కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి తరగతి గదులకు దూరమయ్యారు. నిరుడు మార్చిలో లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత గత విద్యాసంవత్సరం(2020-21)లో స్తబ్ధత నెలకొంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పాఠశాలల్లో పై తరగతులకు దశలవారీగా పరీక్షలు నిర్వహించగా, దిగువ తరగతుల విద్యార్థుల ఉత్తీర్ణతకు అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 2021-22 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన అనేక దేశాలు- తరగతులు, పరీక్షలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. భారత్‌లో కేసుల నమోదు క్రమేపీ తగ్గుతుండటంతో తరగతి గది ప్రత్యక్ష బోధన తిరిగి ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ- విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. దేశంలో దాదాపు 25కోట్ల మంది విద్యార్థులు ఆన్‌లైన్, డిజిటల్, రేడియో పాఠాలు విన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
పరీక్షలకు సన్నాహాలు
కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్రం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆన్‌లైన్, డిజిటల్, రేడియో పాఠాలను ప్రారంభించింది. తెరుచుకోని పాఠశాలల్లో బహుళ నమూనా విధానంలో బోధనను దీక్ష, స్వయం, కమ్యూనిటీ రేడియోల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దశలవారీగా పరీక్షలను నిర్వహించి గత విద్యాసంవత్సరాన్ని గట్టెక్కించాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి శ్రీకారం చుట్టాయి. స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకున్న విశ్వవిద్యాలయాలు స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతి గది బోధనను ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల్లో వైద్యవిద్య తరగతులు మొదలయ్యాయి. ఇంటర్మీడియట్, స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులు తమ విద్యాప్రణాళికల్లో మార్పుచేర్పులు చేసుకున్నాయి.
కేంద్రం సూచన మేరకు సిలబస్ తగ్గిస్తూ ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల తేదీలను ఇప్పుడిప్పుడే ప్రకటిస్తున్నాయి. మే నెలలో ఒకే షెడ్యూల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సైతం ఒకే షెడ్యూల్‌లో మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించింది. కేంద్రీయ సిలబస్ (సీబీఎస్‌ఈ) అనుసరిస్తున్న పాఠశాలల్లో 10, 12వ తరగతులకు బోర్డు పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతికి నవంబర్ రెండో తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి పేపర్లను ఏడుకు కుదించి జూన్‌లో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశోధన శిక్షణ మండలి ప్రకటించింది.