మత్తు అనే భయంకరమైన ఊబిలోకి నెట్టుకుపోయి యువత బతుకుల్ని, కన్నవారి ఆశల్ని క్రూరంగా చిత్తుచేసే భల్లూకం పట్టు మాదకద్రవ్యాలది. దేశవ్యాప్తంగా వాటి ఉరవడి తీరుతెన్నులపై క్షేత్రస్థాయి కథనాలు, విశ్లేషణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. ఒకప్పుడు సంపన్నవర్గాల జల్సా విందులకే పరిమితమైన మాదకద్రవ్యాల లభ్యత, నెట్‌వర్క్ ఇంతలంతలై దేశం మూలమూలలా పాఠశాల విద్యార్థులకు సైతం చేరువైన వైనం దిమ్మెరపరుస్తోంది. కొన్నాళ్లక్రితం వరకు అడపాదడపా తనిఖీల్లో గంజాయి పట్టుబడినా పరిమిత స్థాయి సరఫరా బాగోతాలే వెలుగుచూసేవి. ఇప్పుడు తరచూ వందల కిలోల సరకు తరలిస్తున్న ముఠాల బరితెగింపు, నిఘా వ్యవస్థల దక్షత అప్రమత్తతలపట్ల వాటిలో పేరుకున్న చులకన భావాన్ని చాటుతోంది. విశాఖనుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు చేరవేస్తున్న వెయ్యి కిలోల గంజాయిని మొన్నీమధ్య రాచకొండ ఎల్‌బీనగర్ పోలీసు దళాలు వలేసి పట్టుకున్నాయి. మార్కెట్లో ఆ సరకు కోటీ 30లక్షల రూపాయలదాకా పలుకుతోంది. భద్రాచలం వద్ద ఎనిమిది కోట్ల రూపాయల గంజాయి దొరికిన తరవాత స్వల్ప వ్యవధిలోనే కరీంనగర్‌లో 270 కిలోలు, మణుగూరులో 119 కిలోల మేర పట్టివేత, కృష్ణాజిల్లాలో బీటెక్ విద్యార్థులు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం... ఎలుగెత్తుతున్నదేమిటి? మూతపడిన ఫార్మా పరిశ్రమలెన్నో డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా వర్ధిల్లుతుండటం తెలియజెబుతున్నదేమిటి? కొత్తకొత్త మార్గాల్లో మాదకముఠాలు తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంటే- నిఘా వ్యవస్థ తాను ఉండీ లేనట్లేనని నిర్లజ్జగా నిరూపించుకుంటోంది. 'మేమింత పట్టుకుంటున్నాం కదా...' అనే అడ్డగోలు వాదనలు చెల్లని కాసులు. విస్తృతస్థాయిలో సరఫరా జోరెత్తుతోందంటే- దొరికిపోతున్నదానికి ఎన్నోరెట్ల పరిమాణంలో మాదకద్రవ్యాలు గుట్టుగా చేరాల్సిన చోట్లకు చేరిపోతున్నాయని అర్థం!
తొలి ఐదు స్థానాల్లో ఆ రాష్ట్రాలు..
ఈ ఏడాది మొదట్లో చండీగఢ్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన అధ్యయనం, అక్కడ 50శాతం విద్యార్థులు మత్తుపదార్థాల సేవనానికి అలవాటు పడ్డట్లు నిర్ధారించింది. ఆమధ్య పంజాబ్ పోలీస్ బలగాల్లో సగంమంది వరకు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారన్న వివరాలు గగ్గోలు పుట్టించాయి. తమ రాష్ట్రంలో 70శాతానికిపైగా యువత డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పంజాబ్ రాష్ట్రప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానానికి నివేదించడం తెలిసిందే. జైళ్లలోనూ డ్రగ్స్ స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతున్నదని సూటిగా తప్పుపట్టిన పంజాబ్-హరియాణా హైకోర్టు ఉద్ధృత స్థాయిలో మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం చేపట్టాలని నిరుడు జనవరిలో ప్రభుత్వ యంత్రాంగానికి నిర్దేశించింది. న్యాయస్థానం క్రోడీకరించిన ఇరవైఅయిదు అంశాల సూత్రావళిపై ఇంత మందాన దుమ్ము పేరుకుపోయిందే తప్ప, నేటికీ ఒరిగిందేమీ లేదు. పిల్లల్లో మత్తు వ్యసనాన్ని చెదరగొట్టేలా పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిందిగా 2018 జులైలో కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఉద్బోధకూ అదే గతి పట్టింది. విద్యార్థుల మత్తు వదిలించే మార్గం చూపాలని ఏడు నెలలక్రితం తెలంగాణ హైకోర్టు విద్యాసంస్థలకు పిలుపిచ్చింది. ఇంజక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యసనపరుల సంఖ్య ప్రాతిపదికన- యూపీ, పంజాబ్, దిల్లీ, ఏపీ, తెలంగాణ తొలి అయిదు స్థానాల్ని ఆక్రమించాయి. ఆ అప్రతిష్ఠను చెక్కుచెదరకుండా పరిరక్షించాలన్న పట్టుదలతోనే కావచ్చు- న్యాయస్థానాల అదేశాల స్ఫూర్తిని నీరుకార్చడంలో విద్యాసంస్థలు, నిఘా వ్యవస్థలు శాయశక్తులా పోటీపడుతున్నాయి!
మూడు ముఠాలు- ఆరు మూటలుగా..