తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ధరణి గుండెల్లో గుబులు రేపుతున్న భూతాపం - దక్షిణాసియాలో వరదలు

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట నిత్యం కార్చిచ్చులో, తుపానులో, వరదలో, క్షామమో ప్రజలను బాధిస్తున్నాయి. దావానలాల వల్ల అమెరికా పశ్చిమ తీరంలోని 12 రాష్ట్రాల్లో కనీవినీ ఎరగని స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆకాశం నారింజ రంగు సంతరించుకుంది. భారత్‌లో 21.4 శాతం అడవులు కార్చిచ్చు ప్రభావ ప్రాంతాలుగా గుర్తించారు. గత ఏడాది మన అడవుల్లో 29,547 మంటలను నమోదు చేశారు. గడిచిన పన్నెండు వేల సంవత్సరాలుగా మానవ నాగరిక పరిణామానికి దోహద పడిన వాతావరణం ఇప్పుడెందుకిలా మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారింది? ఇదంతా ప్రకృతి పరంగా సహజమైనది కాదని, ఈ మార్పుల వెనుక మానవ వేలిముద్రలు, పాదముద్రలు ఉన్నాయన్నది విజ్ఞానశాస్త్రం విస్పష్టంగా చెబుతున్న సత్యం.

Editorial on climate change, wildfire, flood situation all over the world
ధరణి గుండెలో గుబులు రేపుతున్న భూతాపం

By

Published : Sep 29, 2020, 6:43 AM IST

ప్రపంచం వరస విపత్తులతో తల్లడిల్లుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోట కార్చిచ్చులో, తుపానులో, వరదలో, క్షామమో ప్రజలను బాధిస్తున్నాయి. దావానలాలవల్ల అమెరికా పశ్చిమ తీరంలోని 12 రాష్ట్రాల్లో కనీవినీ ఎరగని స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆకాశం నారింజ రంగు సంతరించుకుంది. ఆ మంటల నుంచి ఎగసిన పొగ 10 కిలోమీటర్ల ఎత్తుకి విస్తరించడమే కాకుండా, అమెరికా తూర్పు తీర రాష్ట్రాల వరకూ చేరి వాయు కాలుష్యాన్ని పెంచింది. ఇప్పటిదాకా అమెరికాలో కాలిపోయిన ప్రాంత విస్తీర్ణం 69 లక్షల ఎకరాలు. అందులో కాలిఫోర్నియాలో దహనమైనది 33 లక్షల ఎకరాలు. ఉత్తర ధృవ ప్రాంతంలో అలాస్కా, సైబీరియాల నుంచి దక్షిణంలో ఆస్ట్రేలియా, తూర్పున ఆసియా నుంచి పడమర అమెరికా పసిఫిక్‌ తీరం వరకూ ఏడాదిగా ఎక్కడో ఒకచోట అడవులు మండుతూనే ఉన్నాయి.

అన్ని దేశాలకూ ముప్పు

భారత్‌లో 21.4 శాతం అడవులు కార్చిచ్చు ప్రభావ ప్రాంతాలుగా గుర్తించారు. గత ఏడాది మన అడవుల్లో 29,547 మంటలను నమోదు చేశారు. ఈ ఏడాది మే నెలలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. సెప్టెంబరు ఒకటిన అఫ్గానిస్థాన్‌లో వరదలు 190 ప్రాణాల్ని బలిగొన్నాయి. నేపాల్‌, చాడ్‌, సెనెగల్‌, సూడాన్‌, నైజీరియా, కెన్యా, బుర్కినాఫాసో, ఘనా, పాకిస్థాన్‌, కామెరూన్‌, అల్జీరియా, ట్యునీషియా, వియత్నాం, ఉగాండా దేశాలను సెప్టెంబరులో వరదలు ముంచెత్తాయి. మన దేశంలో ఆగస్టులో 11 రాష్ట్రాల్లో 868 మంది వరదలకు బలవ్వగా, అయిదో వంతు దేశం క్షామంబారిన పడింది. మూడోవంతు అమెరికాలో క్షామం తాండవిస్తోంది. 5 కోట్ల 30 లక్షల మందిని క్షామ పీడితులుగా గుర్తించారు. ఏదో ఒక విపత్తుకి గురికాని దేశం భూమండలంపైనే లేదు.

ఈ ఏడాది కొవిడ్‌ మహమ్మారి జనజీవనాన్ని స్తంభింపజేసినా మండుతున్న అడవులూ, పీట్‌లాండ్స్‌ కారణంగా కర్బన ఉద్గారాలు 4 నుంచి 7 శాతం మాత్రమే తగ్గవచ్చని అంచనా. 2030 నాటికి కర్బన ఉద్గారాలు 2010తో పోలిస్తే 45 శాతం తగ్గాలని భూతాపం నివేదిక పేర్కొన్నా... ఆ దిశగా అడుగే పడటం లేదు. ప్రభుత్వాలూ, ప్రజలూ, మాధ్యమాలూ ఈ సమస్యను గుర్తించడమే లేదు. మనదేశంలో 2019 ఎన్నికల ప్రణాళికల్లో ఏ పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ప్రపంచ వాతావరణ సంస్థ ఇతర ఆరు ప్రముఖ సైన్సు సంస్థలతో కలిసి 2020 సెప్టెంబరులో విడుదల చేసిన నివేదిక- 2024 లోపు ఒక ఏడాదిలో భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌ పరిమితిని తాత్కాలికంగా దాటుతుందని వెల్లడించింది. త్వరలోనే శాశ్వతంగా ఆ పరిమితిని దాటేసే అవకాశం పెరుగుతోందనీ తెలిపింది. ఈ నెలలోనే వచ్చిన మరో నివేదిక 2050 నాటికి 120 కోట్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగా నిర్వాసితులవుతారని, ఇది మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తుందని స్పష్టంచేసింది. పసిఫిక్‌ మహాసముద్ర భూమధ్య రేఖా ప్రాంతంలో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంకంటే, కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉన్నపుడు ఏర్పడే లా నినా ప్రభావం వల్లే ప్రస్తుత అమెరికా పసిఫిక్‌ తీరంలో దావానల తీవ్రతకు కారణం.

అతి వాతావరణ పరిస్థితులు

'లా నినా' అనే స్పానిష్‌ పదానికి అర్థం 'చిన్న అమ్మాయి' కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంటే ఏర్పడే స్థితిని 'ఎల్‌ నినొ' (చిన్న అబ్బాయి) అంటారు. లా నినా వల్ల అమెరికా దక్షిణ, పశ్చిమ పసిఫిక్‌ తీరంలో పొడి, వేడి గాలులు వీస్తాయి, ఉత్తర, పశ్చిమ పసిఫిక్‌ తీరంలో చల్లని తడి గాలులతో వానలు కురుస్తాయి. అలాగే తూర్పున అట్లాంటిక్‌ తీరంలో పెను తుపానులకు అనువైన భౌతిక స్థితి కల్పిస్తుంది. లా నినా సహజ ప్రక్రియ. కాని దానికి వాతావరణ మార్పులు తోడైన సందర్భంలో కార్చిచ్చు, పెను తుపానులు జంటగా వస్తాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త మైఖేల్‌ మాన్‌ చెబుతున్నారు. భూతాపంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు లా నినా ప్రభావం తోడై అమెరికాలో దావానలం అప్రతిహతంగా విస్తరిస్తోంది. కాలిఫోర్నియాలో మండే అడవుల వార్షిక విస్తృతి 1970తో పోలిస్తే అయిదు రెట్లు పెరిగింది. వేసవిలో ఎనిమిది రెట్లు పెరిగింది. అధికమవుతున్న ఉష్ణోగ్రతలతో చెట్లు, గడ్డి ఎండిపోవడమే అందుకు కారణం. ఒక పక్క అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో కార్చిచ్చు ప్రజ్వరిల్లుతుంటే, దానికి తూర్పున కొన్ని వందల మైళ్ళ దూరంలోని కొలరాడో, వయోమింగ్‌ రాష్ట్రాల్లో సెప్టెంబరు ఏడో తేదీ మధ్యాహ్నం నుంచి 8 ఉదయానికి 18 గంటల్లో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గి- రెండడుగుల మంచు కురిసింది. అదే సమయంలో అమెరికా తూర్పు తీరంలో అత్యధికంగా 25 హరికేన్లు వస్తాయని ఆ దేశ వాతావరణ శాఖ ముందస్తు సూచన చేసింది. ఇది అతి వాతావరణానికి ప్రతీక. వాతావరణ మార్పులతో అతి వాతావరణం కొత్త సాధారణ స్థితిగా అవతరిస్తోంది. ప్రస్తుతం సగటు భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. అదే జరిగితే శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం ఇప్పటి జనాభాలో 10 శాతం మాత్రమే మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ఊహించడానికే కష్టమైన ఇలాంటి పరిస్థితిని నిరోధించడానికి అందరూ ముందుకు కదలక తప్పదు. మానవ చర్యలతో ఏర్పడిన ఈ విపత్తును మానవులే తొలగించాలి. అందుకు ఉమ్మడి కార్యాచరణ అవసరం.

హెచ్చరికలు గాలికి...

గడచిన పన్నెండు వేల సంవత్సరాలుగా మానవ నాగరిక పరిణామానికి దోహద పడిన వాతావరణం ఇప్పుడెందుకిలా మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారింది? ఇదంతా ప్రకృతి పరంగా సహజమైనది కాదని, ఈ మార్పుల వెనుక మానవ వేలిముద్రలు, పాదముద్రలు ఉన్నాయన్నది విజ్ఞానశాస్త్రం విస్పష్టంగా చెబుతున్న సత్యం. వందేళ్ళ పూర్వమే అర్హీనియస్‌ పరిశోధనలు గాలిలో పెరిగే కర్బనంతో భూతాపం పెరుగుతుందని హెచ్చరించాయి. కానీ ఆర్థికవృద్ధి మోజులో సైన్సును పెడచెవిన పెడుతూ వచ్చిన ప్రభుత్వాలూ, మానవ సమాజాలు సమస్యను పెంచాయి. 1988లో జేమ్స్‌ హాన్సెన్‌ భూతాపం పెరుగుతోందని వివరించినా, 1990లో మొదటి ఐ.పి.సి.సి. నివేదిక భూతాప ప్రమాదాన్ని ఖరారు చేసినా, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిరోధక చర్యల కోసం అంతర్జాతీయ సదస్సులు ప్రారంభమైనా, గత 30 ఏళ్ళలో గాలిలోకి వదిలిన కర్బనం, మొత్తం గాలిలోని కర్బనంలో 62 శాతం. అంటే ప్రమాదాన్ని గుర్తించిన తరవాతనే అత్యధికంగా కర్బనాన్ని వెలువరించామన్నది స్పష్టమవుతోంది. గాలిలో హరితగృహ వాయువుల మోతాదు పెంచి భూగ్రహ శక్తి సమతౌల్యాన్ని దెబ్బతీశాం. 2015 డిసెంబరులో సగటు భూఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5-2 డిగ్రీల సెల్సియస్‌ మధ్య పరిమితం చేయడానికి పారిస్‌ ఒప్పందానికి అంగీకరించిన దేశాలు అమలులో మాత్రం విఫలమయ్యాయి. ఏటా ఉద్గారాలు పెరుగుతూనే వచ్చాయి.

- డాక్టర్‌ కె.బాబూరావు

(పర్యావరణ రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details