తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విస్తరిస్తున్న చీకటి వ్యాపారం.. మత్తులో జీవితాలు చిత్తు!

మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. యువకులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక-2020 ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత్తుపదార్థాల వినియోగం ఏటా పెరుగుతోంది. గత నెలలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సుమారు మూడు వేల కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఏకంగా 21 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.

DRUGs
మాదక ద్రవ్యాలు

By

Published : Oct 11, 2021, 5:04 AM IST

భారత్‌లో ఎంతో విస్తృతమైన నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. యువకులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక-2020 ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత్తుపదార్థాల వినియోగం ఏటా పెరుగుతోంది. గత నెలలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సుమారు మూడు వేల కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఏకంగా 21 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇంత పెద్దయెత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. రోజులు గడుస్తున్నా ఆ ముఠాకు సంబంధించి అధికారులు ఇప్పటికీ చిక్కు ముడులు విప్పకపోవడం వెనక ఉన్న లోగుట్టు ఏమిటో అర్థం కావడంలేదు. ముంద్రాలో పట్టుబడిన డ్రగ్స్‌పై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు గళం విప్పుతున్నాయి.

వ్యవస్థల్లో డొల్లతనం

ముంద్రా సంఘటన మరవక ముందే బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇటీవల ముంబయి-గోవా క్రూయిజ్‌ నౌకలో ఒక రేవ్‌ పార్టీలో మాదక ద్రవ్యాలతో పట్టుబడటం కలకలం రేపింది. ఆర్యన్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాథమిక విచారణలో తేల్చి చెప్పింది. ముంబయి అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జస్టిస్‌ ఆర్‌.ఎం.నార్లికర్‌, ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరిని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. తెలంగాణలో 2017లో హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌ రాకెట్‌ను సైతం అధికారులు ఛేదించారు. నగరంలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు అధిక మోతాదులో మత్తు పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. కౌమారదశలో ఉన్నవారు, యువకులు మాదకద్రవ్యాలను అధికంగా వినియోగిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు సైతం డ్రగ్స్‌ మాఫియా మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. దానిపై విచారణలు సాగినా ఏమీ తేలలేదు. డ్రగ్స్‌ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆర్థిక లావాదేవీలు ఉండటంవల్లే కేసులు నీరుగారుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఆస్తులు, దోపిడి, దేశద్రోహంతో సహా పలు నేరాలకు పాల్పడిన అధికారులే తమకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవల వ్యాఖ్యానించారు. అధికారులు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా నిజాయతీగా విధులు నిర్వర్తిస్తే మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాలను సమర్థంగా కట్టడి చేయవచ్చు.

అక్రమంగా ధనం సంపాదించి అడ్డదారిలో ఎదగాలని భావించే వారు మాదకద్రవ్యాల రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు. ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలకు ఆర్థిక ఆటంకాలు ఎదురుకాకుండా ఈ చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వివరాల ప్రకారం 2021 జనవరి నుంచి జులై చివరినాటికి కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలు, రాష్ట్రాల్లోని పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు కలిసి సుమారు 2,865 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని, 4,101 మంది నిందితులపై కేసులు నమోదు చేశాయి. జాతీయ నేర గణాంకాల ప్రకారం 2018-2020 మధ్య కాలంలో 1.95 లక్షల మందిని అరెస్టు చేశారు. ఇందులో గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉన్నారంటే ఆ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

అవగాహన కల్పించాలి

మాదకద్రవ్యాలను అరికట్టేందుకు భారత సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ‘నశా ముక్త్‌ భారత్‌’ (వ్యసనం లేని భారతదేశం) ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం దేశంలో అధిక సంఖ్యలో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లుగా గుర్తించిన 272 జిల్లాల్లో ఈ ప్రచారం కొనసాగుతోంది. దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలి. మాదకద్రవ్యాల వినియోగంవల్ల కలిగే చెడు ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మత్తుపదార్థాల అక్రమ రవాణా, నిల్వకు సంబంధించి సమాచారం అందించే వారికి భద్రత కల్పించాలి. మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్‌ పదార్థాల చట్టం-1985 అమలుకు- కస్టమ్స్‌, డీఆర్‌ఐ, పోలీస్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సీబీఐ, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌, జాతీయ దర్యాప్తు సంస్థల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకొంటున్నాయి. అయినా ఆశించిన ఫలితం లేదనడానికి భారీగా పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలే నిదర్శనం.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ , ('సెస్‌'లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ఇదీ చూడండి:భారత్​ నుంచి రష్యాకు 40 లక్షల 'సింగిల్​ డోస్'​ టీకాలు!

ABOUT THE AUTHOR

...view details