ప్రపంచానికి క్రికెట్ పాఠాలు నేర్పిన ఇంగ్లాండ్, నిన్న చెన్నై టెస్టు నాలుగో రోజునే గింగిరాలు తిరుగుతూ చతికిలపడ్డ దృశ్యం అసంఖ్యాక అభిమానులకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ప్రస్తుత నాలుగు టెస్టుల పరంపరలో రెండోదాన్ని సొంతం చేసుకుని 1-1తో సమ ఉజ్జీగా నిలిచిన టీమిండియాను నవోత్తేజపరచే అద్భుత విజయమిది!
32ఏళ్లుగా గబ్బా మైదానంలో పరాజయమన్నది ఎరుగని అమేయ ఆసీస్ జట్టును దిమ్మెరపరచి 2-1 తేడాతో ఇటీవలే సిరీస్ నెగ్గి ఊపు మీద ఉన్న భారత బృందంలో- ఇంగ్లాండ్‌తో హోరాహోరీకి ముందు ఎనలేని ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమైంది. అలాంటిది, 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌కు మొదటి టెస్టును కోల్పోయి తీవ్ర భంగపాటు కొనితెచ్చుకుంది. అదే వేదికపై రెండో టెస్టులో తలపడిన ఇరుజట్లు- బండ్లు ఓడలైన సామెతను నిజం చేశాయి. రోజుల వ్యవధిలోనే ఫలితం తారుమారయ్యేలా అద్భుత ఆటతీరు కనబరచిన క్రీడాకారుల జాబితాలో తొలిస్థానం నిస్సంశయంగా, రవిచంద్రన్ అశ్విన్‌దే. రెండో టెస్టులో సొగసైన శతకంతోపాటు మొత్తం ఎనిమిది వికెట్లు సాధించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన అశ్విన్‌కు రోహిత్, రహానె, కోహ్లీ, అక్షర్ పటేల్ రూపేణా గట్టి తోడ్పాటు లభించింది.
పిచ్‌పై విమర్శలు
టపటపా వికెట్లు గిరాటేసుకున్న ఇంగ్లాండ్ దుస్థితిపై స్పందిస్తూ పిచ్ ఏమాత్రం బాగా లేదని విమర్శలు గుప్పించినవారిది పెడవాదమని అశ్విన్, రోహిత్‌ల బ్యాటింగ్ విన్యాసాలు సోదాహరణంగా నిరూపించాయి. ఈ ఏడాది భారత్‌లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ పోరులో పాక్ ఆటగాళ్లు నిలదొక్కుకోవాలంటే స్పిన్ బాగా ఆడాల్సిందేనని ఆ జట్టు ప్రధాన శిక్షకుడు మిస్బా-ఉల్-హఖ్ తాజాగా చెప్పింది అక్షరసత్యం. అదెంతటి నికార్సయిన నిజమో టీమిండియా చేతుల్లో ఇంగ్లాండ్ ఘోర పరాజయం చాటుతోంది.
టీమ్ఇండియా పోరాట పటిమతో..
జో రూట్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టెస్టుల పరంపరలో ఇంకో రెండు ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతెరా (అహ్మదాబాద్) మైదానంలో జరగనున్నాయి. సగం సిరీస్ ఇంకా మిగిలి ఉండగానే కోహ్లీ బృందాన్ని తాజా గెలుపు ఇంతగా ఉద్విగ్నపరచడానికి ప్రత్యేక కారణముంది. తొలి టెస్టులో ఓటమి కారణంగా ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ సంఘం) ర్యాంకుల్లో నాలుగో స్థానానికి పడిపోయిన ఇండియా, ఇప్పుడు విశేష పోరాట పటిమతో న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానానికి ఎగబాకింది.
మిగతా రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు గెలుపును దూరం చేసి 2-1తో లేదా 3-1తో భారత జట్టు సత్తా చాటగలిగితే జూన్‌లో లండన్, లార్డ్స్ వేదికపై ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్‌లో ఇండియా తలపడగలుగుతుంది. అదే ఇంగ్లాండ్, లార్డ్స్ తుది పోరులో స్థానం దక్కించుకోవడానికి ప్రస్తుత పరంపరను 3-1తో కైవసం చేసుకుని తీరాలి. ఈ సిరీస్‌లో 1-1తోగాని 2-2తోగాని ఇండియా, ఇంగ్లాండ్ సమఉజ్జీలుగా నిలిస్తే లార్డ్స్ అవకాశాన్ని ఆస్ట్రేలియా తన్నుకుపోతుంది.
అంచనాలు నిజమవుతాయా?
ఆల్‌రౌండ్ ప్రతిభతో పుంజుకొన్న భారత్ జోరును ఈ దశలో ఎవరూ నిలువరించలేరన్న వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్, మహమ్మద్ కైఫ్ ప్రభృతుల ముందస్తు అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో చూడాలి. ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పులో మెరుగుదలే టీమిండియాను బలవత్తర శక్తిగా మారుస్తోందని దిగ్గజ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతిస్తున్నారు. అటువంటి సానుకూలాంశాలు జట్టులో సమతూకానికి, నిలకడగా రాణించే లక్షణానికి దోహదపడేలా బీసీసీఐ ప్రణాళికలు పదునుతేలాలి. అందుబాటులో ఉన్న అపార యువ ప్రతిభను సమయానుకూలంగా సద్వినియోగపరచుకునే పటుతర కార్యాచరణే- జగజ్జేత హోదాకు భారత జట్టును చేరువ చేయగలుగుతుంది!