దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో సమూల మార్పులు, సంస్కరణలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వావలంబన భారత్ లక్ష్యంగా ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించేందుకు 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నడిపించే పరిస్థితి లేదు. మునుపటి మాదిరిగా తరగతుల్లో విద్యార్థులను గుంపులుగా కూర్చోబెట్టే పరిస్థితి అంతకన్నా లేదు. ఈ క్రమంలో కేంద్రం ఆన్‌లైన్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, ఆన్‌లైన్ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు. పాఠ్యాంశాలు, బోధన అభ్యసన ప్రక్రియల్ని పునర్‌వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. విద్యార్థులను సంప్రదాయ తరగతి గది బోధన, అభ్యసన పద్ధతుల నుంచి ఆన్‌లైన్ పాఠాల వైపు ఆకర్షించే దిశగా కసరత్తు ప్రారంభించారు. లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచే పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పేందుకు వివిధ మార్గాల ద్వారా కృషి మొదలైంది. ముఖ్యంగా గుగూల్ క్లాస్‌రూం, జూమ్ యాప్, వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర మాధ్యమాల ద్వారా డిజిటల్ తరగతులను, దృశ్య, శ్రవణ రూపాల్లో పాఠ్యబోధన, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పెద్దఎత్తున ప్రోత్సాహం..
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమానికి పెద్దయెత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఒకటి నుంచి 12వ తరగతి వరకు అందరికీ ఛానళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడున్న ఛానళ్లనూ ఆధునికీకరించాలని భావిస్తున్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా డీటీహెచ్ ఛానళ్లు, ఆన్‌లైన్ మార్గాల ద్వారా ఈ నెల 30వ తేదీ నుంచి పలురకాల కోర్సులను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నారు. 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమం ద్వారా విభిన్న రకాల పద్ధతుల్లో డిజిటల్ విద్య కోసం మొదటగా 100 విశ్వవిద్యాలయాలను అనుమతించి, సుమారు 3.7 కోట్ల మందికి ఆన్‌లైన్‌లో విద్యను అందిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ పేర్కొనడం గమనార్హం. కొన్ని కోర్సులను దూరవిద్య ద్వారా ఇప్పుడున్న దానికన్నా అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.