తెలంగాణ

telangana

ETV Bharat / opinion

క్రీడలకు దూరంగా బాల్యం.. మానసిక ఒత్తిళ్లలో చిన్నారులు - క్రీడలు

పిల్లలకు చిన్నప్పటి నుంచే వ్యాయామాన్ని అలవాటు చేస్తే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భావిభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన పిల్లలు కూడా బాల్యం నుంచే ఊబకాయం, మధుమేహం, గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధ పడుతుండటం, మానసిక ఒత్తిళ్లకు లోనవుతుండటం, శారీరక ఎదుగుదల లోపిస్తుండటం ఆందోళనకు గురిచేసే అంశాలనని అంటున్నారు.

children games
క్రీడలకు దూరంగా బాల్యం

By

Published : Jul 24, 2021, 8:25 AM IST

కరోనా మహమ్మారి ఉద్ధృతి పూర్తిగా తగ్గకపోవడం, మూడో దశ వేగంగా వ్యాప్తి చెందనుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికీ బడులు తెరుచుకోవడం లేదు. ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న విద్యార్థులు, మిగతా సమయంలో స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వీడియోగేమ్స్‌, టీవీ కార్యక్రమాలే ప్రధాన వ్యాపకంగా మారాయి. వ్యాయామాల జోలికే పోవడం లేదు. శారీరక శ్రమ లేకపోతే పిల్లలు భవిష్యత్తులో అనారోగ్యానికి, మానసిక ఒత్తిళ్లకు లోనయ్యే ప్రమాదముంది. శారీరక శ్రమతో ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని, మానసిక ప్రశాంతతను పొందవచ్చని పలు పరిశోధనలు వెల్లడించాయి.

చిన్నప్పటి నుంచే..

చిన్నారులకు చిన్నప్పటి నుంచే వ్యాయామాన్ని అలవాటు చేస్తే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భావిభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన పిల్లలు కూడా బాల్యం నుంచే ఊబకాయం, మధుమేహం, గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధ పడుతుండటం, మానసిక ఒత్తిళ్లకు లోనవుతుండటం, శారీరక ఎదుగుదల లోపిస్తుండటం ఆందోళనకు గురిచేసే అంశాలే. ప్రపంచవ్యాప్తంగా 3.50 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో బాధ పడుతున్నారని ఇటీవల ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. భారత్‌లో 19 సంవత్సరాలలోపు వారిలో సుమారు 10 శాతానికి మధుమేహం వ్యాపిస్తోంది.

బాల్యంలోనే..

దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు గుండె సంబంధిత జబ్బులతో జన్మిస్తున్నారు. ప్రపంచంలో ఏటా 1.70 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుండగా, అందులో 30 లక్షల మంది భారతీయులే అన్నది చేదువాస్తవం. దేశంలో గుండె జబ్బులతో మరణిస్తున్న వారిలో 40 శాతం 55 ఏళ్లలోపు వారే ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి అనారోగ్య సమస్యలకు తోడు మానసిక రుగ్మతలు బాల్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నో పరిశోధనల్లో తేలిన అంశాల ప్రకారం- 50 శాతం మానసిక సమస్యలు 14 ఏళ్లలోపే ప్రారంభమవుతాయి. 24 ఏళ్లు వచ్చేసరికి అవి 75 శాతందాకా పెరుగుతాయి. తరవాత వ్యక్తిగత, వృత్తిగత ఎదుగుదల, కుటుంబ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

'ఫిట్‌ ఇండియా'లో భాగంగా..

ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో 11 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లల్లో 80 శాతంకంటే ఎక్కువ మంది రోజుకు కనీసం గంట కూడా వ్యాయామం చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. మన దేశంలో 72శాతం బాలలు కనీసం గంట కూడా శారీరక శ్రమ చేయడం లేదు. దీనివల్ల శారీరక ఎదుగుదల లోపిస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. మనోవికాసం సన్నగిల్లుతుంది. మేధావికాసం మందగిస్తుంది. ప్రస్తుత కొవిడ్‌ ఆంక్షల కారణంగా పాఠశాలలు లేక విద్యార్థులు బయటకు వెళ్లడం లేదు. దీనివల్ల శారీరక శ్రమ, కనీస వ్యాయామం కరవవుతున్నాయి. పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్య, మానసిక సమస్యలకు లోనుకాకుండా ఉండేందుకు అనునిత్యం కనీసం గంటపాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. విద్యార్థులు వ్యాయామం చేయడానికి వీలుగా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని, వారిలో శారీరక కసరత్తుపై స్పృహ కలిగించాలని కేంద్ర ప్రభుత్వం 'ఫిట్‌ ఇండియా'లో భాగంగా విద్యాసంస్థలనూ ఆదేశించింది. నడక, పరుగు, కబడ్డీ, ఖోఖో, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, స్కిప్పింగ్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌, జిమ్నాస్టిక్స్‌ తదితర ఆటలు, అవి ఆడే సమయంలో శరీరానికి కలిగే శ్రమ శారీరక ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. గుండె, ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి. మానసిక ప్రశాంతత పెరిగి మేధావికాసానికి బాటలు పడతాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అయితే, ప్రస్తుత కరోనా విస్తృతి సమయంలో పిల్లలను తోటివారితో ఆటలు, వ్యాయామాల కోసం బయటికి పంపించే పరిస్థితి లేనందున ఇల్లే వ్యాయామశాలగా మారాలి.

తల్లిదండ్రులే..

తల్లిదండ్రులే వ్యాయామ ఉపాధ్యాయుల అవతారం ఎత్తాలి. ఇంట్లో, ఆవరణలో, మిద్దెపైన ఆడుకునేలా ప్రోత్సహించాలి. నడక, పరుగు, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ వంటి కసరత్తులను ఇంట్లోనే చేయించాలి. మేధను పెంచే చదరంగం, క్యారమ్స్‌, వైకుంఠపాళి, అంత్యాక్షరి, క్విజ్‌ తదితరాలు ఆడించాలి. ప్రస్తుత కాలంలో చిన్నారులు గోలీలు, బొంగరం, దాగుడుమూతలు, తొక్కుడు బిళ్ల, అష్టాచెమ్మా తదితర సంప్రదాయ ఆటలకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని చౌదరి చరణ్‌సింగ్‌ విశ్వవిద్యాలయం సంప్రదాయ ఆటలకు జీవం పోస్తూ భావిభారత పౌరులకు వీటిని నేర్పించేందుకు నడుం బిగించింది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యావిధానం-2020లో భాగంగా ఇటీవల ఆ యూనివర్సిటీ వ్యాయామ విద్య కోర్సుల్లో కర్రాబిళ్ల, తొక్కుడుబిళ్ల, గోలీలాట వంటి సంప్రదాయ ఆటలను ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇలాంటి సంప్రదాయ ఆటల గురించి వివరించి ఆడించాలి.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details