ఇటీవల దేశంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కరోజు వ్యవధిలోనే ప్రమాదాలు జరగడంతో దేశవ్యాప్తంగా పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో గ్యాస్ లీకేజీ, తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ థర్మల్ కేంద్రంలో బాయిలర్ పేలుడు, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ వంటి సంఘటనలు వరసగా చోటుచేసుకున్నాయి. నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని, ఇలాంటి సంఘటనల్లో మొదటగా బలయ్యేది నిరుపేదలేనని మరోసారి స్పష్టమైంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విచారణ కమిటీలు వేయడం, బాధితులకు ఎంతోకొంత పరిహారం ప్రకటించడం, ఆ తరవాత మరచిపోవడం ఓ తంతులా మారింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.78 లక్షల మంది కార్మికులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కచ్చితమైన లెక్కలంటూ లేకపోయినా, ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో సాలీనా 48 వేల మంది మరణిస్తున్నట్లు అంచనా. ఇందులో ఎక్కువమంది నిర్మాణ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
భోపాల్ విషవాయు దుర్ఘటన జరిగి 36 ఏళ్లు గడిచినా మనం నేర్చుకున్న పాఠాలు శూన్యమని ఇటీవలి విశాఖ ప్రమాదంతో రుజువైంది. భోపాల్, విశాఖ ఘటనల్లో- రెండు పరిశ్రమలూ విదేశీ యాజమాన్యంలోనివే కావడం గమనార్హం. ఈ రెండూ ‘రెడ్ జోన్’ విభాగంలోని పరిశ్రమలే. భారత్‌లో పర్యావరణ మంత్రిత్వశాఖ- పరిశ్రమల్ని వాటిలో వాడే ముడిపదార్థాలు, వెలువరించే కాలుష్యం తదితర అంశాల ఆధారంగా- ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, తెలుపు జోన్లుగా విభజించింది. ఎరుపు విభాగంలోని పరిశ్రమలు అత్యంత ప్రమాదకరం. దాదాపు 89 రకాల రసాయన, ఆమ్ల, పురుగు మందులు, ఔషధ, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలన్నీ ఆ విభాగంలోకే వస్తాయి. వీటికి పర్యావరణం, కాలుష్య నియంత్రణ, భద్రత తదితర సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఊరికి దూరంగా, మనుషులు ఎక్కువగా సంచరించని ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు.
కర్మాగారాల చట్టం-1948, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ చట్టం, వివిధ పారిశ్రామిక విధానాలు సూచించే నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తరచూ జరుగుతున్న ప్రమాదాలే స్పష్టం చేస్తున్నాయి. భోపాల్ విషవాయువు ఘటన దరిమిలా పర్యావరణ పరిరక్షణ చట్టం-1986ను తీసుకొచ్చినా పకడ్బందీగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కర్మాగారాల చట్టం ప్రకారం- వ్యర్థాలు, విష వాయువుల లీకేజీలు లేకుండా చూసుకోవడం, పరిశ్రమ చుట్టుపక్కల నివసించే ప్రజలకు విపత్తుల వేళ పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించడం, భద్రతా ఇన్‌స్పెక్టర్ల నియామకం వంటి నిబంధనలెన్నో ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఒక పరిశ్రమ స్థాపనకు అనుమతించేముందు స్థాపించాలంటే అన్ని అంశాలనూ నిక్కచ్చిగా పరిగణనలోకి తీసుకుంటారు. పటిష్ఠమైన నియంత్రణ విభాగం స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛ ఉంటుంది.