Economic reforms in India: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాము (1991-96)లో ఆర్థిక సంస్కరణలు మొదలై ప్రస్తుతం మోదీ పాలనలోనూ కొనసాగుతున్నాయి. ఇవి గత 30 ఏళ్లలో భారతదేశంలో పలు మార్పులు తెచ్చిన మాట నిజం. సంస్కరణల వల్ల పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గాయా అన్నదే కీలక ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచంలో జీడీపీ పరంగా, కొనుగోలు శక్తిలో భారత్ పైస్థానాల్లోనే నిలుస్తోంది. కానీ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) 2020లో వెలువరించిన మానవాభివృద్ధి సూచీలోని 189 దేశాల జాబితాలో భారత్ 131వ స్థానానికి పరిమితమైంది. ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల ప్రాతిపదికపై ఆ సూచీ రూపొందుతుంది.
పెరిగిన నిరుద్యోగిత
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1991 వరకు భారత్ పలు నియంత్రణలు, ఆంక్షలతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించింది. వాటివల్ల అభివృద్ధి పరంగా అంతంతమాత్రం ఫలితాలే సిద్ధించాయి. స్వాతంత్య్రానికి ముందు ప్రపంచ వాణిజ్యంలో 2.2శాతంగా ఉన్న భారత్ వాటా 1985 నాటికి 0.45శాతానికి పడిపోవడమే దానికి నిదర్శనం. ఆ రోజుల్లో ప్రభుత్వ లైసెన్సు లేకుండా ఏ వస్తువునూ ఉత్పత్తి చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి వీలుండేది కాదు. లైసెన్సులూ సక్రమంగా సకాలంలో అందేవి కాదు.
లైసెన్సులో అనుమతించిన పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే జైలుశిక్షను ఎదుర్కోవలసి వచ్చేది. అధికోత్పత్తి సాగించడాన్ని నేరంగా భావించిన దేశం అప్పట్లో భారత్ ఒక్కటే. అందుకే స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలి మూడు దశాబ్దాల్లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 3.5శాతానికి మించలేదు. ఆసియా పులులుగా పేరొందిన హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్‌లు అంతకు రెట్టింపు వృద్ధిరేటు సాధించేవి. సోషలిజం పేరిట బ్యాంకులు, బీమా సంస్థల జాతీయీకరణ ఆశించిన ఫలితాలనివ్వలేదు. 'గరీబీ హఠావో' నినాదమూ పేదలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. 1981 నాటికి భారత జనాభాతోపాటు పేదల సంఖ్యా రెండింతలైంది. 1947 మొదలుకొని 1983 వరకు దేశ జనాభాలో 60శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే ఉండిపోయారు. 1983 నుంచి పేదరికం తగ్గడం ఆరంభించినా, అసలు సిసలు తగ్గుదల ఆర్థిక సంస్కరణల తరవాతనే సంభవించింది. 1993-94లో దేశ జనాభాలో పేదలు 45శాతం; 2019-20 నాటికి అది 21శాతానికి తగ్గింది.
మోదీ నేతృత్వంలో ఏక పార్టీ మెజారిటీ ప్రభుత్వం ఏర్పడటంతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే ఆశావాదం నెలకొంది. దానికి తగ్గట్లే 2015-16లో జీడీపీ వృద్ధిరేటు 7.5శాతానికి పెరిగింది. అప్పట్లో చైనా వృద్ధిరేటు 6.5శాతమే. 2016 నవంబరులో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్థికంగా తీవ్రమైన దెబ్బకొట్టిందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఆ తరవాత వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మరో దెబ్బ పడిందనే వాదనలున్నాయి. జీఎస్టీ అమలు హేతుబద్ధమే అయినా, దాన్ని 2017 జులైలో హడావుడిగా ప్రవేశపెట్టడంతో జీడీపీ వృద్ధిరేటు తగ్గిపోయింది. 2016-17లో ఎనిమిది శాతంగా ఉన్న వృద్ధిరేటు 2019-20 నాటికి నాలుగు శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కొవిడ్ మహమ్మారి విరుచుకు పడటానికి ముందే సంభవించింది. గతంలో రెండు నుంచి మూడు శాతంగా ఉన్న నిరుద్యోగం 6.1శాతానికి పెరిగిందని శ్రామిక సర్వే తేల్చింది. కొవిడ్ దెబ్బకు నిరుద్యోగిత రేటు రెట్టింపైందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) వెల్లడించింది. 2021 నుంచి రెండున్నర కోట్లమంది తమ ఉపాధిని కోల్పోయారు. ఏడున్నర కోట్లమంది అదనంగా పేదరికంలోకి జారిపోయారు.
నిజమైన వ్యవస్థాపకులకు ప్రోత్సాహం