తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వనరులతోనే విద్యావికాసం.. నూతన విధానంలో అదే కీలకం - Quality of Education

బాలలందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే.. ఈ విధానం అమలులో భాగంగా ప్రధానంగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. పాఠశాలల్లో తల్లిదండ్రులతో కమిటీలు ఏర్పాటు చేసి నాణ్యత, మౌలిక సౌకర్యాల కల్పనపై వారికి భాగస్వామ్యం కల్పించాలి. 21వ శతాబ్ది సవాళ్లకు తగిన విద్యను అందించి, విద్యార్థులను సృజనాత్మకంగా తీర్చిదిద్దాలి. అందుకోసం ఆదర్శనీయ విధానాలతోపాటు వాటి కార్యాచరణపైనా అదే స్థాయిలో శ్రద్ధపెట్టాలి.

EDUCATION WITH RESOURCES AND IT IS KEY TO THE NEW EDUCATIONAL SYSTEM
వనరులతోనే విద్యావికాసం

By

Published : Nov 7, 2020, 8:14 AM IST

ఎలాంటి అంతరాలకూ తావు లేకుండా బాలలందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఘనమైన ఆశయాలతో నూతన జాతీయ విద్యా విధానం రూపుదిద్దుకొంది. దేశ విద్యావ్యవస్థలో మౌలిక మార్పులు ప్రబోధిస్తున్న ఈ విధానం- అమలులో విజయవంతం కావాలంటే అందుకు తగిన ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అన్నదే కీలకం. దేశంలో ఆరునుంచి 18ఏళ్ల వయసున్న సుమారు ఆరుకోట్లకుపైగా పిల్లలు బడులకు వెళ్ళకుండా బయటే ఉన్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పునాది విద్యలో కీలక పాత్ర పోషించే చాలా అంగన్‌వాడీలకు సొంత భవనాలు లేవు. అయిదు కోట్లమంది పిల్లలకు కనీస విద్యా సామర్థ్యాలు లేవు.

అదే పెద్ద లోటు..

ఈ నేపథ్యంలో దేశ విద్యావ్యవస్థ చుట్టూ అల్లుకున్న అనేక సవాళ్లను కొత్త విధానంతో ఏ రకంగా ఎదుర్కోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయమై తగినంత కసరత్తు కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్రాల సమర్థ సమన్వయంతో మాత్రమే కొత్త విద్యా ప్రక్రియను మెరుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం సాధ్యమవుతుంది. ఆ ప్రాతిపదికన స్థానిక యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత విద్యావిధానంలో స్థానిక యంత్రాంగాల్లో జవాబుదారీతనం పెంచే అంశాలపై దృష్టిపెట్టకపోవడం పెద్ద లోటు.

'డ్రాపౌట్స్'​ తగ్గించాలి..

జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (డైస్‌)ల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 14.67 లక్షల పాఠశాలలుండగా- ఇందులో 73.09 శాతం ప్రభుత్వ స్కూళ్లే. వీటిలో దాదాపు 18.98 కోట్ల విద్యార్థులు చదువుతున్నారు. బడి బయట ఉన్న కోట్లాదిమంది పిల్లలను పాఠశాలల బాటపట్టించి వయసులకు తగ్గ తరగతుల్లో వారిని చేర్పించే ప్రక్రియపై కొత్త విధానంలో సవివర చర్చ చోటుచేసుకోలేదు. మహమ్మారి కరోనా విరుచుకుపడటంతో బడిమానేసిన పిల్లల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఈ పరిస్థితుల్లో 'డ్రాపౌట్స్‌'ను బళ్లకు తీసుకువచ్చేందుకు క్రియాశీల విధానాలు అవసరం. హైస్కూల్‌ స్థాయిలో ఎస్సీ విద్యార్థులు 22.55 శాతం, ఎస్టీలు 26.97 శాతం, బీసీ విద్యార్థులు 20.04 శాతం మధ్యలోనే బడి మానేస్తున్నారు. 9.97 శాతం మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులు బడికి దూరంగానే ఉన్నారని సచార్‌ కమిటీ నివేదిక స్పష్టం చేసింది.

అర్థం కాకపోవడం వల్లే..

విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థం కాకపోవడంవల్లే 'డ్రాపౌట్స్‌' శాతం పెరుగుతోంది. భాషాపరమైన సమస్యలూ ఇబ్బందిపెడుతున్నాయి. ఆదివాసీ గిరిజన తండాల్లోని పాఠశాలల్లో స్థానిక టీచర్లనే నియమించాలన్న ప్రతిపాదన మంచిదే. దీని ద్వారా వారికి పాఠాలు సులభంగా అర్థమవుతాయి. పది, పన్నెండో తరగతి విద్యార్థులకు వృత్తి విద్యలు నేర్పాలన్న ఆలోచన మెచ్చదగినదే అయినా- అందుకు అవసరమైన నిపుణులు ఏమేరకు అందుబాటులో ఉన్నారో, వారి సంఖ్యను పెంచుకోవడానికి చేయాల్సిందేమిటన్న దానిపై మరింత విస్తృత చర్చ జరగాలి.

కౌన్సిలర్ల ద్వారా..

దేశంలో ఇప్పటికీ ఒకే తరగతి గది ఉన్న పాఠశాలలు 4.3శాతం ఉండగా- 18శాతానికిపైగా పాఠశాలల్లో కేవలం రెండు గదుల్లోనే విద్యాభ్యాసం సాగుతోంది. మరోవంక 10.20శాతం ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే పనిచేస్తున్నారు. సుమారు 37శాతం పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవు. ఇక నీరులేక పాఠశాలల్లో ఉండీ నిరుపయోగంగా మిగిలిన శౌచాలయాల గురించి చెప్పనవసరమే లేదు. నూతన విద్యావిధానంలో విద్యార్థుల ఆర్థిక పరిస్థితులతోపాటు వారి అభ్యసన స్థాయినీ నిర్దుష్టంగా పరిశీలించాల్సి ఉంది. ప్రతి పాఠశాలకూ మనో విజ్ఞాన రంగంలో నిపుణులైన 'కౌన్సెలర్లు', శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తలను అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన మంచిదే అయినా- అది ఎంతవరకు ఆచరణసాధ్యమో చర్చ జరగాలి. దేశంలో 'కౌన్సెలర్ల'కు పెద్దయెత్తున కొరత ఉంది. ఈ తరుణంలో భారీగా 'కౌన్సెలర్ల'ను చేర్చుకుంటే తప్ప పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మానసిక భరోసా కల్పించడం సాధ్యమయ్యే పనికాదు.

మండల విద్యాధికారులను కొత్తవారితో భర్తీ చేస్తే..

ఈ విద్యావిధానం కొంతమేర బడుగు వర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదిగానే ఉన్నప్పటికీ- ఆ క్రమంలో ఎన్నో సవాళ్లనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మండల విద్యాధికారుల ఉద్యోగాలను ఉపాధ్యాయులతో కాకుండా కొత్త వారితో భర్తీ చేస్తే మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. విద్యార్థులతోపాటు అధ్యాపకుల హాజరును కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అంకితభావంతో పనిచేసే అధ్యాపకులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఉండాలి. పాఠశాలల్లో తల్లిదండ్రులతో కమిటీలు ఏర్పాటు చేసి- నాణ్యత, మౌలిక సౌకర్యాల కల్పనపై వారికి భాగస్వామ్యం కల్పించాలి. 21వ శతాబ్ది సవాళ్లకు తగిన విద్యను అందించి, విద్యార్థులను సృజనశక్తులుగా రూపుదిద్దాలంటే- ఆదర్శనీయ విధానాలతోపాటు వాటి కార్యాచరణపైనా అదే స్థాయిలో శ్రద్ధపెట్టాలి.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌, రచయిత - 'సెస్‌'లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌

ఇదీ చదవండి:భూతాపంతో.. జీవన్మరణ సంక్షోభం

ABOUT THE AUTHOR

...view details