కరోనా వేళ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలు జరపలేని దుస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా చివరి సంవత్సరం విద్యార్థుల భవితపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పుడీ పరీక్షల నిర్వహణ అక్షరాలా కత్తిమీద సామే. పరీక్షలు నిర్వహించాల్సిందేనంటున్న యూజీసీ మాత్రం మార్గదర్శకాలు ఇవ్వలేదు. 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. రెండు మూడు నెలల్లో వైరస్ ప్రభావం తగ్గి, విద్యాసంస్థలు పునఃప్రారంభమైనా పరిస్థితులు చక్కబడటానికి ఒకట్రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఈలోపు విద్యాసంవత్సరాన్ని విద్యార్థి కోల్పోకుండా ఉండాలంటే ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తగు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ విద్యావిధానం, ఆన్‌లైన్ బోధన, ఈ-లెర్నింగ్‌లపై దృష్టి సారించాలి.
ప్రసుత విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల జ్ఞాన సముపార్జన దిశను మార్చాలి. నూతన జాతీయ విధ్యావిధానం 2019లో సైతం డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. మైదానం ఆటలనుంచి ఆన్‌లైన్ గేమ్స్ వైపు చూస్తున్నట్లే, విద్యార్థుల ఉత్సుకతకు తగ్గట్లు ఉన్నత విద్యలోనూ ‘ఆన్‌లైన్’ మార్పులు అవసరం. వాస్తవవానికి ఆన్‌లైన్ విద్య విధానం శ్రేయస్కరం కాదు. విద్యార్థి సామర్థ్యాల మేరకు బోధించే నైపుణ్యాలు అధ్యాపకులకే ఉంటాయి. గురువు లేని విద్య విద్యే కాదు. అది విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడదు. ఉపాధ్యాయుడు, పుస్తకాలు లేకుండా విద్యార్థి రాయలేడు. ఊహాశక్తినీ పెంచుకోలేడు. సామర్థ్యాల గుర్తింపు, అందుకు అనుగుణంగా దిశానిర్దేశమూ కొరవడుతోంది. కేవలం విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థిని ఆదుకోవడానికి మాత్రమే ‘ఆన్‌లైన్’ పద్ధతిని ఆచరించడం అవసరం.
60 శాతం గ్రామీణ విద్యార్థులే..
ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో కేవలం 13 సంవత్సరాలకే విద్యార్థి మానసిక పరిపక్వత వృద్ధి చెందుతుంది. ఆ వయసు నాటికే అతడు శారీరక, మానసిక పరిపక్వతతోపాటు ఆధునిక పోకడలపై ఆసక్తి చూపుతున్నాడు. కంప్యూటర్, సెల్‌ఫోన్లు వంటివాటిపై మక్కువ చూపుతున్నాడు. అందులో భాగంగానే ఆన్‌లైన్ గేమ్స్, ఆన్‌లైన్ చాటింగ్, సామాజిక మాధ్యమాల వాడకం వంటివి మన దేశంలో రోజురోజుకూ వృద్ధి చెందుతున్నాయి. అంతేకాదు, బైజూస్ వంటి ఆన్‌లైన్ విద్యాసంస్థలు సైతం పెరుగుతున్నాయి.