లద్దాఖ్‌లో భారత్, చైనా సేనల ఉపసంహరణకు అంగీకారం కుదిరినా- అక్కడ చైనా సేనలు ఇప్పటికీ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలన్న స్పృహ ఉభయుల్లోనూ ఉంది. ఈ పరిస్థితిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అధినేతలు పాల్గొన్న వర్చువల్ 'క్వాడ్' శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ సభను చూసి చిర్రెత్తిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్, క్వాడ్ పేరిట భారతదేశం తమను వ్యూహపరంగా బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తోందని మండిపడింది. తన సరిహద్దుల్లో చైనా దూకుడుకు ముకుతాడు వేయాలంటే క్వాడ్ దేశాలతో- ముఖ్యంగా అమెరికాతో రక్షణ బంధాన్ని పటిష్ఠపరచుకోవడం అవసరమని భారత్ నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 19-21 తేదీల్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె.ఆస్టిన్ భారత సందర్శన సందర్భంగా ఈ బంధం మరింత బలపడనుంది. ఈ పర్యటనలో అమెరికా నుంచి భారత్ మానవ రహిత సాయుధ మర భ్రమరాలు (కాంబాట్ డ్రోన్లు) కొనడానికి రంగం సిద్ధంకావచ్చు. ఇవి చేతిలో ఉంటే లద్దాఖ్‌లో రక్తపాత రహితంగానే చైనాను నిలువరించగలిగేవారమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. కాంబాట్ డ్రోన్లు 21వ శతాబ్ది యుద్ధాల రూపురేఖలను మార్చేస్తున్న దృష్ట్యా అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి వాటిని కొనడంతోపాటు- సొంతంగా తయారుచేయాలనీ భారత్ నిర్ణయించింది.
ఉత్పత్తిపై భారత్ దృష్టి
యుద్ధంలో విజయానికి డ్రోన్లు తోడ్పడతాయని 2020లో జరిగిన మూడు సమరాలు చాటిచెప్పాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చైనీస్ వింగ్ లూంగ్ డ్రోన్లకు లేజర్ గైడెడ్ బాంబులను అమర్చి లిబియా నేషనల్ ఆర్మీ(ఎల్‌ఎన్‌ఏ)కి సరఫరా చేసింది. దీనికి పోటీగా ఎల్‌ఎన్‌ఏ ప్రత్యర్థులకు టర్కీ తన బేరక్తర్ క్షిపణులను అందించింది. వీటి దెబ్బకు ఎల్‌ఎన్‌ఏ వెనకడుగు వేయకతప్పలేదు. టర్కీ, ఇజ్రాయెల్ సరఫరా చేసిన డ్రోన్లతోనే అజర్ బైజాన్ నిరుడు ఆర్మీనియా మీద పైచేయి సాధించింది. సిరియాలో సైతం టర్కీ డ్రోన్లు బషర్ అల్ అసద్ ప్రభుత్వ సేనలకు చెందిన వందలాది సాయుధ శకటాలను ధ్వంసం చేశాయి. పొరుగు ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి భారత్ క్రమంగా డ్రోన్ల దిగుమతికి, ఉత్పత్తికి సమాయత్తమవుతోంది. అమెరికన్ కంపెనీ జనరల్ ఏటమిక్స్ నుంచి లీజుకు తీసుకున్న రెండు సీ గార్డియన్ డ్రోన్ల పనితీరుపై సంతృప్తి చెందిన భారత నౌకాదళం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలను ఎదుర్కోవడానికి 10 డ్రోన్లను కొనదలచింది. ఈ ఉపగ్రహచోదిత డ్రోన్ 45 వేల అడుగుల ఎత్తులో 35 గంటలపాటు నింగిలోనే ఉండగలదు. భారత సైన్యం, వాయు సేనలు చెరో పది డ్రోన్లను కొంటాయి. ఇంతకుముందు ఇజ్రాయెల్ నుంచి 90 హెరాన్, హరాప్ డ్రోన్లను భారత సైన్యం కొనుగోలు చేసింది. హెరాన్‌లను నిఘా కోసం వినియోగిస్తున్నారు. హరాప్ ఆకాశంలో ఎగురుతూ గురిచూసి శత్రువుపై విరుచుకు పడుతుంది. ఈ తరహా డ్రోన్‌ను 'లాయిటర్ మ్యూనిషన్ (నింగిలో తారట్లాడే ఆయుధం)' అంటారు. హెరాన్ నిఘా డ్రోన్‌లకూ బాంబులు అమర్చడానికి గతేడాది ఆగస్టులో భారత్, ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కొత్తగా మరి నాలుగు ఆధునిక హెరాన్ నిఘా డ్రోన్లను మూడేళ్ల లీజుపై తీసుకోవడానికి జనవరిలో మరో ఒప్పందం కుదిరింది. వీటిని చైనా సరిహద్దులో నియోగిస్తారు. రెండు దేశాలు కలిసి భారత్‌లో డ్రోన్ల తయారీకి ఫిబ్రవరిలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. అదే సమయంలో సొంత డ్రోన్ రుస్తుం-2 నూ భారత్ అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ డ్రోన్‌ను 27వేల అడుగుల ఎత్తులో 18 గంటల సేపు ఎగరేసి పరీక్షిస్తారు. ఐఐటీ-బొంబాయి పూర్వ విద్యార్థులు ఇద్దరు స్థాపించిన ఐడియా ఫోర్జ్ సంస్థ నుంచి రూ.130 కోట్లతో డ్రోన్లు కొనుగోలు చేయడానికి భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెలీ, భారతీయ డ్రోన్ ఉత్పత్తిదారులతో పోటీ పడి మరీ ఐడియా ఫోర్జ్ ఈ కాంట్రాక్టును గెలుచుకుంది.
ప్రయోజనాలెన్నో!