తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్​' - కరోనా వైరస్​ ఇండియా

మారిన పరిస్థితుల్లో కరోనా కట్టడికి భౌతిక దూరం అత్యంత ఆవశ్యకం. ఈ నేపథ్యంలో వైద్యులకు, రోగికి మధ్య భౌతిక దూరం పాటిస్తూ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థంగా అందించేందుకు... వైద్యులకు భారతీయ వైద్య మండలి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. టెలిమెడిసిన్‌కి సామాజిక ప్రయోజనం చేకూర్చాలని తెలియజేసింది.

Editorial on advantanges of Tele medicine
ఆరోగ్య సమస్యల సత్వర పరిష్కారం కోసం 'టెలిమెడిసిన్​'

By

Published : May 21, 2020, 7:50 AM IST

'వైద్యులు... మనిషి అనే క్లిష్టమైన యంత్రంతో పనిచేస్తారు' మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వ్యాఖ్య అది. దేశవ్యాప్తంగా టెలిమెడిసిన్‌ అవసరాన్ని ఆనాడే ఆయన నొక్కి చెప్పారు. యంత్రాలనే కాకుండా ఉపగ్రహాలను సైతం ఉపయోగించి వైద్యశాస్త్రం రోగులకు సాంత్వన చేకూర్చాలని ఆయన ఉద్బోధించారు. మారిన పరిస్థితుల్లో కొరోనా కట్టడికి భౌతిక దూరం అత్యంత ఆవశ్యకం. ఈ నేపథ్యంలో వైద్యులకు, రోగికి మధ్య భౌతిక దూరం పాటిస్తూ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థంగా అందించేందుకు వైద్యులకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా వైద్య రంగంలో పెను మార్పులకు ప్రోది చేసే విధి విధానాలు ప్రకటించింది. రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ కోసం అవసరమయ్యే సమాచార మార్పిడి మాత్రమే కాక వైద్య పరిశోధనలకూ, వైద్య విద్యావ్యాప్తికీ ఉపకరించే విధంగా విస్తరించి టెలిమెడిసిన్‌కి సామాజిక ప్రయోజనం చేకూర్చాలని తెలియజేసింది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్‌ కమ్యూనికేషన్ల ద్వారా ఆరోగ్య సంబంధిత సేవల విస్తరణను సులభతరం చేసే విధంగా సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉరుముతోంది.

టెలివైద్యంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దూరాభారం కారణంగా గ్రామీణ ప్రజలు వ్యయ ప్రయాసలను భరించి పెద్ద నగరాలకు రాలేక; సరైన వైద్యాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ కొత్త విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖర్చు, శ్రమ బాగా తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయి. రోగిని ప్రత్యక్షంగా చూడవలసిన అవసరంలేని పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా సాధారణ తనిఖీలు, పర్యవేక్షణ సరిపోయే వ్యాధులకు సంబంధించి ‘టెలి వైద్యం’ ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల ద్వితీయ శ్రేణి ఆస్పత్రులపై భారం తగ్గుతుంది. రోగికి సంబంధించిన ఆరోగ్య వివరాలు; రికార్డుల నిర్వహణ ఈ విధానంలో పక్కాగా ఉంటుంది. మరోవంక ఫోన్‌ ద్వారా రోగులకు వైద్యులు అందించిన సలహా ‘కచ్చితమైన పత్రం’గా ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల రోగులకు వైద్యుడికి మధ్య సమాచార ప్రసారం పెరుగుతుంది. జ్వరమానిని సహా కొన్ని సాధారణ వైద్య పరికరాలు ఇప్పుడు చాలామంది వద్ద ఉంటున్నాయి. వీటి సాయంతో రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్‌ వంటి సమస్యలను అర్థం చేసుకొని, నియంత్రణకు సరైన సలహాలు ఇవ్వడం సులభమవుతుంది. కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి తగిన రక్షణ సైతం కలుగుతుంది.

క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలను, రోగులను వైద్యులతో అనుసంధానించే అద్భుత మాధ్యమంగా దీన్ని రూపొందించుకోవాల్సి ఉంది. దేశంలో టెలీవైద్యంపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ముంబయి హైకోర్టు 2018లో టెలిమెడిసిన్‌ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ వెలువరించిన తీర్పు కొంత అనిశ్చితిని సృష్టించింది. దేశంలో ఇప్పటివరకూ పెద్దగా ఉనికిలో లేని టెలిమెడిసిన్‌ విస్తరణలో వీడియో, ఫోన్‌, అంతర్జాల వాడకంపై ఇప్పటివరకూ నిర్దిష్ట చట్టాలు లేదా మార్గదర్శకాలు లేవు. ఇప్పటివరకూ ఉన్న చట్టాలు రోగికి, వైద్యుడికి మధ్య కొంత గందరగోళ వాతావరణం నెలకొనడానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వైద్య మండలి వెలువరించిన మార్గదర్శకాలు అపోహలకు స్వస్తిపలికేలా ఉన్నాయి. వివిధ దేశాలలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సమీక్షించి- దేశంలో టెలిమెడిసిన్‌ సౌకర్యాలను వేగంగా విస్తరించే అనేక అంశాలకు భారతీయ వైద్య మండలి రూపకల్పన చేసింది. దేశంలో ఎక్కడినుంచైనా టెలీ వైద్య సేవలను అందించేందుకు డాక్టర్లందరూ ఒకే విధమైన వృత్తి, నైతిక నిబంధనలు, సంప్రదాయ ప్రమాణాలు పాటించాలి. ఈ వైద్యాన్ని అందిపుచ్చుకోవాలనుకునేవారు ఎంసీఐ రూపొందించే ఆన్‌లైన్‌ కోర్సును ప్రకటన వెలువడిన మూడేళ్లలోగా పూర్తి చేయాలి.

రోగితో సంప్రదింపులకు వైద్యులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవచ్ఛు రోగి ఆరోగ్య వివరాలతోపాటు ఎక్స్‌-రే, స్కాన్‌ నివేదికలు, ల్యాబ్‌ రిపోర్టులు వంటివి పంపుకోవడానికీ ఈ విజ్ఞానం వీలుగా ఉండాలి. వైద్యులు, రోగులు కేవలం వ్యాధి నిర్ధారణ, చికిత్స లేదా కౌన్సెలింగ్‌ కోసం మాత్రమే ఈ సేవలను ఉపయోగించాలి. శస్త్ర చికిత్సలు మొదలైనవి పూర్తిగా నిషిద్ధం. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చెప్పవచ్ఛు ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో లేకపోతే వైద్యుడు తన విచక్షణ ఆధారంగా సలహా ఇవ్వాలి లేదా వ్యక్తిగతంగా రోగిని దగ్గరలోని ఆస్పత్రికి పంపగలగాలి. రోగి, వైద్యులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఒకరిగురించి మరొకరికి పూర్తిగా తెలియాలి, అంతేకాదు ఆ వివరాలను ముందుగానే ధృవీకరించుకోవాలి. టెలివైద్యం ద్వారా సంప్రదింపులకు రోగి సమ్మతి అవసరం. టెలిమెడిసిన్‌ ద్వారా మందులు సూచించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏయే మందులు సూచించవచ్చో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదించి వైద్యులకు తెలియజేస్తుంటారు. రోగికి వైద్యునికి మధ్య జరిగిన సంప్రదింపులన్నీ (ఉదాహరణకు ఫోన్‌ కాల్‌ వివరాలు, ఇ-మెయిల్‌, చాటింగ్‌లు) నివేదికలు, పత్రాలు, చిత్రాలు, విశ్లేషణలు, డేటా, ప్రిస్క్రిప్షన్‌తో సహా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. వైద్యుల తరఫున ఇతరులతో సలహా సంప్రదింపులకు తెరతీయరాదు. టెలిమెడిసిన్‌ సంప్రదింపులకుగాను రశీదు ఇచ్చి తగిన రుసుము వసూలు చేయవచ్ఛు కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ల ఆధారంగా రోగులకు సూచనలు చేయరాదు. నిష్ణాతులైన వైద్యులను ఎన్నుకోవడం రోగుల బాధ్యత. నైతిక విలువలతో కూడిన ప్రామాణిక చికిత్స అందించడం వైద్యుల బాధ్యత. టెలీ వైద్య సేవలను సైతం బీమా సంస్థల పరిధిలోనికి తీసుకు రావాలి. రోగుల గోప్యతను కాపాడేందుకు సరిపడా కంప్యూటర్‌ పరిజ్ఞానం వైద్యులకు ఉండాలి. వైద్య విద్యార్థుల పాఠ్యాంశాల్లో టెలిమెడిసిన్‌ను అంతర్భాగంగా మార్చాలి. ఈ విధానాన్ని మరింత బలోపేతంగా తీర్చిదిద్దేందుకు వైద్య, న్యాయ, ఐటీ, రాజకీయ మేధావుల మధ్య ఆరోగ్యకరమైన చర్చ తప్పనిసరి. సామాజికంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్న దశలో- సమర్థంగా నాణ్యమైన వైద్యాన్ని అవసరార్థులకు చేరవేసేందుకు శాస్త్రీయ స్పృహతో కృషి చేయడం తప్పనిసరి.

(రచయిత- డా. శ్రీ భూషణ్​ రాజు, హైదరాబాద్‌ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి)

ABOUT THE AUTHOR

...view details