోగపరీక్షల దశనే దాటలేదు. కొవాగ్జిన్‌ ఉత్పత్తికి అనుమతి పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు కాలూచెయ్యీ కూడదీసుకుని ఉత్పత్తి ప్రారంభించేసరికి నాలుగు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందంటున్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని ఉన్నపళంగా పెంచడం అయ్యేపని కాదని ప్రముఖ వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ వంటి వారూ తేల్చిచెబుతున్నారు.

టీకాలకు కేంద్రీకృత సేకరణ, పంపిణీ వ్యవస్థ ఉంటే ఖర్చులు కలిసి రావడమే కాదు- వ్యాధి నుంచి ప్రజలకు సత్వర రక్షణ లభిస్తుందన్న మేలిమి సూచనలూ కేంద్రానికి రుచించడం లేదు. ఇప్పటికే ఆదాయాలు కోసుకుపోయి కునారిల్లుతున్న రాష్ట్రాలపై రూ.50 వేల కోట్లకు పైగా టీకాల సేకరణ భారాన్ని మోపిన కేంద్రం, స్వీయ అసమర్థ నిర్వాకం తాలూకు అనిశ్చితి పాపాన్ని ఇప్పుడు వాటి నెత్తికే చుట్టడం నివ్వెరపరుస్తోంది! దేశమంతటికీ అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే సమీకరించి, రాష్ట్రాలకు అందించి, భారతీయ వైద్యుల సంఘం సూచిస్తున్నట్లు ఇంటింటి టీకా కార్యక్రమాన్ని తక్షణం అమలుచేస్తే తప్ప ఉసురు తీసేస్తున్న కొవిడ్‌ ఉద్ధృతి నుంచి దేశం తెరిపిన పడదు!

ఇదీ చూడండి:కోరసాచిన ఆకలి రక్కసి- పస్తులతో అల్లాడుతున్న పేదలు

ఇదీ చూడండి:రైతుల నెత్తిన ధరల పిడుగు

ABOUT THE AUTHOR

...view details