ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందే ప్రభుత్వ ఉత్తర్వును ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆదివాసీ యువత ఆందోళన బాట పట్టింది. కరోనా కల్లోలంలో బిక్కు బిక్కుమంటున్న ఆదివాసులకు కనీసస్థాయి ఉద్యోగ ఉపాధి లేక పూట గడవడం కష్టంగా ఉంది. వీరి జనాభా తగ్గుముఖం పడుతోంది. ఇలా అంతరిస్తున్న గిరిజన ఆదిమ జాతుల జనాభా లెక్కింపు కులాలవారీగా జరపరాదు. వీరిని తెగలవారీగా గణించడం ఒక సామాజిక న్యాయం. మతపరంగా చూస్తే ఆదివాసులను ప్రత్యేక ‘ఆదివాసి’ధర్మంగా పరిగణించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం పరిశీలించాలి. ప్రస్తుతం వీరిది మెజారిటీ 35 తెగలుగా భిన్న సంస్కృతుల సమ్మేళనం. ప్రత్యేక మతం డిమాండ్‌తో 2018 మే 12, 13 తేదీల్లో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం వేదికగా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆదివాసీ మేధావులతో జాతీయ ఆదివాసీ ధర్మ సాంస్కృతిక సమావేశం జరిగింది. ఆదివాసుల సంస్కృతిని ప్రత్యేక ధర్మంగా గుర్తించి త్వరలో చేపట్టబోయే 2021 జాతీయ జనగణనలో 35 తెగలను సూచించే ఒక పట్టిక ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఆదివాసీ మేధావుల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గణన వల్ల గిరిజనుల్లో ఆదిమ తెగల (పీటీజీ) గిరిజనులు అభివృద్ది ఫలాలు అందుకోలేక నష్టపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని 35 తెగలలో జనాభాను నిర్దిష్టంగా ఏ తెగలో ఎంతమంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరించే తెగలపై స్పష్టత కొరవడుతోంది.
అసమంజస విధానాలు
రాజ్యాంగం 342 అధికరణ 25వ నిబంధన ప్రకారం కొండప్రాంతం లేదా అటవీ ప్రాంతంలో నివసించేవారే గిరిజనులు. సంస్కృతిపరంగా వీరి జీవనశైలి మైదాన ప్రాంత, కులవృత్తులవారి కంటే విభిన్నం. అందుకే వీరి జనాభాను 1961 నుంచి 2001 వరకు జరిగిన జనగణనల్లో గిరిజన తెగలుగా లెక్కించారు. 2011 నుంచి వీరిని ఒకేతీరుగా గణించారు. అది సమంజసం కాదు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు నిమ్నవర్గాలకు రక్షిత ఆదివాసీ ప్రజలకు నేరుగా చేర్చేధ్యేయంతో ఉన్న ప్రభుత్వం చేసే ఈ గణన శాస్త్రీయం కాబోదు. తెలంగాణలోని 19, ఆంధ్రాలోని 16 తెగలను మైదాన, ఏజెన్సీ గిరిజనులుగా ప్రభుత్వం పరిగణించాలి. మైదాన ప్రాంత గిరిజనులను, తండా నివాసాలను 1976-2011 మధ్య గిరిజన జాబితాలో కలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా జనాభా అమాంతం పెరిగింది. అధిక ప్రయోజనాలు వారికే దక్కుతున్నాయి. ఎస్టీలలో కలిసిన మైదాన తెగలైనా లంబాడా, ఎరుకల, యానాదులకు కేటాయించిన రెండు శాతం రిజర్వేషన్ కంటే (ఆరు శాతంలో) అధికం పొందుతున్నారు. రాజ్యాంగంలో పూర్వతెగలకే ప్రత్యేకించినప్పటికీ గిరిజనులలోనే ఏర్పడే ఈ అంతరం ఇబ్బందులు సృష్టిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోని 5,948 ఏజెన్సీ గూడేలలోని ఆదివాసులకు ఇది భంగపాటు!
జనాభా గణాంకాలు-2001