కొవిడ్ కేసులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలుగా మారింది. కరోనా మహమ్మారికి జడిసి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను అదేపనిగా వాయిదా వేసుకుంటూ పోతే, అది ప్రజాస్వామ్య రథాన్ని స్తంభింపజేస్తుంది. కరోనాను లెక్కచేయకుండా ఎన్నికలు జరిపితే పోలింగ్ శాతం దారుణంగా పడిపోయి, ఎన్నికల ఫలితాల న్యాయబద్ధత ప్రశ్నార్థకమవుతుంది. నిరంకుశ వ్యవస్థల్లో తూతూ మంత్రం ఎన్నికల ఫలితాలను సవాలు చేసేవారు ఉండకపోవచ్ఛు కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలు అలాంటి ఫలితాలను సహించవు గాక సహించవు. ఈ చిక్కుముడిని విప్పే క్రమంలో 2020లో దాదాపు 60 దేశాలు ఎన్నికలను వాయిదా వేయగా- ఫ్రాన్స్, దక్షిణ కొరియా, పోలండ్, బేలారూస్ వంటి డజనుకుపైగా దేశాలు తగు జాగ్రత్తలతో ఎన్నికలను పూర్తిచేశాయి. ఆయా దేశాలు అనుసరించిన పోలింగ్ పద్ధతులను త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న అమెరికా, బిహార్ పరిశీలించడం సముచితంగా ఉంటుంది.
తప్పని వ్యయప్రయాసలు
కరోనాకు వెరవకుండా ఎన్నికలు జరిపించిన దేశాలు వ్యక్తిగత ఓటింగ్, పోస్టల్ ఓటింగ్, మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేయడం, ఓటరుకూ ఓటరుకూ మధ్య దూరం పాటించడం, విడతలవారీగా పోలింగ్ జరపడం వంటి పద్ధతులను అనుసరించాయి. అదే సమయంలో కొవిడ్ తెచ్చిపెట్టిన ఆర్థిక ఇబ్బందుల మధ్య ఓటర్లు భద్రంగా ఓటు వేయడానికి ఏర్పాట్లు చేయడానికి నిధులు సమకూర్చడం సమస్యాత్మకమైంది. చాలా దేశాల్లో సాంకేతికపరమైన అవరోధాలవల్ల, కరోనా భయంవల్ల అతి తక్కువ ఓటింగ్ నమోదై ఎన్నికల ఫలితాలను అనుమానించడం వంటి చిక్కులు ఎదురయ్యాయి. కొన్ని దేశాల్లో పోలింగ్ అనంతరం పెద్ద సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదైతే, మరికొన్ని దేశాల్లో కొత్త కేసులు తక్కువగా వచ్చాయి. దీంతో ఎన్నికల వల్లనే కరోనా కేసులు పెచ్చరిల్లాయా లేక వేరే కారణాలున్నాయా అనే సందేహాలు తలెత్తాయి. ఎన్నికలకు ముందు లాక్‌డౌన్ ఎత్తివేయడం బహుశా కేసుల విజృంభణకు కారణం కావచ్ఛు బేలారూస్‌లో ఎన్నికల ఫలితాలను తప్పుపడుతూ జనం భారీయెత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం కొవిడ్ వ్యాప్తికి కారణమై ఉండవచ్ఛు సెర్బియాలో కూడా ఎన్నికల అనంతరం నిరసనలు పెల్లుబికినా, కరోనా కేసులను తక్కువ చేసి చూపారని ఆరోపణ వచ్చింది. అదే దక్షిణ కొరియాలో పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినందువల్ల, ఏప్రిల్ ఎన్నికల తరవాత కొత్త కేసులు కనిపించలేదు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ, లాక్‌డౌన్ ఆంక్షలు ఇంకా అమలులో ఉన్న సమయంలో ఎన్నికలు జరగడం దీనికి కారణం కావచ్ఛు ఈ దేశంలోని మూడు కోట్లమంది ఓటర్లలో 66 శాతం ఓటు వేయగా, వారందరికీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేశారు. ఓటు వేసేటప్పుడు శానిటైజర్ ఇచ్చారు. జ్వరం ఉన్నవారికి వేరే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మంగోలియా, సెర్బియాలలో ఓటర్ల మధ్య కనీసం మీటరు దూరం విధించారు. పోలెండ్‌లో ప్రతి గంటకూ 10 నిమిషాలసేపు పోలింగ్ కేంద్రంలోకి ధారాళంగా గాలి వచ్చివెళ్లే ఏర్పాటు చేశారు. డొమినికన్ రిపబ్లిక్‌లో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశారు. సింగపూర్‌లో ప్రతి రెండు గంటలకు నిర్ణీత సంఖ్యలో ఓటర్లను అనుమతించగా, ఆస్ట్రేలియాలో తపాలా ఓటింగ్‌కు వీలుకల్పించారు. ఆన్‌లైన్ ఓటింగ్‌లో మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా దేశాలు అందుకు మొగ్గు చూపడం లేదు. ఫ్రాన్స్, క్రొయేషియా దేశాల్లో కరోనా బాధితుల తరఫున వారి ప్రతినిధులు ఓటు వేసే అవకాశం కల్పించారు. సింగపూర్‌లో వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు అందరికన్నా ముందు వచ్చి ఓటు వేసే వీలు కల్పించారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి భారీగా ధన వ్యయమైంది. దక్షిణ కొరియా ఎన్నికలకు 1.60 కోట్ల డాలర్లు అదనంగా వ్యయమైంది. ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల పట్ల నమ్మకం కోల్పోయిన ఓటర్లు మామూలుగానే పోలింగ్‌కు డుమ్మా కొడుతుంటారు. వారికి ఇప్పుడు కరోనా పేరిట కొత్త వంక దొరికింది. చాలా దేశాల్లో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఒక కారణం. మరికొన్ని దేశాల్లో చాలామంది ఎన్నికల సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు. నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరిగే అమెరికాలో పోలింగ్ సిబ్బందిలో అత్యధికులు 60 ఏళ్లు పైబడినవారే. వీరిలో చాలామంది గైర్హాజరై ఎన్నికల రోజున సిబ్బంది కొరత ఏర్పడవచ్చునని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.
పోస్టల్ బ్యాలట్‌పై సందేహాలు