మునుపెన్నడూ ఎరుగని బడ్జెట్ వస్తున్నదంటూ ముందస్తు అంచనాలు పెంచేసిన విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతులమీదుగా గతంలో ఎప్పుడూ ఎరుగనంతటి భారీ ఆర్థిక పద్దు నిన్న వెలుగు చూసింది. అసలే మాంద్యం, ఆపై కమ్మేసిన కొవిడ్ మహా సంక్షోభంతో అతలాకుతలమైన భిన్న రంగాలు, అనూహ్య స్థాయిలో తెగ్గోసుకుపోయిన ఉపాధి అవకాశాల నేపథ్యంలో.. ఈసారి సహజంగానే బడ్జెట్ కూర్పు కసరత్తుపై అంతటా ఉత్కంఠ ఇనుమడించింది. ఆరోగ్య రంగం, మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధి, మూలధనం పెంపుదల, సృజన- పరిశోధన అభివృద్ధి, కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన.. ఈ ఆరూ మూలస్తంభాలుగా రూపు దిద్దామన్న బడ్జెట్ పరిమాణం రూ.34 లక్షల కోట్లకు పైబడింది.
వ్యవ'సాయాని'కి ఊతమందేనా?
వాస్తవంలో బడ్జెట్ రథం సజావుగా నడవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలలకోసమే ఇంకా రూ.80వేల కోట్ల రుణాలు కూడగట్టాల్సి ఉంది. 2021-22 అవసరాల నిమిత్తం రూ.12 లక్షల కోట్ల మేర మళ్లీ అప్పులు చేయక తప్పదని ఆర్థికమంత్రి ప్రసంగమే వెల్లడించింది. పన్నులూ సుంకాల్లో రాష్ట్రాల వాటా (ప్రతి రూపాయిలో 16 పైసలు)ను తలదన్నుతూ ఇప్పటికే వడ్డీ చెల్లింపుల పద్దు (రాబడిలో అయిదోవంతుకు) ఎగబాకింది. స్థూల దేశీయోత్పత్తిలో 9.5శాతానికి విస్తరించిన ద్రవ్యలోటు వచ్చే ఏడాది 6.8 శాతానికి తగ్గుతుందని ఆర్థికమంత్రి ఆశాభావం వ్యక్తీకరించినా.. పరిమితుల చట్రంలో ప్రభుత్వం బందీగా మారిందన్న యథార్థం ప్రస్ఫుటమవుతూనే ఉంది. ఎలాగైనా గట్టెక్కాలన్న తాపత్రయంతోనే కావచ్చు- పాడి ఆవులాంటి జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)ను విక్రయానికి సిద్ధం చేశారు. ఇది పెను దుమారం రేకెత్తించే నిర్ణయమే!
చుట్టూ నైరాశ్యం ఆవరించినా భవిష్యత్తు తేటపడుతుందన్న ప్రగాఢ విశ్వాసం- ఆరోగ్య, మౌలిక రంగాలకు భూరి కేటాయింపుల్లో వెల్లడవుతోంది. వైద్య ఖర్చులు భరించలేక ఏటా ఆరు కోట్లమంది వరకు దారిద్య్ర రేఖ దిగువకు పడిపోతున్న భారత్‌కు ఆరోగ్య పద్దుకింద తొలిసారి రమారమి రెండు లక్షల పాతికవేల కోట్ల రూపాయల వరకు కేటాయించడం తీపి కబురు. అందులో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వాయుకాలుష్య నియంత్రణలకు ఉద్దేశించిన వ్యయాల్నీ కలపడం- 137 శాతం పెంపుదల లోగుట్టు! వచ్చే అయిదేళ్లలో 'స్వచ్ఛ భారత్' కోసం రూ.1,41,678 కోట్లు, మౌలిక సదుపాయాల పరికల్పనకు 13 రంగాల్లో రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు ఇటీవలి ప్రకటనలకు అనుగుణంగానే ఉన్నాయి. ఉద్దీపన చర్యల పేరిట రూ.27 లక్షల కోట్ల ప్యాకేజీలు వెలువరించినా నికర వ్యయం అయిదు శాతానికి మించలేదన్న విమర్శలు ఈ బడ్జెట్ విషయంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం కాచుకోవాలి.
రెండంకెల వృద్ధి కోసమే..!
దేశ చరిత్రలోనే మూడోసారి ప్రతికూల వృద్ధిరేటు (మైనస్ 7.7శాతం) నమోదైన అరుదైన సంవత్సరమిది. ఈ దుస్థితిని అధిగమిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11శాతం మేర ప్రగతి సాధన తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ విశ్వాసం అక్షరాలా నిజం కావడానికి ఎన్నో అంశాలు కలిసి రావాలి. అందుకు అనుగుణంగా బడ్జెట్ రచన సాగిందా, సరైన సన్నాహకాలు ఉన్నాయా అన్నవి క్లిష్టమైన ప్రశ్నలు. దశాబ్దాలుగా జీడీపీలో 76-89 శాతానికి, ఉపాధి అవకాశాల్లో 87-91 శాతానికి సేద్య, సేవా రంగాలే పుణ్యం కట్టుకుంటున్నా.. బడ్జెట్లలో వాటికి సరైన ప్రాధాన్యం దక్కకపోవడం ఆనవాయితీగా స్థిరపడింది. ముఖ్యంగా- కరోనా వేళ తక్కిన రంగాలు డీలాపడ్డప్పటికీ, 3.4శాతం వృద్ధిరేటుతో దేశార్థికానికి భరోసా ఇవ్వగలిగింది వ్యవసాయం ఒక్కటే. అటువంటిది, నిరుటి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కొత్తగా సేద్యానికి సాగుదారుల సంక్షేమానికి కేటాయింపులు పెరగలేదు సరికదా తరిగిపోయాయి!