Diya Kumari vs Vasundhara Raje :రాజస్థాన్‌లో రాచరిక వ్యవస్థ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. రాజకుటుంబ నేపథ్యంతో వసుంధరా రాజే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అయితే ఆమెకు అధిష్ఠానం, ఆరెస్సెస్‌తో విబేధాలున్నాయి. అందుకే ఆమెను కొన్నేళ్లుగా బీజేపీ అధినాయకత్వం పక్కన పెట్టింది. ఆమెకు ప్రత్యామ్నాయంగానే ప్రముఖ రాజ కుటుంబానికి చెందిన దియాకుమారిని తెరమీదకు తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్‌సమంద్ లోక్‌సభ ఎంపీగా ఉన్న దియా కుమారిని ఆగమేఘాల మీద అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపింది. ప్రతిష్ఠాత్మక విద్యాధర్‌నగర్ నుంచి పోటీకి నిలిపింది. రాష్ట్రంలో పార్టీని దశాబ్దాలుగా బలోపేతం చేసిన భైరాన్ సింగ్ షెకావత్ వారసత్వమైన నర్పత్ సింగ్‌ను కాదని ఆ స్థానాన్ని దియాకు కట్టబెట్టింది.
Rajasthan Assembly Election 2023 :వసుంధరా రాజే 2003లో సీఎం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ఆర్ఎస్ఎస్తో విభేదాలు ఉన్నాయి. రాజేకు ప్రత్యామ్నాయంగా వేరొకరిని సిద్ధం చేయాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. అదే సమయంలో బీజేపీలో అత్యున్నత నిర్ణయాధికారం కలిగిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోనూ రాజేకు సంబంధాలు నామమాత్రమే. ఇదే సమయంలో దియా కుమారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నా.. బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఆమె సొంత స్థలాన్ని ఇచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ జైపుర్‌లో నిర్వహించిన పరివర్తన్ యాత్రను ఆమె ముందుండి నడిపించారు. ఈ క్రమంలో ఆమెనే రాజేకు ప్రత్యామ్నాయంగా ఉంచాలని అధిష్ఠానం యోచిస్తోంది.