తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనాపై స్వీయ నిర్బంధంతోనే సమరం - కరోనా వైరస్​ లాక్​డౌన్​

ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎలాంటి ఆయుధం ప్రపంచం వద్ద లేదు. రోగానికి మందు లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రపంచంలో మనది అత్యధిక జనాభాగల రెండో దేశం. వైద్య సదుపాయాల పరంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో గల సౌకర్యాలు అతి స్వల్పం. కరోనా వైరస్‌ నివారణకు మందు లేక, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నాయకులు దూరదృష్టితో మనందరికీ అందుబాటులో ఉండే ‘స్వీయ నిర్బంధం’ పద్ధతిని తీసుకొచ్చారు.

EDITORIAL ON THE VALUES OF LOCDOWN
కరోనాపై నిర్బంధ సమరం

By

Published : May 6, 2020, 9:07 AM IST

మనవద్ద తగిన ఆయుధం లేనంతకాలం శత్రువు మహాబలవంతుడే. ఆయుధం చేతికందేవరకు ‘అలవిగాని చోట అధికులమనరాదు’ అన్నట్లు ఉండటమే మంచిది. సరిగ్గా ఇదే యుక్తిని నాడు మహాత్మాగాంధీ అనుసరించారు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి సమర వ్యూహాలకన్నా సత్యాగ్రహమే మిన్నగా భావించారు. గాంధీ చూపిన మార్గాన్నే ఇప్పుడు ప్రధాని మోదీ అనుసరిస్తున్నారు. మందు కనిపెట్టే వరకు స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనా బారినపడకుండా ఉండాలని దేశ ప్రజలకు తెలియజెబుతున్నారు.

చేతులు కాలకముందే మేల్కోవాలి...

తెల్లదొరలు ఏం చేసినా వారిని ఎదిరించడానికి ఎవరూ కలసిరారు. దానికి కారణం ఒక తెల్లదొర ఎంత తప్పుచేసినా మిగతా అధికారులంతా ఆయన్నే సమర్థిస్తారు. ఒకవేళ ఎవరైనా తిరగబడితే కారాగారంలో వేస్తారు. తెల్లదొరలు నివసించే ప్రాంతంలో ఇతరులు నివసించరాదు. వారితో సమానంగా కూర్చుని ప్రయాణం చేయరాదు. ఇవన్నీ చూసిన తరవాత తెల్లదొరల మధ్య ఆత్మగౌరవంతో బతకడం అసాధ్యమని గాంధీజీకి అర్థమైంది. వారితో ప్రత్యక్షంగా పోరాడలేమనీ తెలుసుకున్నారు. అందుకు ప్రత్యామ్నాయ ఆయుధం కావాలని భావించారు. అలా ఆవిర్భవించినదే- ‘సత్యాగ్రహ మహాఆయుధం’. నిస్సహాయులకు, అణగారినవారికి, పాలకుల అండ లేనివారికి ఉపయోగపడే అస్త్రమే ఈ సత్యాగ్రహం! కాలక్రమంలో అనేక దేశాలకు, వ్యవస్థలకు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టి సామాన్యుణ్ని మహాశక్తిమంతుడిగా తీర్చిదిద్దిందీ ఆయుధం!

ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎలాంటి ఆయుధం ప్రపంచం వద్ద లేదు. రోగానికి మందు లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు పొందిన అమెరికా, ఐరోపా దేశాలే విలవిల్లాడుతున్నాయి. మృతుల శవాల్ని పూడ్చడం లేదా దహనం చేయడానికి మనుషులు లేక కకావికలమవుతున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధులు చనిపోయినా ఫరవాలేదు, యువకులనైనా రక్షించుకుందామనే ఆలోచనలు సాగిస్తుండటం- భయానక స్థితికి అద్దం పడుతోంది.

ప్రపంచంలో మనది అత్యధిక జనాభాగల రెండో దేశం. వైద్య సదుపాయాల పరంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో గల సౌకర్యాలు అతి స్వల్పం. ఇటలీలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఆరుగురు వైద్యులు, మూడు ఆస్పత్రి పడకలు ఉన్నాయి. జర్మనీలో నలుగురు డాక్టర్లు, ఎనిమిది పడకలు, ఫ్రాన్స్‌లో ముగ్గురు వైద్యులు, ఆరు పడకలు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో 2.5 మంది డాక్టర్లు, మూడు పడకలు, చైనాలో 1.5 డాక్టర్లు, 4.34 పడకలు ఉన్నాయి. అదే మనదేశంలో ప్రతి వెయ్యి మందికి 0.55 డాక్టరు (1,800 మంది జనాభాకు ఒక డాక్టరు), 0.53 (ప్రతి 1,000 మందికి ఒక హాస్పిటల్‌ బెడ్‌) ఉంది. అంటే వైద్య సదుపాయాల్లో, డాక్టర్ల విషయంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో ఈ గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. అంత గొప్పగా వైద్య సదుపాయాలు, డాక్టర్లను కలిగిన ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌, అమెరికా దేశాలు కరోనా మహమ్మరి ధాటికి తట్టుకోలేక కొట్టుమిట్టాడుతుంటే మనదేశంలో కరోనా వ్యాప్తి రేటు పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

స్వీయ నియంత్రణే రక్ష...

కరోనా వైరస్‌ నివారణకు మందు లేక, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నాయకులు దూరదృష్టితో మనందరికీ అందుబాటులో ఉండే ఒకే ఒక ఆయుధం ‘స్వీయ నిర్బంధం’ పద్ధతులను తీసుకొచ్చారు. స్వాతంత్య్ర సముపార్జన కోసం నిస్సహాయ స్థితిలో గాంధీ నాడు ‘సత్యాగ్రహం’ అనే ఆయుధాన్ని ప్రయోగించి విజయం సాధించి, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. నేడు మనమూ ఈ స్వీయ నిర్బంధం అనే ఆయుధాన్ని ప్రయోగించి మహమ్మారికి దూరంగా ఉండాలి. మన నీతిశాస్త్రం ‘దుష్టం దూరేన వర్జయేత్‌’- చెడును వీలైనంత దూరంలో ఉంచాలని చెప్పింది. దీన్ని ఇబ్బందిగానో, నామోషీగానో తీసుకోకూడదు. రామాయణంలో వాలిని ఎదురుగా చంపడం సాధ్యం కాదు కనుక శ్రీరామచంద్రుడంతటి వాడు చెట్టుచాటు నుంచి బాణం వేసి వధించాడు. వాలి ప్రాణాలు విడిచే ముందు శ్రీరాముడి నైతికతను ప్రశ్నించినప్పుడు- మృగాలను వేటాడాలే తప్ప, వాటితో యుద్ధం చేయరని అంటాడు. అదేవిధంగా ఈ భయంకర వైరస్‌ను ఇంటి వద్దే ఉంటూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ సాధ్యమైనంత దూరంగా ఉంచాలే తప్ప, ఇష్టారాజ్యంగా వ్యవహరించి దాని చెంతకు వెళ్లరాదు. స్వీయ నియంత్రణే కరోనా పాలిట మారణాస్త్రం. స్వీయనిర్బంధం వల్ల ఆత్మ నిగ్రహం, పరిశుభ్రత, పొదుపు అలవాటు, వ్యాధి నిరోధకశక్తి, పర్యావరణ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాటి విలువల పట్ల గ్రహింపు పెరుగుతుంది. ప్రకృతితో వ్యవహరించే రీతులను అర్థం చేసుకునే జ్ఞానం ఇనుమడిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాచీన సంప్రదాయాలు, కట్టుబాట్లు, జీవన విధానంలోని గొప్పతనాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఈ స్వీయ నిర్బంధం మనకు ఇస్తుంది. భవిష్యత్తులో దేశాన్ని ‘స్వచ్ఛ భారత్‌’గా తీర్చిదిద్దుకోవడానికి ఈ నిర్బంధం (లాక్‌డౌన్‌) ద్వారా అలవడిన మంచి అలవాట్లను యథాతథంగా భవిష్యత్తులోనూ కొనసాగిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

--- ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉపకులపతి- ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం

ABOUT THE AUTHOR

...view details