డిజిటల్ ప్రపంచం... మొన్నటిదాకా విలాస జీవనశైలికి సంకేతం. ఇప్పుడు అదొక నిత్యావసరం. డిజిటల్ సౌకర్యాలను సమకూర్చుకోవడం ఇప్పుడు ఎవరికో తప్పనిసరి అవుతోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఆర్థిక, మానవ పురోగతిలో ఇది కనీస అవసరంగా మారింది. విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి తప్పనిసరి సేవలను ప్రభావశీలంగా అందించేందుకు డిజిటైజేషన్ శక్తిమంతమైన ఉపకరణంలా అవతరించింది. సమాజంలో నిమ్న వర్గాలకు సాధికారత కల్పించేందుకు, పర్యావరణ సుస్థిరతకు, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు డిజిటలీకరణ ఎంతగానో తోడ్పడుతుంది. అన్ని వర్గాల సామాజిక అభివృద్ధిని పరిఢవిల్లేలా చేస్తుంది. కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో డిజిటల్ ప్రపంచం అందరికీ, చవకగా అందుబాటులోకి రావడం- మన దేశంలో సామాజిక, ఆర్థిక అత్యవసరంగా మారింది.
సాంకేతికతకు దూరంగా...
ఆర్థికంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన, పేద దేశాల మధ్య డిజిటల్ అంతరాలు పోనుపోను విస్తరిస్తున్నాయి. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల మధ్యా ఈ అంతరాలున్నాయి. ఒకే ప్రాంతంలో ఉండే విభిన్న విద్యా స్థాయులు, వివిధ సామాజిక ఆర్థిక సమూహాల మధ్య కూడా అంతరాలు నెలకొన్నాయి. దివ్యాంగులు, ఆంగ్ల భాషతో సమస్యలు ఎదుర్కొనే వారికి సమాచార సాంకేతిక ఉపకరణాలతో అనుసంధానాన్ని పెంపొందించుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 1995లో ప్రపంచంలోని ఒక శాతం జనాభాకు మాత్రమే అంతర్జాలం అందుబాటులో ఉండేది. ప్రస్తుతం 60శాతం ప్రజలకు అందుబాటులో ఉంది! అభివృద్ధి చెందిన దేశాల్లో 87శాతానికి అంతర్జాల సౌకర్యం చేరువలో ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 47శాతానికే ఈ వెసులుబాటు ఉంది.
కరవైన అంతర్జాల వసతి
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) 2019 డిసెంబరు నాటి గణాంకాల ప్రకారం- దేశాలవారీగా అంతర్జాల వినియోగదారుల సంఖ్యను పరిశీలిస్తే- చైనాలో 90.4 కోట్లు, భారత్‌లో 71.87 కోట్లు, అమెరికాలో 32.4 కోట్ల మంది చొప్పున ఉన్నారు. జనాభాలో అంతర్జాలం కలిగి ఉన్నవారి శాతాన్ని చూస్తే- భారత్ చాలా దేశాలకన్నా వెనకబడి ఉంది. మనదేశ జనాభాలో కేవలం 54శాతానికే అంతర్జాలం అందుబాటులో ఉంది. జియో రాకతో అంతర్జాల సేవలు చౌకగా మారినా- పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని చెప్పగల వీల్లేదు. డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోని భిన్న వర్గాల మధ్య తేడాలున్నాయి. జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అంచనాల ప్రకారం నిరుపేదల్లో 20శాతం కుటుంబాల్లో కేవలం 2.7 శాతానికే కంప్యూటర్లు, 8.9 శాతానికి అంతర్జాలం అందుబాటులో ఉన్నాయి. 20శాతం ధనిక కుటుంబాల్లో సైతం 27.6శాతం కుటుంబాలకే కంప్యూటర్, సగం కుటుంబాలకు అంతర్జాల వసతి లభ్యమయ్యాయి.
విద్యారంగంపై..
విద్యారంగంపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పుడప్పుడే బడులు తెరిచే అవకాశం కనిపించడం లేదు. చిన్నారులంతా ఒకచోట చేరితే ముప్పు పొంచి ఉండటంతో ఈ దిశగా అడుగులు పడటం కష్టమే. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆఖరు సంవత్సరం, చివరి సెమిస్టర్ ఆన్‌లైన్ పరీక్షల్ని ఎలా నిర్వహించాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. తరగతి గదులను వర్చువల్‌గా మార్చినట్లు విద్యాసంస్థలు చెబుతున్నా, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం దేశంలో నెలకొన్న డిజిటల్ అంతరాన్ని తేటతెల్లంచేస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ చేపట్టిన తాజా సర్వే ప్రకారం కనీసం 27శాతం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేవు. ఆన్‌లైన్ తరగతులు వినేందుకు విద్యుత్ సరఫరా కొరవడటమే పెద్ద అవరోధమని 28శాతం విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. సరైన శిక్షణ లేని కారణంగా, ఉపాధ్యాయులు ఆన్‌లైన్ బోధన విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.