వచ్చే పదేళ్లలో నీలి ఆర్థిక దిగ్గజ శక్తిగా భారత్ ఎదుగుతుందంటూ మారిటైమ్ సదస్సులో ప్రధానమంత్రి మోదీ చేసిన సంకల్ప దీక్షా ప్రకటన- ప్రగతి సాగర మథనంలో గెలుపు తథ్యమన్న అచంచల ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. తొలుత వాజ్‌పేయీ జమానాలో తెరపైకి వచ్చి ఆపై యూపీఏ ఏలుబడిలో పూర్తిగా కనుమరుగైన 'సాగరమాల' పథకానికి మోదీ ప్రభుత్వం ఆరేళ్లక్రితం తిరిగి ఊపిరులూదింది. ఉన్న రేవుల్ని నవీకరించి, కొత్తగా ప్రపంచస్థాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పాలని అప్పట్లో తలపెట్టారు.
కరోనా సంక్షోభంతో భిన్నరంగాలు కుప్పకూలి వృద్ధి అంచనాలు తలకిందులైన దృష్ట్యా 'మారిటైమ్ విజన్ 2030' పేరిట సరికొత్త ముసాయిదా కూర్పువైపు మొగ్గుచూపిన కేంద్రం, అవసరానుగుణ మార్పులకు ఓటేసింది! వేలాది సంవత్సరాలపాటు ముఖ్య వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లిన ఓడరేవులు కలిగిన ఘనచరిత్ర భారతావనిది. ఏడున్నర వేల కిలోమీటర్ల మేర విస్తరించిన సుదీర్ఘ తీరప్రాంతం, పన్నెండు ప్రధాన నౌకాశ్రయాలు సహా రెండువందల వరకు పోర్టులు కలిగిన దేశంనుంచి ఏటా 140కోట్ల టన్నుల దాకా సరకు రవాణా అవుతోంది. ఈ సహజ బలిమికి నగిషీలద్దుతూ జలమార్గాల అభివృద్ధి, జలవిమాన సేవలు, షిప్‌యార్డులూ లైట్‌హౌస్‌ల వద్ద పర్యాటకాభివృద్ధికి కంకణబద్ధమైనట్లు ప్రధాని చెబుతున్నారు.
కొత్తపుంతలు..
2035 నాటికి నౌకాశ్రయాల పరిపుష్టీకరణ నిమిత్తం ఆరు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామంటూ- విదేశీ, స్వదేశీ పెట్టుబడులకూ ఆయన స్వాగతం పలికారు. గతంలో వెల్లడించిన విధంగా పశ్చిమ్ బంగ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వరకు గుదిగుచ్చిన మాలను తలపిస్తూ తీరప్రాంతాన నౌకాశ్రయాల్ని పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే- అవన్నీ అక్షరాలా జలసిరులకు ఆలవాలమవుతాయి. సముద్ర ఆధారిత పరిశ్రమ అన్నది కేవలం మత్స్యసంపదకే పరిమితం కాదు- విస్తృత జల రవాణా, ద్వీప పర్యాటకం, సాగర గర్భ మైనింగ్ తదితరాల మేళవింపుగా అది సాకారమైతే, యావత్ తీరప్రాంత అభివృద్ధీ కొత్త పుంతలు తొక్కుతుంది!