తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అప్పుల కుప్పలు... డిస్కమ్‌ల తిప్పలు - డిస్కమ్​లపై రాష్ట్ర ప్రభుత్వాల విధానం

విద్యుత్​రంగానికి వెన్నెముకగా ఉంటున్న డిస్కమ్​లు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్నాయి. కరోనా దెబ్బకు మరింత ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే థర్మల్​విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పత్తి శాతం సగానికి పడిపోయింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనకు రాష్ట్రాల పెత్తనం అడ్డంకిగా నిలుస్తోంది. దీంతో వచ్చే ఏడాదిలోనైనా ఛార్జీలు పెంచకపోతే ఆర్థిక కష్టాలు మరింత ఉద్ధృతమవుతాయని పలు రాష్ట్రాల డిస్కమ్‌లు కలత చెందుతున్నాయి.

DISCOM are suffering losses with state government decisions
అప్పుల కుప్పలు... డిస్కమ్‌ల తిప్పలు

By

Published : Nov 17, 2020, 7:56 AM IST

కరోనా దెబ్బకు విద్యుత్‌ సంస్థలు విలవిల్లాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో చోటుచేసుకున్న విద్యుదుత్పత్తిని అంతకుముందు అదే కాలవ్యవధిలోని ఉత్పత్తి పోలిస్తే 9.12శాతం తగ్గుదల నమోదైంది. థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల ఉత్పత్తిశాతం 49శాతానికి పడిపోయింది. అంటే, ఈ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో సగమైనా ఉత్పత్తి కాలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2021-22)కి కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా అన్ని రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండళ్ల(ఈఆర్‌సీ)కి అందజేయాల్సి ఉంది. వచ్చే ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం(2021-22)లో కరెంటు ఛార్జీలు పెంచాలంటే ఈ నవంబరు ఆఖరునాటికే ఆ మేరకు ప్రతిపాదనలను ఈఆర్‌సీలకు అందజేయాలని విద్యుత్‌ చట్టం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం కింద పనిచేస్తున్న డిస్కమ్‌లు అసలు ఈ ప్రతిపాదనలే ఇవ్వడం లేదు. తెలంగాణ సహా డజను రాష్ట్రాల డిస్కమ్‌లు నిరుడు ఈ ప్రతిపాదనలు ఇవ్వలేదంటే విద్యుత్‌ చట్టం అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు నష్టాలు, అప్పుల్లో మునిగిన డిస్కమ్‌లు కరెంటు ఛార్జీలు పెంచాలని కోరుతున్నా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. కరెంటు ఛార్జీలు వచ్చే ఏడాది(2021-22)లోనైనా పెంచకపోతే ఆర్థిక కష్టాలు మరింత ఉద్ధృతమవుతాయని పలు రాష్ట్రాల డిస్కమ్‌లు కలత చెందుతున్నాయి.

ఎంతకాలమీ పెత్తనం?

విద్యుత్‌ రంగానికి డిస్కమ్‌లే వెన్నెముక. వీటిని బలోపేతం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీకి అతీతంగా ఇవి వాణిజ్య సూత్రాలకు కట్టుబడి పనిచేయాలి. కానీ, నిరంతరం రాష్ట్రాల పెత్తనం కిందే పనిచేస్తున్నందువల్ల డిస్కమ్‌లు వాణిజ్య దృక్పథానికి దూరమయ్యాయి. వీటి ఆర్థిక నిర్వహణ వ్యయంలో 70శాతం వరకూ విద్యుత్‌ కొనుగోలు ఖర్చులే ఉంటున్నాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. జాతీయ ఇంధన ఎక్స్‌ఛేంజీలో రోజూవారీ డిమాండు మేరకు విద్యుత్‌ కొనుగోలు చేయడంవల్ల ఎంతో సొమ్మును ఆదా చేయవచ్ఛు పదిహేను నిమిషాల కాలవ్యవధి ప్రకారం కరెంటును కొనుగోలు చేయడానికి ఈ ఎక్స్‌ఛేంజీలో అవకాశముంది. దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్తును ఇందులో అమ్మకానికి పెడుతున్నందువల్ల తక్కువ ధరలకే లభిస్తోంది. ఇలా కనిష్ఠ ధరలకే కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ డిస్కమ్‌లు గడచిన ఆరునెలల్లో కనీసం రూ.500 కోట్లు ఆదా చేశాయని అంచనా. విద్యుదుత్పత్తి, వినియోగం నేలబాట పట్టి- డిస్కమ్‌లు జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు గడచిన జులై ఆఖరుకే లక్షా 20వేల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ బకాయిలు కొండలా పెరుగుతున్నందువల్ల ‘జెన్‌కో’లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఈ కష్టాలనుంచి గట్టెక్కించడానికి ఆత్మనిర్బర్‌ భారత్‌ కింద రూ.90వేల కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ సొమ్మును రుణాలుగా డిస్కమ్‌లు తీసుకుని జెన్‌కోల బకాయిలు తీర్చాలనే షరతు పెట్టింది. రుణం పేరు మారిందే తప్ప డిస్కమ్‌ల ఆర్థిక సమస్యలేమీ వీటితో తీరలేదు. వివిధ వర్గాలకు ఉచితంగా, తక్కువ ఛార్జీలకే కరెంటు సరఫరా చేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సొమ్మును వెనక్కి ఇవ్వడంలేదు. గడచిన జూన్‌ ఆఖరుకు డిస్కమ్‌లకు రాష్ట్రప్రభుత్వాలు ఇవ్వాల్సిన రాయితీల బకాయిలు రూ.90వేల కోట్లని అన్ని రాష్ట్రాల ఈఆర్‌సీల అధ్యయనంలో తేలింది. వినియోగదారులకు నెలవారీ మీటరు రీడింగ్‌ తీసి, బిల్లులిచ్చి వారి వద్దనుంచి సొమ్ము వసూలు చేస్తేనే ఆదాయం సమకూరుతుంది. కానీ 15రాష్ట్రాల్లో మొత్తం కనెక్షన్లలో 80శాతంలోపే బిల్లులిస్తున్నారు. ఉదాహరణకు బిహార్‌లో ఈ సగటు 70శాతం; జాతీయస్థాయిలో ఇది 83శాతంగా ఉంది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ వంద శాతం కనెక్షన్లకు నెలవారీ రీడింగ్‌ తీసి బిల్లులివ్వడం లేదు. ఆఖరికి బిల్లులిచ్చిన కనెక్షన్ల నుంచీ సొమ్ము వసూలు 2018-19లో 11 రాష్ట్రాల్లోనే వంద శాతంగా ఉంది. ‘ప్రీపెయిడ్‌’ మీటర్లు పెట్టి ముందస్తుగా వాటిని రీఛార్జి చేసుకునే వినియోగదారులకు కరెంటు బిల్లులో కొంత రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదనను ఎప్పటి నుంచో డిస్కమ్‌లు పట్టించుకోవడం లేదు. ఈ విధానం అమలుచేస్తే వినియోగదారులు ముందే బిల్లు సొమ్ము చెల్లించి మీటరును రీఛార్జీ చేసుకుంటారు. ఈ తరహా సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలూ డిస్కమ్‌లను ప్రోత్సహించడం లేదు.

యూనిట్​ ఛార్జీల పట్టిక

సంస్కరణలే శరణ్యం...

డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడాలంటే సంస్కరణలే శరణ్యమనే కేంద్ర వాదనను బలపరుస్తూ అన్ని రాష్ట్రాలతో ఏర్పడిన ఈఆర్‌సీ వేదిక సైతం తాజా నివేదికలో సిఫార్సు చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలన్నా విద్యుత్‌ పంపిణీ రంగంలో సమూల సంస్కరణలే శరణ్యమన్న ఈ వేదిక సూచన డిస్కమ్‌లకు శిరోధార్యం. విద్యుత్‌ సంస్థలంటే కంపెనీ చట్టం కింద ఏర్పాటైన వాణిజ్య సంస్థలు అన్న ప్రాథమిక సూత్రాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి. వాటిని ప్రభుత్వ సంస్థలుగా పరిగణించి నష్టాల్లో ముంచేసే ఉదాసీన విధానాలకు స్వస్తి పలకాలి. డిజిటైజేషన్‌, ఆటొమేషన్‌లతో కూడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే డిస్కమ్‌ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఉదాహరణకు ప్రతి ఇంటిలోని కరెంటు మీటరు రీడింగ్‌ను నెలకోసారి సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఆన్‌లైన్‌లో ‘అప్‌లోడ్‌’ చేస్తే క్షణాల్లో బిల్లు తయారై- దాన్ని చెల్లించే సదుపాయం పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది. ఈ వ్యవహారంలో పారదర్శకత పెరగాలి. డిస్కమ్‌ స్థాయిలో ఎంత కొన్నది, ఎంత విక్రయించారు అన్నది మొదటిస్థాయి ఆడిట్‌. ఇలాగే విద్యుత్‌ డివిజన్‌, ఫీడర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ స్థాయుల్లో ఎంత కరెంటు వచ్చింది, ఎంత వినియోగమైందనే ఆడిట్‌ పక్కాగా ఏటా జరిగితే మధ్యలో ఎంత నష్టపోతున్నారనే బండారం బట్టబయలవుతుంది. విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం ఈ ఆడిట్‌ తప్పనిసరి. కానీ, దీన్ని పట్టించుకోకుండా పంపిణీ, సరఫరాలో నష్టాలు 20శాతం దాకా ఉన్నట్లు డిస్కమ్‌లు చెప్పే లెక్కల్లో వాస్తవికత నేతి బీర చందమే! విద్యుత్‌ చట్టాన్ని సరిగ్గా అమలుచేస్తే డిస్కమ్‌లకు ఆర్థిక కష్టాలుండవు. ఈ చట్టాన్ని గడచిన 17ఏళ్లుగా పూర్తిగా అమలు చేయకుండా డిస్కమ్‌లను రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. రాష్ట్రాలనుంచి వాటిని తప్పించి ప్రైవేటీకరణతో డిస్కమ్‌లను మెరుగుపరుస్తామంటూ కేంద్రం ఈ చట్టానికి సవరణల బిల్లును సిద్ధం చేయడంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. సంస్కరణలతో పనితీరు మెరుగుపరచుకోకుండా- ఆదాయం పెంపే లక్ష్యంగా కరెంటు ఛార్జీల ప్రతిపాదనలను ఈ నెలాఖరుకు డిస్కమ్‌లు ఈఆర్‌సీలకిస్తే కరోనా కష్టకాలంలో ప్రజలకే కాకుండా, పారిశ్రామిక రంగానికీ అది గుదిబండలా మారుతుందని గుర్తించాలి.

ఇదీ చూడండి: 'ఆరోగ్య వ్యవస్థల బలోపేతం అవసరాన్ని కొవిడ్​ చాటింది'

ABOUT THE AUTHOR

...view details