ఏటా అయిదు లక్షల రోడ్డు ప్రమాదాలు, లక్షన్నర మరణాలు, మూడు లక్షల మంది క్షతగాత్రులు.. ఇదీ మన దేశంలో రహదారులపై సాగుతున్న రక్తచరిత్ర! దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున రోజుకు 415 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో 18నుంచి 45 సంవత్సరాల వయసులోని వారే 70శాతం మేర ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో 70శాతం ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. దీనికితోడు అధ్వాన రహదారులు, సరైన శిక్షణ లేకుండానే వాహనాలు నడపడం, కాలం చెల్లిన వాహనాలను నడపడం వంటివి మృత్యుఘోషకు కారణాలవుతున్నాయి. ఈ తరుణంలో రహదారి భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రమాదాలను నివారించడంపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్డు ప్రమాదాలను 2025నాటికి 50శాతానికి, 2030నాటికి పూర్తిగా తగ్గించాలన్నది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. ఇందులో భాగంగానే జనవరి 18నుంచి నేటి వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
భయపెడుతున్న మరణాల సంఖ్య!
మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలోని పట్నా గ్రామంలో నిన్నటి రోజున ఓ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో 47మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రపంచంలోని వాహనాల్లో ఒక శాతం వాటా కలిగిన భారత్- రహదారి ప్రమాద బాధితుల్లో మాత్రం ఏకంగా పది శాతం వాటా కలిగి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెెల్లడించింది. సంపన్న కుటుంబాలతో పోలిస్తే- రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పేద కుటుంబాల్లో రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. రోడ్డు ప్రమాదాలు భారత్‌తో పోలిస్తే అమెరికా, జపాన్‌లలోనే అత్యధికంగా ఉన్నాయి. మృతుల సంఖ్య మాత్రం భారత్‌లోనే గరిష్ఠం. అమెరికాలో రోడ్డు ప్రమాదాల కారణంగా 2018లో 37,481 మంది మృతి చెందగా- జపాన్‌లో ఆ సంఖ్య 4,698గా ఉంది. భారత్‌లో మాత్రం లక్షన్నర మంది మృత్యువాతపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక రూపంలో రహదారులు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఏపీలో రోడ్డు ప్రమాదాలు అత్యధికం రాత్రి సమయాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 21,992 ప్రమాదాలు జరగ్గా- 7,984 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో మరణాలు దాదాపు 11శాతం తగ్గాయి. 2019లో జరిగిన ప్రమాదాల కారణంగా 6,964 మంది ప్రాణాలు కోల్పోగా- 2020లో ఆ సంఖ్య 6,668కి పడిపోయింది.