రమారమి మూడున్నర దశాబ్దాలుగా కొలువు తీరిన శాసనం స్థానే, నిరుడు పార్లమెంటు ఆమోదం పొంది సరికొత్తగా అమలులోకి వచ్చిన వినియోగదారుల చట్టం దక్షతపై అంచనాలు మోతెక్కుతున్నాయి. అనైతిక వ్యాపారాలు, నాసిరకం వస్తూత్పాదనలు, మోసకారి ప్రకటనల బారిన పడి వినియోగదారులు నష్టపోవడాన్ని నివారించే లక్ష్యంతో పదును తేలిన నిబంధనలు- ఆధునిక అవసరాల్ని సమర్థంగా తీరుస్తాయన్న విశ్వాసం విశ్లేషణల్లో వ్యక్తమవుతోంది. కల్తీ, నకిలీ వస్తూత్పత్తులు అంటగట్టజూసినవారు ఇకమీదట లక్షరూపాయల వరకు జరిమానా చెల్లించడంతోపాటు ఆరునెలలదాకా జైలు ఊచలూ లెక్కించక తప్పదంటున్నారు. ఒకవేళ వినియోగదారులు గాయపడినా, మరణించినా అందుకు బాధ్యులైన వ్యక్తులు భారీ మూల్యం చెల్లించాలని నూతన నిబంధనావళి స్పష్టీకరిస్తోంది. 1986నాటి పాత చట్టం వినియోగదారుల సహేతుక హక్కుల అమలును పర్యవేక్షించే రెగ్యులేటరీ వ్యవస్థను సాకారం చేయడంలో విఫలమైంది. నూతన శాసనం ఆ కంతను పూడ్చి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ అవతరణకు బాటలు పరవడం కీలక పరిణామం. ఇటీవలి కాలంలో ఇ-కామర్స్, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెద్దయెత్తున విస్తరించడం తెలిసిందే. అందుకనుగుణంగా పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సుల మేరకు నూతన శాసనం పరిధి విస్తరించడం స్వాగతించదగింది. వినియోగదారుకున్న విస్తృతార్థం దృష్ట్యా- ఆహార కల్తీ, విద్యాబోధనకు సంబంధించి లోటుపాట్లు, ఆరోగ్య సేవల్లో లోపాల మూలాన కడగండ్ల పాలబడుతున్న బాధితులకూ సరైన న్యాయం జరిగేలా చూడాలన్న మేలిమి సూచనలకు తగిన మన్నన దక్కలేదు. వాస్తవిక కార్యాచరణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర మార్పులూ చేర్పులకు వీలు కల్పిస్తేనే, వినియోగదారులకు సంపూర్ణ రక్షణ ఒనగూడుతుంది!
వినియోగదారులకు రక్షణ కవచం.. 'నకిలీ'లకు చెక్
నూతన వినియోగదారుల చట్టంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చట్టంతో.. కల్తీ, నకిలీ వస్తూత్పత్తులు అంటగట్టాలకునేవారు ఇకమీదట లక్షరూపాయల వరకు జరిమానా చెల్లించడంతోపాటు ఆరునెలలదాకా జైలు ఊచలూ లెక్కించక తప్పదంటున్నారు.
పారిశ్రామిక దేశాల్లో వినియోగ హక్కులకు పట్టం కట్టే చేతన ఆరేడు దశాబ్దాల క్రితమే విప్పారగా, ప్రపంచం నలుమూలలా వినియోగదారుల ప్రయోజనాలకు గొడుగు పట్టాలని నినదిస్తూ 1985లో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయిదేళ్ల క్రితం సమగ్ర విధివిధానాల్నీ క్రోడీకరించింది. ప్రత్యక్ష విక్రయాలే కాదు, ఆన్‌లైన్ కొనుగోళ్లకూ వర్తించే రక్షణ ఛత్రం ఆవశ్యకతను చాటిన ఐరాస స్ఫూర్తి ఇప్పుడు దేశీయంగా అమలులోకి వచ్చిన చట్ట నిబంధనల్లో పరిమళిస్తోంది. ఆ మేరకు సహజంగానే ఇనుమడించే కేసుల సంఖ్యకు దీటుగా యంత్రాంగం సన్నద్ధమైందా? రాష్ట్రాల వారీగా వినియోగదారుల వేదికల్లో వందలాది ఖాళీలు పోగుపడ్డ కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య ఇంతలంతలవుతోంది. చాలా చోట్ల దస్త్రాలకు చెదలు పట్టిపోతున్నాయని, వివిధ రాష్ట్రాల్లో నియామకాలపై రాజకీయ పెత్తనం పెచ్చరిల్లుతోందని అరిజిత్ పసాయత్ కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. కనుకనే ఇన్నేళ్ల తరవాతా వినియోగదారు రాజు కాలేకపోయాడనీ సమస్య మూలాల్ని స్పృశించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో అవతరిస్తాయంటున్న వివాదాల పరిష్కార కమిషన్లు, ఫోరాలకు పాత రుగ్మతలేవీ సోకకుండా సకలవిధ జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది. కొత్తగా నిర్మించిన గృహాల నాణ్యత, భద్రతలకు విశేష ప్రాధాన్యమిస్తూ అంటారియో(కెనడా) గత వారమే పటిష్ఠ నిబంధనల్ని ప్రవేశపెట్టింది. సమాచార గోప్యత, ఆర్థిక సేవలు తదితరాల విషయంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఐరోపా సంఘం గత నెలలోనే స్థూల అంగీకారానికి వచ్చింది. వినియోగదారులకు బాసటగా దేశదేశాల్లో విప్పారుతున్న సంస్కరణాభిలాష దేశీయంగానూ ఇనుమడించి, అవినీతి ఏమాత్రం ఆశించని వ్యవస్థల నిర్మాణం నిష్ఠగా సాగితే- జనజీవనం ఎంతగానో మెరుగుపడుతుంది!