Editorial on Indian Democracy :స్వతంత్ర భారత చరిత్రలో 1975 జూన్- 1977 మార్చి మధ్యకాలంలో అమలైన ఆత్యయిక స్థితిని ప్రజాస్వామ్య క్షీణదశగా అభివర్ణిస్తుంటారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ అటు సంపూర్ణ ప్రజాస్వామ్యం, ఇటు సంపూర్ణ నిరంకుశత్వం కాని మధ్యస్థ స్థితిలోకి జారిపోయిందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే ఫ్రీడమ్ హౌస్ విశ్లేషణ ప్రకారం.. భారత్‌లో 2023కు ముందు మూడేళ్ల నుంచి పార్టీ రహిత వ్యవస్థ నడుస్తోంది. ఇండియాలో మైనారిటీల పట్ల దుర్విచక్షణ, హింస కొనసాగుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. 2022 చివరికి భారత్ సహా 42 దేశాలు నిరంకుశత్వం దిశగా మళ్ళుతున్నాయని స్వీడన్‌కు చెందిన గోథెన్ బర్గ్ విశ్వవిద్యాలయంలోని వెరైటీస్ ఆఫ్ డెమాక్రసీ (విడెమ్) పేర్కొంది! ఎన్నికలు జరిగే నిరంకుశ వ్యవస్థగా భారత్‌ను విడెం-2023 నివేదిక వర్ణించడమే కాదు.. గడచిన పదేళ్లలో అత్యంత నిరంకుశత్వం ప్రదర్శిస్తున్న వ్యవస్థగానూ నిర్వచించింది.
నేతలు... నేరచరితులు!
లండన్‌కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ భారత్‌ను లోపభూయిష్ఠ ప్రజాస్వామ్యంగా వర్గీకరించింది. 167 దేశాల జాబితాలో 53వ స్థానంలోకి భారత్‌ను నెట్టింది. ఈ తరహా ర్యాంకింగ్‌కు అంతర్జాతీయ సంస్థలు పాటించే ప్రమాణాల్లో నాలుగింటిని పరిశీలిద్దాం.
అవి:
- ఎన్నికల నిర్వహణలో నాణ్యత.
- నిజమైన రాజకీయ పోటీ.
- పౌరహక్కుల పరిరక్షణ.
- పార్లమెంటరీ కమిటీల పనితీరు.
భారత్‌లో ప్రజాప్రతినిధులకు ధనబలం జాస్తి అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) నివేదిక తెలిపింది. భారత్‌లోని ముఖ్యమంత్రుల్లో రూ.510కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారు. అత్యధిక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఆయన కూడా ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ భాజపా సీఎం పెమా ఖండూకు రూ.163కోట్ల ఆస్తులు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు రూ.63కోట్ల ఆస్తులు ఉన్నాయి. రూ.23 కోట్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో స్థానంలో నిలిచారు. కోటి రూపాయల్లోపు ఆస్తులున్న ఏకైక ముఖ్యమంత్రి పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ! మొత్తం ముఖ్యమంత్రుల ప్రకటిత ఆస్తుల సగటు రూ.34 కోట్లు. ఇక హత్య, హత్యాయత్నం, అపహరణ, బెదిరింపు వంటి క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రుల సంఖ్య 13. వీరిలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న మూడు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అగ్రస్థానాల్లో ఉన్నారు.
రాజ్యసభ సభ్యుల్లో 27శాతం భాజపా సభ్యులు, 40శాతం కాంగ్రెస్ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. లోక్‌సభ ఎంపీల్లో సగంమంది నేరచరితులే. ఇది 2014 లోక్‌సభకన్నా 26శాతం ఎక్కువ. 29శాతం కేసులు హత్య, మానభంగాలకు సంబంధించినవి కావడం దేశ ప్రజాస్వామ్య తీరుకు అద్దం పడుతోంది. ఓట్ల కొనుగోలు, మద్యం పంపిణీ, వివిధ వర్గాలపై విద్వేష ప్రచారం వంటివి ఎన్నికల ఎత్తుగడలుగా మారాయి. ఏపీలో ఓటర్ల పేర్లను పెద్దసంఖ్యలో తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 197 దేశాల్లో పౌరహక్కుల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్న 'సివికస్ మానిటర్' సంస్థ-భారత్‌లో పౌరహక్కుల అణచివేత సాగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం వలస పాలన నాటి రాజద్రోహ చట్టాన్ని, అక్రమ కార్యకలాపాల నిరోధ చట్టాన్ని ప్రయోగించి ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తోందని తెలిపింది. పాత్రికేయులను, ఉద్యమకారులను జైళ్లలో కుక్కుతోందని సివికస్ వెల్లడించింది. 2023లో 180 దేశాల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 161వ స్థానంతో సరిపెట్టుకున్నదని పారిస్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. ఈ విషయంలో పాకిస్థాన్ మనకన్నా మెరుగ్గా 150వ స్థానంలో నిలిచింది!