సమర్థ మానవ వనరుల నిర్మాణంలో విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో విద్యారంగంలో పోటీతత్వం పెరగడంతో విద్య స్వరూపం మారిపోతోంది. నేడు చదువుకు గీటురాయిగా పరీక్షలు, మార్కులు, ర్యాంకులు అనే సంస్కృతి కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు సంగీతం, కళలు, పాటలు లాంటి ఇతర ఆసక్తికరమైన ఆటవిడుపు కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పాఠశాల విద్యలోని పాఠ్యాంశాలు, పరీక్షలు, మదింపు ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడానికి జాతీయ పాఠ్యప్రణాళిక విధివిధానాలకు (నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్- ఎన్‌సీఎఫ్-2020) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ శ్రీకారం చుట్టింది. నూతన పాఠ్య ప్రణాళిక విధివిధానాలకు అనుగుణంగా విషయ నిపుణుల సారథ్యంలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో తగిన మార్పులు చేసి, 2020 డిసెంబర్ నాటికి మధ్యంతరం నివేదిక సమర్పిస్తారు. కొత్త ఎన్‌సీఎఫ్ వచ్చే ఏడాది మార్చికల్లా సిద్ధంగా ఉంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆ తరవాత ఎన్‌సీఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కొత్త పాఠ్య పుస్తకాలను ఆయా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండళ్లు రూపొందిస్తాయి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, విద్యా విధాన సిఫార్సులతో పాఠ్యప్రణాళిక విధివిధానాలను ఎప్పటికప్పుడు సవరించడం ఆనవాయితీ. నేటి కరోనా సంక్షోభంలో పలు సంవత్సరాల అనంతరం ఈ కసరత్తును ప్రారంభించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అనేక సవాళ్లు...
దేశీయ విద్యా లక్ష్యాలు, గమ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికలు ఉండాలి. ఇవి సమర్థ బోధన, అభ్యసన ప్రక్రియలకు, పాఠశాల నిర్వహణకు పునాది వంటివి. పాఠ్యప్రణాళిక- విద్యార్థులు నేర్చుకోవాల్సిన, సాధించాల్సిన అంశాలను సూచిస్తుంది. పాఠ్యపుస్తకాల రూపకల్పన బోధనా పద్ధతులపై మార్గ నిర్దేశం చేస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో పాఠ్య ప్రణాళిక అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సృజనాత్మకత, పరిశీలన జ్ఞానం, శాస్త్రీయత, ప్రశ్నించే తత్వం తగ్గిపోవడంతో పాటు నైతిక విలువలు లోపిస్తున్నాయి. అంతేకాకుండా అసమగ్ర మూల్యాంకన వ్యవస్థ, బోధన పద్ధతులు, సాంకేతికత వంటి సమస్యలు విద్యా నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. విద్యార్థి సంపూర్ణ వికాసానికి దోహదం చేసేలా విద్యావిధానం ఉండాలనే వాదన విద్యావేత్తల నుంచి కొన్నాళ్లుగా వస్తున్నందువల్ల కేంద్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా పాఠ్యాంశాల భారం తగ్గింపు, ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన, ఏకరీతి సిలబస్, పరీక్షల్లో సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి అనేక మేలిమి సిఫార్సుల అమలు కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలని విద్యావిధానం చెబుతోంది. దీనికి అనుగుణంగా పాఠ్యపుస్తకాల భారాన్ని తగ్గించడంతోపాటు పాఠ్యాంశాల సరళీకరణకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్‌సీఎఫ్‌కు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా సృజనాత్మక ఆలోచనలు, జీవన నైపుణ్యాలు, భారతీయ నీతి, కళలు, సమైక్యత వంటి అదనపు అంశాలను సమ్మిళితం చేయాలని సూచించింది. నూతన విద్యా విధాన ముసాయిదా ప్రతిపాదించిన ఏకరీతి అంచనా, మూల్యాంకన వ్యవస్థ వంటి పరీక్ష సంస్కరణలను కూడా ఎన్‌సీఎఫ్ అమలు చేస్తుంది.
పెరుగుతున్న పాఠ్యాంశాలు, పరీక్షల ఒత్తిడి