జులై ఒకటిన (1882లో) జన్మించి ఎనభయ్యో ఏట అదే తేదీన భౌతికయాత్ర చాలించిన 'భారతరత్న' డాక్టర్ బి.సి.రాయ్ స్మరణలో ఆ రోజును వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అంశాన్ని- 'కొవిడ్ సవాలును దీటుగా ఎదుర్కొని మరణాలను కట్టడి చేయడం'గా నిర్ణయించారు. వాస్తవానికి ఆ మేరకు అధికారిక ప్రకటన వెలుగుచూడటానికి ముందు సుమారు అయిదు నెలలుగా దేశీయ వైద్యగణం, సహచర సిబ్బంది- మునుపెన్నడూ ఎరుగని పరిస్థితిని ఎదుర్కోవడం చూస్తున్నాం. కరోనా వైరస్ పాలబడినవారికి చికిత్స, పరిచర్యలు అందించడానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న ఆరోగ్య కార్య కర్తల్లో రెండువేల మందికిపైగా ఒక్క దిల్లీలోనే కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. దేశంలో జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది మొదలు ఇప్పటిదాకా కొవిడ్ కోరలకు చిక్కి పదుల సంఖ్యలో వైద్యులు అశువులు బాశారు. ఇది ప్రాణాల్ని బలిపెట్టి సేవలందించే అసమాన త్యాగం తప్ప మరొకటి కాదు!
సొంతవారే కాదన్నా..
ఇటీవల భాగ్యనగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఒకవ్యక్తి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే, అతడి కుటుంబీకులు అక్కడినుంచి క్షణాల్లో మాయమైపోయారు. తనవాళ్లను చూడాలని ఉందని, ఒక్కసారి మాట్లాడించమన్న అతగాడి అభ్యర్థనపై కుటుంబసభ్యులకు వైద్య సిబ్బంది ఫోన్‌చేసినా- అవతలినుంచి ఉలుకూ పలుకూ లేదు! పరిస్థితి వికటించి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినవారి విషయంలోనూ గుండెల్ని మెలిపెట్టే ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత కుటుంబం ముఖం చాటేసినా రోగుల్ని ఆదరంగా సాకి వీలున్నంతలో స్వస్థపరచే యత్నాల్ని భారత వాయుదళం తనదైన పద్ధతిలో గౌరవించిన తీరు ఎందరికో చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ రోజు నింగినుంచి కురిసిన పూలవాన, వైద్యసిబ్బంది అవిరళ సేవలకు అందమైన నజరానా!
ఓపీ సేవలపై దృష్టి..
దేశంలో అనేకుల్ని కరోనా వైరస్ కన్నా, ఒకవేళ మహమ్మారి వైరస్ పాలబడితే తమ కుటుంబం గతేమి కాను అన్న భీతే ఎక్కువగా వణికిస్తోంది. వ్యాధి తాలూకు లక్షణాలేమీ కనిపించకపోయినా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. కరోనా కారణంగా మరణాలు మొత్తం కేసులలో రెండున్నర శాతం వరకే పరిమితమవుతున్నా, దీర్ఘకాలిక రోగుల్లోనూ అత్యధికులు కొవిడ్ కోరలనుంచి బయటపడగలుగుతున్నా- అనవసర భయాందోళనలు పలువుర్ని కుంగదీస్తున్నాయి. తీవ్రంగా ఆందోళన చెందినప్పుడు మనం సాధారణంగా స్వల్ప పరిమాణంలోనే గాలి పీల్చుకుంటాం. అందువల్ల ఊపిరితిత్తుల్లో ప్రాణవాయువు శాతం తగ్గి, బొగ్గుపులుసు వాయువు పెరుగుతుంది. అటువంటి స్థితి కరోనా ధాటికి అనుకూలమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా కలత చెందవద్దంటున్నా, ఆందోళనపడుతున్నవారి సంఖ్య విస్తరిస్తున్న దృష్ట్యా- డిసెంబరు నాటికి దేశంలో దాదాపు ఆరున్నర కోట్లమందికి వైరస్ సోకుతుందని అంచనా. ఆ పరిస్థితిలో వైద్య సిబ్బందిపై పనిభారం ఇంతలంతలవుతుందని, అందువల్ల వెలుపలి రోగుల (ఓపీ) సేవల నియంత్రణపై యంత్రాంగం దృష్టి పెట్టాలని ఐఎమ్‌ఏ (భారతీయ వైద్యసంఘం) ఇప్పటికే పిలుపిచ్చింది.
దురదృష్టకర ఘటనలు
సుమారు మూడు లక్షలమంది డాక్టర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎమ్‌ఏ- వైద్యుల త్యాగాన్ని విస్మరించవద్దంటూ ప్రజానీకానికి ఆమధ్య విజ్ఞప్తి చేసింది. మూడేళ్లక్రితం ఆ సంఘమే ఒక అధ్యయనాన్ని వెలువరించింది. తాము అభిప్రాయాలు సేకరించిన వారిలో 75శాతానికిపైగా వైద్యులు విధుల్లో ఉండగా హింసాత్మక ఘటనలు చవిచూశారని, తమ కార్యక్షేత్రం వద్ద సొంత భద్రత ఏర్పరచుకోవాలని 56శాతానికిపైగా డాక్టర్లు భావిస్తున్నారని అప్పట్లో వెల్లడించింది. కరోనా విజృంభణ మొదలయ్యాక దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలు వెలుగుచూశాయి. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై అనుచిత దాడులు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకంటూ అటువంటి అఘాయిత్యాల్ని 'నాన్ బెయిలబుల్' నేరంగా పరిగణిస్తూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చింది. తీవ్ర దాడులకు పాల్పడినట్లయితే ఏడేళ్లవరకు జైలుశిక్ష, అయిదు లక్షల రూపాయలదాకా జరిమానా విధించేలా 1897నాటి చట్టంలో మార్పులు ప్రతిపాదించారు.
నాణేనికి రెండో పార్శ్వం ఎప్పుడూ ఉంటుంది. వైద్య సిబ్బంది సేవానిరతిని చిన్నబుచ్చేలా కొందరి అనుచిత ధోరణులు వార్తలకు ఎక్కుతున్నా- వృత్తికి వన్నె తెస్తున్న నిబద్ధులు, త్యాగమూర్తుల సేవలు వెలకట్టలేనివి. వాస్తవికావసరాలకు, ఉన్న వైద్యులకు ఇతరత్రా సిబ్బందికి మధ్య పూడ్చలేని అంతరం కారణంగా- నేటి స్థితిలో ప్రతి డాక్టరూ కొవిడ్‌పై మడమ తిప్పని పోరులో కీలక పాత్ర పోషించాల్సిందే. అందుకు తగ్గట్లు ప్రజలు, ప్రభుత్వాలు తమవంతు తోడ్పాటు సమకూర్చాల్సిందే!
- హరిచందన, రచయిత