'హిందూ సమాజం మారుతోందంటున్నారు. ఇక్కడ నేనో ప్రశ్న అడగాలనుకొంటున్నాను. ఆ మార్పు ప్రగతి పథం దిశగానా... తిరోగమనం వైపా?'- దాదాపు ఏడు దశాబ్దాలనాడు బాబాసాహెబ్ అంబేడ్కర్ సంధించిన సూటిప్రశ్న అది. 1951లో హిందూ వివాహ బిల్లుపై సాగిన విస్తృత చర్చ సందర్భంగా తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు పోటెత్తాయి. హిందూ సంప్రదాయం మేరకు వివాహం చట్టబద్ధం కావాలంటే వధువు వరుడు ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావాలన్న షరతును నాటి బిల్లు తొలగించింది. దానిపై రేగిన రగడ కారణంగా రాజీ బాట పట్టిన నాటి నెహ్రూ ప్రభుత్వం బిల్లును వాయిదా వేయడం, సిద్ధాంతాలతో రాజీపడేది లేదంటూ అంబేడ్కర్ రాజీనామా చెయ్యడం- అనంతర పరిణామాలు. 1955లో 'ఒకే కులంవారైతేనే చట్టబద్ధత' అన్న షరతు లేకుండానే హిందూ వివాహ చట్టం అమలులోకి వచ్చింది. అయినా చట్టాన్ని ధిక్కరించే స్థాయిలో కుల మత మౌఢ్యాన్ని నరనరానా జీర్ణించుకొన్న కొందరు పెద్దల అనాగరిక ప్రవర్తన- పరువు హత్యల రక్తచరిత్రను కన్నబిడ్డలను కడతేర్చిన నెత్తుటి పుటలతో నింపుతోంది.
అల్లారుముద్దుగా సాకిన బిడ్డను యోగ్యుడైన ఓ అయ్య చేతిలో పెట్టి కన్నీటితో సాగనంపడం ప్రతి తల్లీ తండ్రీ చేసేదే. తాను ఇష్టపడిన యోగ్యుణ్ని కులం పట్టింపు లేకుండా పెళ్ళి చేసుకొన్న బిడ్డను కర్కశంగా చిదిమేసే స్థాయిలో క్రోధం కన్నవాళ్లలో బుసలు కొట్టడం దిగ్భ్రాంతపరచేదే! తమకు ఇష్టంలేని కులాంతర వివాహాన్ని కూతురు చేసుకోవడం సహించలేక కిరాయి హత్యకు తెగించిన లక్ష్మారెడ్డి ఉదంతం- ఆ తరహా ఉన్మాద దుశ్చేష్టల ప్రకరణంలో తాజాది. తమ ప్రేమను తల్లిదండ్రులు ఆమోదించకపోవడంతో ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకొన్న హేమంత్, అవంతి జంట అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేయించుకొన్నారు. పోలీసు పంచాయతీ దరిమిలా అవంతి పేరిట ఉన్న స్థిరాస్తుల్ని తండ్రి పేర రాసేందుకు అందరూ సమ్మతించడంతో- కొత్త జంట వేరే కాపురమూ పెట్టారు. కుమార్తె చేసిన పనికి పరువు పోయిందన్న ఆక్రోశం కసిగా మారి కట్టలు తెంచుకొని పది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి అల్లుణ్ని కడతేర్చే కుట్రగా అమలైపోయింది. ‘కూతుర్ని విధవరాలుగా మార్చేస్తారా... వాళ్లసలు అమ్మానాన్నలేనా?’ అని అవంతి ఆవేదన చెందుతున్నా- మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్యా ఆ బాపతుదే కదా? అపురూపంగా పెంచుకొన్న కూతురు అమృత వేరే కులానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమించి పెళ్ళాడటంతో కసితో రగిలిపోయిన మారుతీరావు తన అల్లుణ్ని మట్టుపెట్టడం తెలిసిందే. మారుతీరావు కథా విషాదాంతమై రెండు కుటుంబాలు చితికిపోయిన వాస్తవం కళ్లకు కడుతున్నా- పరువు హత్యల మరణమృదంగం ఆగక మోగుతుండటం తీవ్రాందోళనకరమే! మిర్యాలగూడ తరహా దారుణానికి తాను పాల్పడనంటూ- కులాంతర వివాహం చేసుకొన్న కూతుర్ని, అల్లుణ్ని నమ్మించి, కొబ్బరి బోండాల కత్తితో కూతుర్ని నడివీధిలో నరికిన మనోహరాచారి ఉదంతం భీతి గొలుపుతుంది. రెండున్నరేళ్ల క్రితం తమకు ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో పచ్చి బాలింత అని కూడా చూడకుండా హేమవతిని పుట్టింటివారు కడతేర్చడంతో నిరుడు జూన్‌లో చిత్తూరు జిల్లా పలమనేరు భగ్గుమంది. మంచిర్యాల, గుంటూరు, ప్రకాశం జిల్లా కొత్తపాలెం... ఇలా చెప్పుకొంటూపోతే పరువు పేరిట అనాగరిక హత్యల పరంపర గుండెల్ని పిండేస్తుంది.