తెలంగాణ

telangana

ETV Bharat / opinion

inflation: కరోనా వేళ.. ద్రవ్యోల్బణానికి రెక్కలు - ద్రవ్యోల్బణం

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా.. ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ఇంధన ధరలు జనజీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. దేశీయావసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా, పకడ్బందీగా దిద్దుబాటు చర్యలు కొరవడి పరాధీనత తప్పడం లేదు.

inflation
ద్రవ్యోల్బణం

By

Published : May 28, 2021, 7:59 AM IST

Updated : May 28, 2021, 9:18 AM IST

మానవాళి భవిష్యత్తుకు కరోనా వైరస్‌ దయ్యంలా దాపురించిందని ఏడాదిక్రితం రిజర్వ్‌ బ్యాంక్‌ చేసిన వ్యాఖ్యలెంత అక్షరసత్యాలో అనునిత్యం రుజువవుతూనే ఉన్నాయి. ఒకవైపు వృత్తి ఉపాధులు పోనుపోను కొల్లబోతుండగా- మరోవైపు పలు రకాల నిత్యావసరాల ధరవరల ప్రజ్వలనం కోట్లాది వంటింటి బడ్జెట్లను తలకిందులు చేస్తోంది. పప్పులు, ఉప్పులు, కూరగాయలు, వంటనూనెలు, పళ్లు.. ఏవి కొనబోయినా సాధారణ ప్రజానీకం జేబులు కాలిపోతున్నాయి.

ప్రధానంగా ఆహార, చమురు ఉత్పత్తుల రేట్లు పోటెత్తి ద్రవ్యోల్బణానికి రెక్కలు మొలుచుకొస్తున్నాయి. కందులు సెనగలు తదితరాల ధరలు 16-20శాతం, కూరగాయలు 40-80శాతం, వాటిని తలదన్నేలా వంటనూనెలు భగ్గుమంటున్న తీరు- అసలే ఆదాయం కుంగిన వర్గాలకు దిక్కుతోచనివ్వడం లేదు.

దరాఘాతాలు..

ప్రస్తుతం తమ దృష్టంతా వృద్ధిరేటు పెంపుదల పైనేనని కేంద్ర అమాత్యులు చాటుతున్నా- ప్రముఖ రేటింగ్‌ సంస్థల అంచనాల్లో అదే తెగ్గోసుకుపోతూ, ద్రవ్యోల్బణం (inflation) పెచ్చరిల్లడం ఆందోళనకర స్థితిని కళ్లకు కడుతోంది. కొన్నాళ్లుగా పెట్రోలు, డీజిల్‌ రేట్లు గుక్కతిప్పుకోనివ్వని రీతిలో పెరుగుతుండటం ప్రస్తుత నిత్యావసర వస్తు ధరోల్బణానికి ప్రధాన కారణమన్న నిపుణుల విశ్లేషణలు- సమస్య మూలాల్ని స్పష్టీకరిస్తున్నాయి. చమురు ఉత్పత్తుల రీటైల్‌ ధరల్లో లోగడే 52 శాతందాకా లెక్కతేలిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతివాటం రెండేళ్ల వ్యవధిలోనే 70 శాతానికి ఎగబాకింది.పెట్రోసుంకాల పద్దుకింద ప్రభుత్వాల రాబడి అయిదేళ్లలో రూ.3.32లక్షల కోట్లనుంచి అయిదున్నర లక్షలకోట్ల రూపాయలకు పెచ్చుమీరి, ఇంకా విస్తరిస్తూనే ఉంది. కరోనా ప్రజ్వలనవేళ చమురు ధరాఘాతాలు జనజీవితాల్ని అతలాకుతలం చేస్తున్నా పట్టించుకోని దుర్విధానాల పర్యవసానంగానే, నిత్యావసర వస్తువుల రేట్లు ఇలా చుక్కల్ని తాకుతున్నాయి.

అరికట్టే మార్గాలేవి?


తక్కిన వాటి మాట ఎలాగున్నా, వంటనూనెల ధరల కట్టడికి కసరత్తు చేపట్టినట్లు కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రిత్వశాఖ చెబుతోంది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను ఆవిష్కరించే క్రమంలో వంటనూనెల రంగాన స్వయంసమృద్ధి సాధించదలచామంటూ నూనెగింజల ఉత్పత్తిదారులు, మిల్లర్లు, నిల్వదారులు ప్రభృతులతో ఇటీవలే అది మేధామథనం నిర్వహించింది. వంటనూనెలు మంటనూనెలుగా పరిణమించి దిగువ, మధ్య తరగతి బతుకుల్లో నిప్పులు చెరిగే ఉత్పాతాన్ని అరికట్టడానికి అనుసరించదగ్గ మార్గాలేమిటో ఇప్పుడెవరూ కొత్తగా శోధించనక్కర లేదు.

దేశంలో సరైన పంటల ప్రణాళిక అన్నదే కరవై, నూనెగింజల సాగు ఊపందుకోవడం లేదు. గత్యంతరం లేక నిరుడు విదేశాలనుంచి రప్పించిన వంటనూనెల దిగుమతుల వ్యయం సుమారు రూ.75వేల కోట్లు. దేశీయావసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా, పకడ్బందీగా దిద్దుబాటు చర్యలు కొరవడి పరాధీనత తప్పడం లేదు.

ప్రస్తుతం కోటిన్నర టన్నుల మేర దిగుమతులపై ఆధారపడుతున్న దేశంలో 2030 నాటికి ఆ పద్దు రెండున్నర కోట్ల టన్నులకు చేరుతుందంటున్నా- ప్రభుత్వమింకా తీరిగ్గా అంచెలవారీ సమావేశాల నిర్వహణలో నిమగ్నమైంది. అంతగా సారవంతం కాని నేలల్లో, వర్షాధార భూముల్లోనే నూనెగింజల సాగు కొనసాగిస్తున్నందువల్ల, కేవలం నాలుగు శాతం మాత్రమే నీటిపారుదల సౌకర్యం కలిగిన పొలాల్లో పండిస్తున్న కారణంగా- దిగుబడులు ఇతోధికం కావడం లేదని గతంలోనే అధ్యయన నివేదికలు నిగ్గుతేల్చాయి. భౌగోళికంగా, జనాభా పరంగా మనకన్నా ఎంతో చిన్నవైన దేశాల నుంచి దిగుమతులకు వెంపర్లాడే బదులు- దేశీయంగా దిగుబడుల్ని ఇతోధికం చేసే పటిష్ఠ కార్యాచరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధం కావాలి.

డెబ్భై దశకం నుంచీ విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్న దురవస్థ బదాబదలు కావాలంటే వంటనూనెల రంగంలో స్వయంసమృద్ధి సాధించి తీరాలి. పాలకశ్రేణిలో ఆ స్పృహ లోపించి విధానపరంగా తప్పటడుగులు కొనసాగినన్నాళ్లు జనం నిస్సహాయంగా భారీ మూల్యం చెల్లించే దుర్గతి చెక్కుచెదరదు!

Last Updated : May 28, 2021, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details