తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఎంత దయో మందుబాబులపై! - వైన్​ షాపులు

మందుబాబులు మద్యాన్ని హృద్యంగా హత్తుకునే అవకాశం కల్పించారు. లైన్లు... ఎక్కడికక్కడ లైన్లు. మండే ఎండలో, ఎండిన గుండెలతో నెట్టుకుంటూ, తిట్టుకుంటూ కిలోమీటర్ల లైన్లు. రోనా కర్కశ కోరల్లో ప్రపంచం కకావికలమవుతున్న తరుణంలో ఇదెంతటి ధీర దృశ్యం. ఎంతటి చారిత్రక ఘట్టం. ఈ వైరస్‌ విలయంలో బయటికి రాకండి బాబులారా అని ఎంత చెబుతున్నా ప్రజలు వినడం లేదు. మందు మత్తులో ముంచితే వాళ్లు ఇంట్లోనే పడుంటారుగా అనుకుంటున్నాయేమో ప్రభుత్వాలు.

EDITORIAL ON WINE SHOPS REOPEN
ఎంత దయో మందుబాబులపై!

By

Published : May 6, 2020, 7:30 AM IST

ధర్మప్రభువులు, దయార్ద్ర హృదయులు, ప్రజల నాడినే జీవనాడిగా చేసుకున్న ఏలికలు ఎట్టకేలకు సురాగారాలకు బీగాలు తొలగింపజేశారు. మందుబాబులు మద్యాన్ని హృద్యంగా హత్తుకునే అవకాశం కల్పించారు. లైన్లు... ఎక్కడికక్కడ లైన్లు. ఆకాశంలో విమానం పొగ గీతలా, మానిటర్‌ మీద రాకెట్‌ ప్రయాణ సూచికలా బారు బారు లైన్లు. మండే ఎండలో, ఎండిన గుండెలతో నెట్టుకుంటూ, తిట్టుకుంటూ కిలోమీటర్ల లైన్లు. కరోనా కర్కశ కోరల్లో ప్రపంచం కకావికలమవుతున్న తరుణంలో ఇదెంతటి ధీర దృశ్యం. ఎంతటి చారిత్రక ఘట్టం. అహో! ఇదంతా చూడటానికి దేవుడు రెండుకళ్లే ఇచ్చాడే. ఇన్నాళ్లూ పొడవు గురించి చెప్పాలంటే ‘కొండవీటి చాంతాడు’ అని ఉదహరిస్తూ వచ్చాం. మహా అయితే ఈ లైన్లలో అది బెత్తెడుంటుందేమో. అందుకే ఇకమీదట పొడవుల్ని ’లాక్‌డౌన్‌ మందు లైను’ అని రాసుకుంటే బాగుంటుందేమో!

ఇన్నాళ్లూ ‘అలవాటు చేసిన’ ప్రాణాలు. పర్మిట్‌ రూంలంటూ, పరవశించి తాగండంటూ ఏలికలు మందు ఊటతో నింపిన హృదయాలు... ఒక్కసారిగా మందు లేకుండా చేస్తే ఎంత తల్లడిల్లిపోయాయి. ఎంత దీనంగా రోదించాయి. పిచ్చిపట్టినట్లు ఎంతలా తన్నుకులాడాయి? ఇక మీదట ఈ తంటాలు లేవు. అన్నీ తూలులాటలే. ఇక నుంచి దొంగ సారాల అవసరంలేదు, అన్నీ లైసెన్సు మద్యాల మహా ప్రవాహాలే.

పాలనా జ్ఞానం బొత్తిగా లేని పెద్దలు అప్పట్లో సురాపానాన్ని పంచమహాపాతకాల్లో చేర్చారుగానీ, ఇప్పుడుండుంటే మాత్రం మందు ముట్టనివాడే మహా పాపాత్ముడని తేల్చేసేవారు. ఈ మందుబాబులే లేకపోతే ప్రభుత్వ పథకాలన్నీ ఏమైపోవాలి? ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు కావాలి? కర్ణుడు కుడిచేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలిసేది కాదట. దాన్ని చూసిందెవడూ! అయినా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, రాజరాజు అండతో వెనకాముందూ చూడకుండా పంచిన కర్ణుడి గొప్ప ఏంటంట! ట్యాక్సుల్ని లెక్కచెయ్యకుండా, ధరల్ని చూసి దడవకుండా రెక్కల కష్టాన్ని చుక్కలకు అంకింతం చేస్తూ సురప్రియులు ఎంత సమాజ సేవ చేస్తున్నారో! అలా చూస్తే కర్ణుడికన్నా వీళ్లే గొప్ప! తాగీ తాగీ లివర్‌ చెడిపోతున్నా, కిడ్నీలు కొట్టేస్తున్నా, కుటుంబం కునారిల్లుతున్నా ఎత్తే బాటిలూ దించే బాటిలుతో చెలరేగిపోతున్న ఈ సేవా సురార్తుల్ని ఏమని పొగడగలం? వీరికి ఇంతటి శుశ్రూష భాగ్యం కల్పిస్తున్న ప్రభుత్వాల ప్రజ్ఞా పాటవాల్ని ఎంతని మెచ్చుకోగలం! అన్నట్లూ దేవతలకి సురలు అనే పేరు ఎందుకొచ్చింది? సురాపానం చేస్తారు కాబట్టేకదా. ఆ రకంగా చూస్తే మందుబాబులకీ వాళ్లకి తేడా ఏముందట? పైగా వాళ్లు తాగితే స్టేటస్‌. వీళ్లు తాగితే స్టేట్‌కి జోష్‌! ఎకానమీ ఫుల్‌ ఖుష్‌!

ఇప్పుడు కరోనా గురించి కలవరింతలేదు. సామాజిక దూరం గురించి చింతలేదు. ప్రస్తుతం సర్కార్ల అజెండా ఒక్కటే... వీలైనంతగా సురగంగను ఉరకలెత్తించడం... ఖజానాను కళకళలాడించడం. ఈ కరువు కాలంలో తక్షణం కాసులు కురిపించే కల్పవృక్షం ఇంకేముందీ... ఒక్క మద్యం తప్ప. ప్రభుత్వాలకి ఇది ముట్టుకుంటే ముత్యం... పట్టుకుంటే బంగారమాయె. ఈ లాక్‌డౌన్‌లో పనీపాటాలేక అల్లాడుతున్న జనాలకి సాయంగా ప్రభుత్వం డబ్బులిస్తోంది. మరోవైపు నుంచి మద్యం రూపంలో ఆ రూకల్ని రెండింతలుగా రాబట్టుకుంటుంది. అవసరమైతే ఈ ఆదాయాన్నే మళ్లీ వారి సంక్షేమానికి మళ్లిస్తుంది. ఆహార గొలుసులా ఇదో ‘సుర సేవా చైను’ అన్నమాట. మందు విషయంలో పెరిగిన ధరలూ, పన్ను పీకుళ్ల వ్యవహారాలూ పట్టించుకునేదెవరూ! ఈ కష్టకాలంలోనూ ఇక తనఖా కొట్లలో కళకళ... గల్లాపెట్టెలు గలగలా. అంతగా ప్రజల్ని పానలోలుల్ని చేసిన పాలకులకి వేల వేల జోహార్లు. మేకకు తెలిసిందంతా మేత సంగతే... పాలకులు పెంచేదంతా మదిర సంతతే.

అన్నట్లూ, ఈ వైరస్‌ విలయంలో బయటికి రాకండి బాబులారా అని ఎంత చెబుతున్నా ప్రజలు వినడం లేదు. మందు మత్తులో ముంచితే వాళ్లు ఇంట్లోనే పడుంటారుగా అనుకుంటున్నాయేమో ప్రభుత్వాలు. అలాంటప్పుడు ఇంటింటికీ ముప్పూటలా మందు విందు అందిస్తే పోలా! ఆదాయానికి ఆదాయం...

నిర్బంధానికి నిర్బంధం. ఇక క్యూ లైన్లలో జనాల్ని చూస్తూ మండలం రోజుల తర్వాత పూర్తి మందు బలంతో వికసించే దేహానికి సామాజిక దూరం అవసరమేంటని కూడా ఎంచుతున్నాయేమో సర్కార్లు!

కానీ, నానాటికీ శక్తి పుంజుకుంటున్న కరోనా ఈ అంచనాల్ని తలకిందులు చేస్తే? అదే జరిగితే ప్రస్తుతం ‘బీసీ’ని ‘బిఫోర్‌ కరోనా’గా చెప్పుకుంటున్నాం, ఇక ‘ఏడీ’ని ‘ఆఫ్టర్‌ డ్రై డేస్‌ డిజాస్టర్‌’గా నిర్వచించుకోవాలేమో! అయినా ఏమైందీ... కాందబరి కల్పవృక్షం కాసులు కురిపిస్తుంటే చికిత్సకి లోటేముందీ, విచికిత్సకి తావెక్కడుందీ! జై సురా... పాలకా శహబాసురా!

ABOUT THE AUTHOR

...view details