తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రభుత్వ కృషితోనే అంకురాల అభివృద్ధికి అవకాశం - startups

సృజనాత్మక వాణిజ్య యోచనలకు, నవ్య సాంకేతిక ప్రజ్ఞకు సమధిక ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో ప్రగతి ప్రస్థానం పరుగులు పెడుతోంది. అందుకు విరుద్ధంగా మన దేశ ఇంజనీరింగ్​ కళాశాలలెన్నో నిరుద్యోగుల ఉత్పత్తి కర్మాగారాలుగా తయారవుతున్నాయనేది కఠోర వాస్తవం. ప్రధాని మోదీ చెప్పినట్లు, నేటి అంకురాలు (స్టార్టప్స్‌) రేపటి బహుళజాతి కార్పొరేషన్లుగా ఎదిగి 'ఆత్మ నిర్భర్‌ భారత్' సాకారమయ్యేలా దోహదపడటానికి- ప్రభుత్వపరంగా చేయాల్సింది ఎంతో ఉంది. లోగడ హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు ముక్తకంఠంతో తీర్మానించినట్లు, అద్భుతాల సృష్టికి అత్యంత కీలకమైనవి- నమ్మకం, ప్రోత్సాహం, పెట్టుబడులే.

editorial on atma nirbhar bharath
ప్రభుత్వ కృషితోనే అంకురాల అభివృద్ధికి అవకాశం

By

Published : Jan 6, 2021, 6:59 AM IST

సృజనాత్మక వాణిజ్య యోచనలకు, నవ్య సాంకేతిక ప్రజ్ఞకు సమధిక ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో ప్రగతి ప్రస్థానం ఎలా చురుకందుకుంటున్నదో చాటే స్ఫూర్తిమంతమైన ఉదాహరణలనేకం పోగుపడుతున్నాయి. అందుకు విరుద్ధంగా చదువుల నాణ్యత కొల్లబోయి ఇంజినీరింగ్‌ కళాశాలలెన్నో నిరుద్యోగుల ఉత్పత్తి కర్మాగారాలుగా భ్రష్టుపడుతున్న దేశం మనది. ఈ దురవస్థను చెదరగొట్టేలా బీటెక్‌ విద్యార్థుల ఆవిష్కరణలకు గుర్తింపు, ప్రోత్సాహం దక్కేలా చూడాలన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ తాజా సూచన స్వాగతించదగింది. నూతన ఆలోచనలకు సృజనశీలతకు వెన్నుదన్నుగా నిలిస్తే అద్భుతమైన పరిశ్రమలెన్నో రూపుదాలుస్తాయన్నది వట్టి ఆశాభావంగా మిగిలిపోకుండా సత్వర కార్యాచరణ రాష్ట్రాలవారీగా పట్టాలకు ఎక్కాల్సి ఉంది!

ప్రధాని మోదీ చెప్పినట్లు, నేటి అంకురాలు (స్టార్టప్స్‌) రేపటి బహుళజాతి కార్పొరేషన్లుగా ఎదిగి 'ఆత్మ నిర్భర్‌ భారత్' సాకారమయ్యేలా దోహదపడటానికి- ప్రభుత్వపరంగా చేయాల్సింది ఎంతో ఉంది. లోగడ హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు ముక్తకంఠంతో తీర్మానించినట్లు, అద్భుతాల సృష్టికి అత్యంత కీలకమైనవి- నమ్మకం, ప్రోత్సాహం, పెట్టుబడులే. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల చురుకైన మెదళ్లలోని ఆలోచనలకు వ్యవస్థాగత తోడ్పాటు, సమధిక ఆర్థిక సహకారం లభించాలే గాని- ఎన్ని సవాళ్లకైనా ఎదురొడ్డటం సుసాధ్యమే. కొవిడ్‌ సంక్షోభం దేశీయంగా అనేక అంకుర సంస్థల ఆకాంక్షల్ని అభివృద్ధి ప్రణాళికల్ని నీరు కార్చింది. అదే పొరుగున జనచైనా- తయారీరంగ పరిశ్రమల ప్రపంచ కేంద్రంగా అవతరించడంతోపాటు ఎప్పటికప్పుడు విప్పారుతున్న సాంకేతిక అవకాశాల్నీ ఒడిసిపడుతోంది. దేశీయంగా ఉద్యోగాలు కోరుకునేవారిని కాదు, ఉపాధి అవకాశాలు సృష్టించేవారిని అవతరింపజేయడమే లక్ష్యమంటున్న ప్రభుత్వాలు- ఆలోచనల్ని జ్వలింపజేసే వ్యూహాలకు యోజనలకు విశేష ప్రాధాన్యమిస్తేనే... ఇక్కడి పరిస్థితి తేటపడుతుంది!

పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్‌ సైన్స్‌ పట్ల ప్రత్యేకాసక్తి, అభినివేశం పెంపొందించే పాఠ్యప్రణాళికలు ఇజ్రాయెల్‌, యూకే, రష్యా, జర్మనీ ప్రభృత దేశాల్లో ఇంజినీరింగ్‌ మేధావుల పరంపరకు, దండిగా ఆవిష్కరణల సృజనకు ఆలంబనలవుతున్నాయి. అంతటి శ్రద్ధ కొరవడ్డ ఇక్కడ- అంకురాలకు నిధుల కోసం అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఔత్సాహికులు నాలుగైదు రెట్లు శ్రమించాల్సి వస్తున్నదని ఆమధ్య తరుణ్‌ ఖన్నా కమిటీ సూటిగా తప్పుపట్టింది. చదువుకుని వ్యాపారవేత్తలుగా ఎదగండంటూ జేఎన్‌టీయూహెచ్‌ వంటివి నూతన అంకుర విధాన రచనకు ఇప్పుడిప్పుడు చూపుతున్న శ్రద్ధ సత్వరం జాతీయ స్థాయిలో విస్తరించాలి. వినూత్న ఆలోచనలు రెక్కలు తెగిన పక్షులయ్యే దుస్థితి దాపురించకుండా- ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే పారదర్శక యంత్రాంగం వ్యవస్థీకృతం కావాలి.

పట్టాలు కలిగి ఉండటమే అర్హత కాదని వాట్సాప్‌ ఉదంతం సోదాహరణంగా తెలియజెబుతుంది. ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఫేస్‌బుక్‌'లో కొలువు సంపాదించలేక వెనుతిరిగిన బ్రియాన్‌ ఆక్టన్‌, యాన్‌ కవూమ్‌ తాము 2009లో సొంతంగా అభివృద్ధి పరచిన వాట్సాప్‌ యాప్‌ను అయిదేళ్ల తరవాత కళ్లు చెదిరే ధరకు విక్రయించారు. 1930 కోట్ల డాలర్లకు(సుమారు లక్షా పాతిక వేల కోట్ల రూపాయలకు) ఆ యాప్‌ను కొనుగోలు చేసింది ఫేస్‌బుక్‌ కావడం విశేషం! కొన్నేళ్ల వ్యవధిలోనే దేశీయంగా పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, బైజూస్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటివి శాఖోపశాఖలుగా ఎదిగిన క్రమం- అంకురాల అంతర్నిహిత శక్తిని ఎలుగెత్తి చాటేదే. 'డిజిటల్‌ ఇండియా'ను 5జి శకం కొత్త పుంతలు తొక్కించి ఆరోగ్యరక్షణ, విద్య, ఆతిథ్య రంగం, సేద్య ఉత్పత్తులు తదితరాలన్నింటా అపారావకాశాలు కల్పిస్తుందన్న అంచనాల వెలుగులో- ఆవిష్కరణలు మరింతగా పదును తేలాలి. అందుకు మేలుబాటలు పరచేలా పునాది స్థాయినుంచీ పాఠ్యాంశాల సాకల్య క్షాళన, భిన్న దశల్లో బోధన సిబ్బందికి నిశిత శిక్షణ, నాణ్యమైన ఆవిష్కరణలకు సరైన ఆసరా... కావాలి. ఇవన్నీ సాధ్యం చేయగలిగేదే 'ఆత్మ నిర్భర్‌ భారత్‌'కు ఊపిరులూదగల సమర్థ వికాస్‌ యోజనగా వెలుగులీనుతుంది.

ఇదీ చదవండి:'సోనియా గాంధీ, మాయావతికి భారతరత్న ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details