తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దోమలపై రాష్ట్రాల దుర్బలపోరు- ప్రజారోగ్యానికి తూట్లు! - communicable diseases with mosquitoes

సుమారు నెల్లాళ్లుగా తరచూ వానలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గి, ఎక్కడికక్కడ పారిశుద్ధ్య నిర్వహణ లోపాలూ జతపడి- దోమల సంతతి ఇంతలంతలవుతోంది. ఫలితంగా దోమల ద్వారా వ్యాపించే రోగాల బారినపడేవారి సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యాధుల నివారణకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రత్యేక వ్యవస్థ రూపొందాల్సిన ఆవశ్యకతను కేంద్రం నిరుడు జనవరిలో ప్రస్తావించింది. అయితే.. ఏడాదిన్నర గడచినా ఎక్కడి గొంగడి అక్కడే పడి ఉండటం- సాంక్రామిక వ్యాధుల ప్రజ్వలనానికి శాయశక్తులా తోడ్పడుతున్న అంశమేమిటో స్పష్టీకరిస్తోంది.

mosquitoes
దోమలు

By

Published : Aug 18, 2021, 9:16 AM IST

దాదాపు ఏటా వర్షాకాలంలో విషజ్వరాలు, అంటురోగాలు ముసురేయడం ఆనవాయితీగా స్థిరపడి తరతమ భేదాలతో దేశంలోని జనావాసాలెన్నో వణుకుతున్నాయి. ఒక్క కరోనా వైరస్‌ గురించే ఆందోళన చెందుతూ ఇతర రోగ నిరోధక చర్యల్ని నిర్లక్ష్యం చేయడం అనర్థదాయకమన్న హెచ్చరికలు అక్షరసత్యాలని ఇప్పుడు సోదాహరణంగా రుజువవుతోంది. సుమారు నెల్లాళ్లుగా తరచూ వానలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గి, ఎక్కడికక్కడ పారిశుద్ధ్య నిర్వహణ లోపాలూ జతపడి- దోమల సంతతి ఇంతలంతలవుతోంది.

తామరతంపరగా..

దోమల ద్వారా వ్యాపించే రోగాల కట్టడికి ఉద్దేశించిన జాతీయ సంస్థ (ఎన్‌వీబీడీపీ) గణాంక విశ్లేషణ ప్రకారం- తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ డెంగీ కేసుల వ్యాప్తిలో ముందున్నాయి. ఆ సంస్థ క్రోడీకరించిన జాబితాలో చోటుచేసుకోనప్పటికీ- భువనేశ్వర్‌, వడోదరా, అహ్మదాబాద్‌, పట్నా తదితర ప్రాంతాల్లోనూ డెంగీ బాధితుల సంఖ్య తామరతంపరగా విస్తరిస్తోంది. కొన్నిచోట్ల మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌ కేసుల సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీలో సైతం మలేరియా, డెంగీ, చికున్‌ గన్యా కేసులు వెలుగు చూస్తున్నాయి. విషజ్వరాలతోపాటు కొవిడ్‌కూ జలుబు, దగ్గు, జ్వరం ప్రాథమిక లక్షణాలు కావడం సహజంగానే ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఏపీలో అనంతపురం, కడప, ప్రకాశం, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాంక్రామిక కేసుల సంఖ్య జోరెత్తుతోంది. తెలంగాణలో భాగ్యనగరంతోపాటు నిర్మల్‌ వంటిచోట్ల జ్వరాల ముట్టడితో జనం తల్లడిల్లుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల దురవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్కముక్కలో- దోమలపై వివిధ రాష్ట్రాల దుర్బలపోరు కారణంగా ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి.

సన్నద్ధపరచాలి..

దోమల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా, డయేరియా, గన్యా, టైఫాయిడ్‌ తదితరాల నివారణకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రత్యేక వ్యవస్థ రూపొందాల్సిన ఆవశ్యకతను కేంద్రం నిరుడు జనవరిలో ప్రస్తావించింది. ఏడాదిన్నర గడచినా ఎక్కడి గొంగడి అక్కడే పడి ఉండటం- సాంక్రామిక వ్యాధుల ప్రజ్వలనానికి శాయశక్తులా తోడ్పడుతున్న అంశమేమిటో స్పష్టీకరిస్తోంది. వానలు కురవకముందే రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమై స్థానిక సంస్థల్ని, పునాదిస్థాయి యంత్రాంగాన్ని సన్నద్ధపరచాలి. పంచాయతీరాజ్‌, వైద్య-ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, తాగునీరు, పారిశుద్ధ్య విభాగాల సిబ్బంది మధ్య అర్థవంతమైన సమన్వయం ఉండేట్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. పంచాయతీ సభ్యులు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సేవల్నీ వినియోగించుకునేలా కార్యాచరణ ప్రణాళిక ముందుగానే సిద్ధం కావాలి.

కోరలు మొలుస్తున్నాయి..

పరిసరాల పరిశుభ్రత పాటించడంలో, దోమలు వ్యాపించకుండా సుగంధ మొక్కలు నాటి వాటిని సంరక్షించడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకం. వాస్తవంలో ఇందులోని వేటికీ సముచిత ప్రాముఖ్యం దక్కకపోవడం, అక్కడక్కడా కొన్ని కాలనీల్లో ఫాగింగ్‌తో సరిపుచ్చడం పరిపాటిగా మారి విషజ్వరాలకు అంటురోగాలకు కోరలు మొలుస్తున్నాయి. రెండేళ్లక్రితం డెంగీ కేసులు వేలల్లో నమోదు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం- ప్రతి మరణానికీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందేనని సూటిగా నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఏ ప్రజాప్రభుత్వమైనా ఆ మేరకు స్వీయ విధ్యుక్తధర్మాన్ని విస్మరించజాలదు. పరిసరాల పరిశుభ్రతకు అగ్రప్రాధాన్యమిచ్చి- అటు ఆరోగ్య కేంద్రాల పరిపుష్టీకరణకు, ఇటు పౌర సమాజం స్వచ్ఛంద సంస్థల కీలక భాగస్వామ్యానికి ప్రభుత్వాలు నిబద్ధ కృషి సాగిస్తేనే... దోమల నియంత్రణ సాధ్యపడుతుంది!

ఇదీ చూడండి:లాంగ్​ కొవిడ్ సిండ్రోమ్​కు కారణమేంటంటే?

ABOUT THE AUTHOR

...view details