తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహాయజ్ఞానికి ముందస్తు కసరత్తు- 'డ్రై రన్​' - వ్యాక్సిన్ల డ్రైరన్​

భారత్‌ బయోటెక్‌ (కోవాక్సిన్‌), సీరం ఇన్‌స్టిట్యూట్‌ (కొవిషీల్డ్‌) తమ వ్యాక్సిన్ల సత్వర అనుమతులకు అర్జీ పెట్టిన నేపథ్యంలో- టీకా కార్యక్రమానికి ముందస్తు సన్నాహకాల్లో భాగంగా కేంద్ర సర్కారు 'డ్రై రన్‌' నిర్వహించింది. దేశం నలు దిక్కులా నాలుగు రాష్ట్రాల్లోని తలో రెండు జిల్లాల్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు డమ్మీ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ ద్వారా- శిక్షణ మేరకు సిబ్బంది పనితీరు ఉందో లేదో అంచనా వేయడం మొదలు, కొవిడ్‌ పేరిట ప్రారంభించిన డిజిటల్‌ ఐటీ వేదిక లోటుపాట్లనూ పరీక్షించడం తాజా కసరత్తు లక్ష్యంగా ఉంది. ఒకే టీకాను రెండుసార్లు వేయాల్సిన పరిస్థితుల్లో- సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో వైద్య ఆరోగ్య శ్రేణులన్నీ కొవిడ్‌పై అసలైన సమరానికి సమాయత్తం కావాలి. దృఢ దీక్షా దక్షతలతో మహమ్మారికి ముగింపు పలకాలి!

Editorial on vaccine dry run in India
మహాయజ్ఞానికి ముందస్తు కసరత్తు- "డ్రై రన్​"

By

Published : Dec 30, 2020, 6:54 AM IST

ఆరోగ్యకర జీవితాలకు, ఏ వయసులో ఉన్నా అందరి స్వస్థతకు భరోసా ఇవ్వాలంటూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని నిర్దేశించుకొన్న ప్రపంచ దేశాలకు కరోనా సహస్రాబ్ది సవాలు విసరింది. అచిరకాలంలోనే సకల దేశాల్నీ చుట్టబెట్టి 18 లక్షలమందికిపైగా అభాగ్యుల్ని మృత్యుపరిష్వంగంలోకి నెట్టిన కొవిడ్‌ మహమ్మారి- అమెరికా బ్రిటన్‌ వంటి దేశాల్లో దారుణ మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. ప్రాణాంతక వైరస్‌ పనిపట్టే వ్యాక్సిన్ల తయారీ యుద్ధ ప్రాతిపదికన సాగి రెండు మూడు టీకా మందులు సత్వర అనుమతులు పొంది కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన వేళ ఇది. భారత్‌ బయోటెక్‌ (కోవాక్సిన్‌), సీరం ఇన్‌స్టిట్యూట్‌ (కొవిషీల్డ్‌) తమ వ్యాక్సిన్ల సత్వర అనుమతులకు అర్జీ పెట్టిన నేపథ్యంలో- టీకా కార్యక్రమానికి ముందస్తు సన్నాహకాల్లో భాగంగా కేంద్ర సర్కారు 'డ్రై రన్‌' నిర్వహించింది. దేశం నలు దిక్కులా నాలుగు రాష్ట్రాల్లోని తలో రెండు జిల్లాల్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు డమ్మీ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ ద్వారా- శిక్షణ మేరకు సిబ్బంది పనితీరు ఉందో లేదో అంచనా వేయడం మొదలు, కొవిడ్‌ పేరిట ప్రారంభించిన డిజిటల్‌ ఐటీ వేదిక లోటుపాట్లనూ పరీక్షించడం తాజా కసరత్తు లక్ష్యంగా ఉంది. దేశవ్యాప్తంగా గల దాదాపు 29 వేల కోల్డ్‌ చైన్‌ కేంద్రాల్లోని 86వేల శీతల ఉపకరణాల్లో వ్యాక్సిన్లను భద్రపరచి నిర్దిష్ట సమయానికవి టీకా కేంద్రాలకు సురక్షితంగా చేరేలా చూడటం, ఎవరు ఎప్పుడు ఎక్కడ టీకా వేయించుకోవాలో సంక్షిప్త సందేశాల ద్వారా ముందే తెలిపి సరైన వ్యక్తులకే టీకా వేయడం- అక్షరాలా ఓ మహాయజ్ఞం. టీకా దుష్ప్రభావాలేమైనా ఉన్నాయేమో పరిశీలించి, తక్షణ వైద్య సేవలందించడంతోపాటు ఆ వివరాల్ని వెంటనే నమోదు చేయడం- ఓ ఉద్విగ్న భరిత ఘట్టం! 23 మంత్రిత్వ శాఖల సమన్వయంతో కొవిడ్‌పై టీకా సమరానికి కేంద్ర ప్రభుత్వం పూర్వరంగం సిద్ధం చేస్తున్నవేళ గుర్తించాల్సిన కీలక అంశం- ప్రజారోగ్య సంరక్షణలో ఇది న భూతో న భవిష్యతి!

సార్వత్రిక టీకాల కార్యక్రమంతో దశాబ్దాలుగా విశేష అనుభవం గడించిన ఇండియాకూ కొవిడ్‌ విసరిన సవాలు సామాన్యమైనది కాదు. కరోనాపై యుద్ధంలో ముందు వరస పోరాట యోధులుగా నిలిచినవారి సంఖ్య రెండు కోట్లుగా గుర్తించిన ప్రభుత్వం- 50 ఏళ్ల పైబడిన వారు, అంతకంటే పిన్న వయస్కులైనా దీర్ఘకాల జబ్బులున్నవారు మరో 28 కోట్ల మంది ఉంటారని అంచనా కట్టింది. వచ్చే నెలలో వ్యాక్సిన్లకు ముందస్తు అనుమతులు ఇచ్చిన వెంటనే అంచెలవారీగా టీకాల కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో పట్టాలకెక్కించడానికి వీలుగా 681 జిల్లాల్లో దాదాపు 50వేల మందికి శిక్షణా పూర్తి అయింది. సార్వత్రిక టీకా కార్యక్రమం కోసం 82 లక్షల కేంద్రాలు సిద్ధంగా ఉన్నా- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంతకంటే మెరుగైన వసతులున్న వాటినే ఎంపిక చేయడంలో ముందస్తు జాగ్రత్త దాగుంది. సాధారణ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ సురక్షితమా కాదా, కచ్చితంగా రోగ నిరోధానికి పనికి వస్తుందా లేదా అన్నది నిగ్గుతేల్చే పరిశోధనలు పరీక్షల్లో ప్రతి అంచెలోనూ అవి నెగ్గుకు రావడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. అలాంటిది కాలంతో పోటీపడి కొవిడ్‌కు విరుగుడు వ్యాక్సిన్‌ కనిపెట్టడంలో బయోటెక్‌ సంస్థలు సాగించిన కృషి ఎనలేనిది. మూడో దశగా వేలమందిపై పరీక్షల్లో వాటి సామర్థ్యం రుజువైనా, రేపు కోట్లమందికి టీకాలు ఇచ్చేటప్పుడు ఏ కొద్దిమంది మీదో దుష్ప్రభావాలు ఉండే అవకాశం తోసిపుచ్చలేనిది. కేవలం టీకాలే అందుకు కారణం కాకపోవచ్చని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ చెబుతోంది. దుష్ఫలితాలు ఎదుర్కొన్న వారికి సత్వరం మేలిమి వైద్య సేవలందించడంతోపాటు, దీర్ఘకాలంలోనూ వాటిపై ఓ కన్నేసి ఉంచి దిద్దుబాట్లకూ సిద్ధంగా ఉండాలి. ఒకే టీకాను రెండుసార్లు వేయాల్సిన పరిస్థితుల్లో- సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో వైద్య ఆరోగ్య శ్రేణులన్నీ కొవిడ్‌పై అసలైన సమరానికి సమాయత్తం కావాలి. దృఢ దీక్షా దక్షతలతో మహమ్మారికి ముగింపు పలకాలి!

ABOUT THE AUTHOR

...view details