ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థతోనే దేశం సమున్నతంగా ఎదుగుతుందన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయం. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర ప్రస్థానంలో ఆ ప్రమాణాలను ఇండియా ఏ మేరకు సాధించగలిగిందన్నది ముంజేతి కంకణం! కనీస మౌలిక వసతులకు సైతం నోచుకోని సర్కారీ బడుల్లో బాలల విద్యాహక్కు కొల్లబోతోంది. సమగ్ర శిక్షా అభియాన్‌తో ఈ దుస్థితి తొలగి, నవతరానికి నాణ్యమైన విద్య అందుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఉపాధ్యాయ విద్యలను సమ్మిళితం చేసి మూడేళ్ల క్రితం కేంద్రం ఈ 'సమగ్ర' పథకాన్ని తీర్చిదిద్దింది. పాఠశాల విద్యలో గుణాత్మక మార్పుల సాధనే లక్ష్యంగా దీన్ని మరో అయిదేళ్ల పాటు కొనసాగించాలని మోదీ మంత్రిమండలి తాజాగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 11.6 లక్షల పాఠశాలలు, 15.6 కోట్లకు పైగా విద్యార్థులు, 57 లక్షల ఉపాధ్యాయులకు ఈ పథకం అక్కరకొస్తుందన్నది అంచనా! ప్రతిపాదిత వ్యయం రూ.2.94 లక్షల కోట్లలో రూ.1.85 లక్షల కోట్లను కేంద్రం తనవంతుగా రాష్ట్రాలకు అందించనుందంటున్నారు.
ఇప్పటికీ అరకొర నిధులే..
విద్యారంగాన్ని పైమెట్టున నిలబెట్టాలంటే జీడీపీలో ఆరు శాతం నిధులను ప్రత్యేకించాలని 1968 జాతీయ విద్యావిధానం సూచించింది. అదింకా ఆచరణ రూపంలోకి రానేలేదు! తత్ఫలితంగా అరకొర వసతులతో ప్రభుత్వ విద్యాలయాలు కునారిల్లుతున్నాయి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం నిరుడు వెల్లడించిన అధ్యయన ఫలితాలు వాటి దుస్థితిని కళ్లకు కట్టాయి. 12 రాష్ట్రాల్లోని 22శాతం బడులు పాత, శిథిల భవనాల్లో కొనసాగుతున్నాయి. 31శాతం పాఠశాల భవంతులు పగుళ్లు తేలాయి. విద్యాప్రమాణాల పరంగానూ పరిస్థితి ఆందోళనకరమేనని 'అసర్' నివేదికలు ఏటా తేటతెల్లం చేస్తూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు మొదలు విద్యార్థుల నైపుణ్యాల వరకు అన్నింట్లోనూ అభివృద్ధిపై గురిపెట్టిన సమగ్ర శిక్షా అభియాన్ సంపూర్ణంగా విజయవంతమైతేనే సర్కారీ విద్య శోభిల్లుతుంది!
ఉపాధ్యాయులకు శిక్షణ..