తెలంగాణ

telangana

ETV Bharat / opinion

తెలుగు రాష్ట్రాల్లో వరద మిగిల్చిన నష్టాలు తీరేదెలా? - floods damage india

ఎన్నో రికార్డుల్ని బద్దలుగొట్టిన భీకర వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలమయ్యాయి. చాలా ఊళ్లూ, జనావాసాలే ఏరులయ్యాయి. మరోవైపు, పొంచి ఉన్న అంటురోగాల ముప్పు ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. చేతికందిన పంట నోటికి అందకుండా పోయిందని సాగుదారులు విలపిస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో.. వారిలో మళ్లీ ఆశలు చిగురింపజేసే బాధ్యత తమదేనన్న భరోసాను ప్రభుత్వాలు కల్పించాలి.

eenadu editorail on 17 october 2020 about recent floods in telugu states
తెలుగు రాష్ట్రాల్లో వరద మిగల్చిన నష్టాలు తీరేదెలా?

By

Published : Oct 17, 2020, 8:51 AM IST

Updated : Oct 17, 2020, 10:16 AM IST

నిండుకుండలాంటి నింగికి ఉన్నట్టుండి చిల్లి పడ్డట్లుగా దాపురించిన జలవిలయం ఉభయ తెలుగు రాష్ట్రాల్నీ ముంచెత్తింది. ఎన్నో రికార్డుల్ని బద్దలుగొట్టిన భీకర వర్షాల ధాటికి, వెన్నంటి పోటెత్తిన వరద ప్రవాహాల ఉద్ధృతికి- ప్రధానంగా ఏపీలోని ఆరు, తెలంగాణలోని పది జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎన్నోచోట్ల పంటచేలు చెరువుల్ని తలపించగా, చాలా ఊళ్లూ జనావాసాలే ఏరులయ్యాయి. చుట్టూ వరదనీరు, లోన ఎగసిపడుతున్న ఉద్వేగ దుఃఖసాగరం.. ఇప్పటికీ అనేక లంకగ్రామాలు, లోతట్టు కాలనీలు, ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితుల దుర్భరావస్థ ఇది! పెద్దమనసు చాటుకుంటున్న కారుణ్యమూర్తులు, స్వచ్ఛంద సహాయ సంఘాల చొరవతో- ముంపు నీటినుంచి వెలికిరాలేని వారికి పాలు, తాగునీరు వంటివి అందుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం పనుపున తక్షణ సహాయ చర్యలు ఇంకా చురుకందుకోవాల్సి ఉంది.

ఆ ముప్పు పొంచి ఉంది..

వరదనీరు తీసినకొద్దీ బయటపడుతున్న శిథిలాలు, ఎక్కడికక్కడ బురద మురుగు మేటలు వేసి వ్యాపిస్తున్న దుర్గంధం.. వర్షబీభత్స విస్తృతికి అద్దంపడుతున్నాయి. మరోవైపు, పొంచి ఉన్న అంటురోగాల ముప్పు ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఏటేటా వరదల ఉత్పాతం తరవాత తీరప్రాంతాలు, లంకగ్రామాలు విషజ్వరాలూ సాంక్రామిక వ్యాధుల పాలబడటం ఆనవాయితీగా మారింది. దురదృష్టవశాత్తు, ఈసారి పలు పట్టణ ప్రాంతాల్లోనూ అటువంటి విషాదం కోరసాచే ప్రమాదం ఉరుముతోంది. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించడంతోనే యంత్రాంగం బాధ్యత పూర్తయిపోయినట్లు కాదు.

సమన్వయం ఆవశ్యకం..

వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌, పురపాలక, రెవిన్యూ, నీటి సరఫరా, విద్యుత్‌... తదితర శాఖల సిబ్బంది మధ్య అర్థవంతమైన సమన్వయం ప్రస్తుత సంక్లిష్ట పరీక్షా ఘట్టంలో అత్యంత ఆవశ్యకం. కొవిడ్‌ కొరివిగా మారిన వేళ వరద బాధిత ప్రాంతాల్లో అంటురోగాలు రెచ్చిపోకుండా రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలూ సమర్థంగా కాచుకోవడమిప్పుడు విశేష ప్రాధాన్య అంశం!

ప్రభుత్వాల పైనే..

చూడబోతే, ఈసారి వరుణుడు తెలుగు రైతులపై పగ పట్టినట్లున్నాడు. చేతికందింది నోటికి అందకుండా పోయిందని సాగుదారులు విలపిస్తున్నారు. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నది ప్రాథమిక అంచనా. తెలంగాణలో నీటమునిగిన పైర్ల విస్తీర్ణం 7.35లక్షల ఎకరాలకు విస్తరించగా, అందులో సగం పంటను నష్టపోయినా నికరంగా రెండువేలకోట్ల రూపాయల మేర కోల్పోయినట్లేనని అధికారులే చెబుతున్నారు.

శ్రమఫలం దక్కనుందన్న దశలో వరి, పత్తి, మినుములు, మిర్చి మొదలు కూరగాయల పంటల వరకు చేజారి పెట్టుబడి సైతం గల్లంతేనని కుమిలిపోతున్న అభాగ్య రైతులకు ప్రభుత్వాలే రక్షణఛత్రం పట్టాలి. గుండె ముక్కలై దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న సాగుదారులను పాలకులే ఉదారంగా ఆదుకోవాలి. వెన్ను విరిగిన పైరును ఎవరూ ఎటూ నిలబెట్టలేరు. వరదపాలైన పంటను తిరిగి రాబట్టనూ లేరు. జిల్లాలవారీగా ఏయే రైతులు ఎంత మేర నష్టపోయారో చురుగ్గా మదింపు వేసి, వారిలో మళ్ళీ ఆశలు చిగురింపజేసే బాధ్యత తమదేనన్న భరోసాను ప్రభుత్వాలు కల్పించాలి.

కనీసం రబీ సాగుకైనా..

ఖరీఫ్‌ చేజారింది; కనీసం రబీ సాగుకైనా ఉచితంగా విత్తనాలను, ఎరువులను పంపిణీ చేయడంతోపాటు ఆర్థికంగానూ తోడ్పాటు అందించాలి. ఇన్నినాళ్ల కష్టం, అప్పో సప్పో చేసి గుమ్మరించిన పెట్టుబడి యావత్తూ వర్షార్పణమైందన్న రైతాంగం దుర్భర వేదనను మరిపించేలా- ఇరు రాష్ట్రప్రభుత్వాల వ్యూహాలూ పదును తేలాలి. దేశంలో నాలుగుకోట్ల హెక్టార్ల భూమికి వరదల ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, నష్టపోయిన సాగుదారులకు బాసటగా నిలవాల్సిన కర్తవ్యం కేవలం సంబంధిత రాష్ట్రప్రభుత్వానిది మాత్రమేనా? ప్రకృతి కన్నెర్రకు గురైన రాష్ట్రాల ఆర్తిని బాపేలా కేంద్రప్రభుత్వమూ తక్షణం మానవీయంగా స్పందించి నప్పుడే.. వర్ష విలయ బాధితులకు సాంత్వన!

ఇదీ చూడండి:కరోనా ధాటికి సంచారజాతుల బతుకులు కకావికలం

Last Updated : Oct 17, 2020, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details