తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​- శ్రీలంక చారిత్రక మైత్రి కొనసాగేనా..?

శ్రీలంక ఆర్థిక అగచాట్లవల్లనే చైనా నుంచి రుణాలు, పెట్టుబడులు స్వీకరించాల్సి వస్తోందని భారత్‌ అర్థం చేసుకొంటోంది. అయితే లంకలో చైనా ప్రాజెక్టుల నిర్మాణం అతి వేగంగా సాగుతుంటే భారతీయ ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి. తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్ళిన భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ శృంగ్లా అక్కడ మన ప్రాజెక్టుల వేగాన్ని పెంచాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా ప్రాంతీయ ఎన్నికలను నిర్వహించాలనీ సూచించారు.

india, srilanka relations
భారత్​- లంక

By

Published : Oct 6, 2021, 6:43 AM IST

శ్రీలంక తన చిరకాల నేస్తం భారత్‌కు దూరమవుతూ చైనాను ఆలింగనం చేసుకొంటోందనే అభిప్రాయం కొన్నాళ్లుగా బలపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొలంబో రేవు పశ్చిమ కంటైనర్‌ టెర్మినల్‌ (డబ్ల్యూసీటీ) కాంట్రాక్టులో 51శాతం వాటాలను భారత్‌కు చెందిన అదానీ గ్రూపునకు లంక దత్తం చేయడం కొత్త మలుపు. అంతకుముందు భారత్‌, జపాన్‌, శ్రీలంకలు కలిసి నిర్మించాల్సిన తూర్పు కంటైనర్‌ టెర్మినల్‌ (ఈసీటీ) చివరి నిమిషంలో చైనా పరం కావడం భారత్‌కు ఎదురు దెబ్బ అని భాష్యాలు వెలువడ్డాయి. అయితే, శ్రీలంకలో చైనా ఆర్థిక కార్యకలాపాలను తాము వ్యతిరేకించడం లేదని, చైనా ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని భారత్‌ ప్రాజెక్టులకూ ఇవ్వాలని కోరుతున్నామని దిల్లీ స్పష్టం చేస్తోంది. అదే సమయంలో శ్రీలంకలోని ఏ రేవునూ భారత్‌కు వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు మూడో దేశాన్ని అనుమతించరాదనీ ఆశిస్తోంది.

2014లో రెండు చైనా జలాంతర్గాములు కొలంబో రేవులో లంగరు వేయడం, 1987నాటి భారత్‌-శ్రీలంక భద్రతా ఒప్పందానికి ఉల్లంఘనే. దీనిపై భారత్‌ అభ్యంతరాన్ని పురస్కరించుకుని శ్రీలంక అప్పటి నుంచి చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు ఆశ్రయమివ్వడానికి నిరాకరిస్తూ వస్తోంది. అలాగని చైనాతో సంబంధాలను తెగతెంపులు చేసుకునే స్థితిలో శ్రీలంక లేదు. చైనా నుంచి తీసుకున్న భారీ రుణాన్ని గడువు ప్రకారం 2017 డిసెంబరులో చెల్లించలేక- హంబన్‌టొట రేవును లంక 99 ఏళ్లకు డ్రాగన్‌కు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రాక్పశ్చిమ దేశాల మధ్య అత్యంత రద్దీ రవాణా మార్గంలో ఉన్న ఈ రేవు చైనా పరం కావడంపై అమెరికా, భారత్‌లు ఆందోళన చెందాయి.

చైనా నిధులు తప్పనిసరై...

అసలు కొవిడ్‌ కడగండ్లకన్నా ముందు నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న శ్రీలంక ఎప్పటికప్పుడు చైనాపై ఆధారపడక తప్పడంలేదు. ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువై విదేశాలకు సకాలంలో చెల్లింపులు జరపలేక చైనా నుంచి అప్పులు తీసుకోవలసి వస్తోంది. 2010-20 మధ్య శ్రీలంకలో అతి పెద్ద పెట్టుబడిదారు చైనాయే. హంబన్‌టొట రేవుతోపాటు కొలంబో నగరాన్ని విమానాశ్రయంతో కలిపే ఎక్స్‌ప్రెస్‌ వే, దేశంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా మట్టల రాజపక్స ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం చైనా రుణాలతోనే నడుస్తున్నాయి. విదేశాల నుంచి పెరిగిపోతున్న దిగుమతుల వల్ల విదేశీ ద్రవ్య నిల్వలు తరిగిపోయి, వాటిని భర్తీ చేసుకునే మార్గం లేక దిగుమతులపై శ్రీలంక ఆంక్షలు పెట్టింది. దీనివల్ల భారత్‌ నుంచి దిగుమతులు భారీగా తగ్గినా చైనా నుంచి మాత్రం స్వల్పంగానే తగ్గాయి. చైనాకు శ్రీలంక ఎగుమతులకన్నా లంకకు చైనా ఎగుమతులు చాలా ఎక్కువ. ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు నానాటికీ పెరిగిపోతోంది.

2020లో శ్రీలంక ఎగుమతుల్లో చైనా వాటా కేవలం 2.3శాతం. భారత్‌ వాటా 6.1శాతం. ఏతావతా వాణిజ్య లోటును అధిగమించడానికి చైనా మీద కానీ, భారత్‌-అమెరికాల మీద కానీ, ఐఎంఎఫ్‌-ప్రపంచ బ్యాంకుల మీద కానీ లంక ఆధారపడక తప్పదు. వీటిలో దేన్నీ దూరం చేసుకోకుండా నేర్పుగా నెట్టుకురావాలని శ్రీలంక గ్రహించింది. తాజాగా భారతీయ అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ కోణం నుంచే చూడాలి.

చారిత్రక అనుబంధం

ప్రస్తుతమైతే లంక చైనాపై అధికంగా ఆధారపడుతున్నా, భారత్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని విస్మరించజాలదు. లంకకు భారత్‌ అందించిన అపూర్వ కానుక- బౌద్ధం. కష్టకాలంలో శ్రీలంకను ఆదుకోవడానికి అందరికన్నా ముందు వచ్చేది భారతదేశమే. 2004 డిసెంబరులో లంక తీరాన్ని సునామీ ముంచెత్తిన 20 గంటల్లోనే భారత వాయుసేన విమానం అత్యవసర సహాయ సామగ్రితో కొలంబోకు చేరుకుంది. కొవిడ్‌ కాలంలోనూ లంకను భారత్‌ పలు విధాలుగా ఆదుకొంటోంది. శ్రీలంకలో తమిళులు, సింహళుల మధ్య జాతి వైరం పేట్రేగినప్పుడు ఎల్‌టీటీఈని కట్టడి చేసి, లంక ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి భారత శాంతి రక్షక దళం (ఐపీకేఎఫ్‌) రంగంలోకి దిగింది. ఆ పోరులో 1,300 మంది భారత జవాన్లు బలయ్యారు. తమ భూభాగంలోని తమిళుల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడటం శ్రీలంకకే క్షేమకరమని గత జనవరిలో కొలంబోను సందర్శించిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సలహా ఇచ్చారు. శ్రీలంక తమిళుల విషయంలో- ఆ దేశ విధానాలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శలకు లోనయ్యాయి.

ఎల్‌టీటీఈతో సమరంలో లంక దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని మండలి తూర్పారబట్టింది. దీనికి ప్రతిగా శ్రీలంకపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మార్చిలో మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. చైనా, పాకిస్థాన్‌, రష్యాలతోపాటు 11 దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా- భారత్‌, జపాన్‌లతో పాటు 14 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. శ్రీలంకతో సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్‌ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్‌ పైరిస్‌, ఆర్థిక మంత్రి బసిల్‌ దిల్లీ రానున్నారు. తమ దేశంలో అభివృద్ధికి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు, భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలకు భారత్‌ అందించనున్న 45 కోట్ల డాలర్ల (రూ.3,350 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ఖరారు చేసుకుంటారు. ఈ పర్యటనలకు కొనసాగింపుగా వచ్చే ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ, లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ రెండు దేశాలూ తమ చిరకాల మైత్రిని కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో దీన్ని బట్టి తేటతెల్లమవుతుంది.

మైత్రిని మరవవద్దు

శ్రీలంక ఆర్థిక అగచాట్లవల్లనే చైనా నుంచి రుణాలు, పెట్టుబడులు స్వీకరించాల్సి వస్తోందని భారత్‌ అర్థం చేసుకొంటోంది. అయితే లంకలో చైనా ప్రాజెక్టుల నిర్మాణం అతి వేగంగా సాగుతుంటే భారతీయ ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి. తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్ళిన భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ శృంగ్లా అక్కడ మన ప్రాజెక్టుల వేగాన్ని పెంచాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా ప్రాంతీయ ఎన్నికలను నిర్వహించాలనీ సూచించారు.

చైనాతో ఆర్థిక బంధాన్ని పటిష్ఠం చేసుకోవడం కోసం భారత్‌తో చిరకాల స్నేహ, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలను వదులుకోవద్దని దిల్లీ స్పష్టం చేస్తోంది. భారత్‌, చైనాలను సమాన ఫాయాలో పరిగణించడం శ్రీలంకకే మేలు చేస్తుందని గొటబయ రాజపక్ష సర్కారుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం హితవు చెబుతోంది.

- కైజర్‌ అడపా

ABOUT THE AUTHOR

...view details