ప్రపంచవ్యాప్తంగా మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విపత్తుల జాబితాలో వరదలే ముందువరసలో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలకు పోటెత్తిన వరదలు జనజీవితాలను అతలాకుతలం చేశాయి. ఐరాస విపత్తుల నష్ట నివారణ కార్యక్రమం విడుదల చేసిన అధ్యయనం ప్రకారం గడచిన 20ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విపత్తుల్లో 44శాతం వరదలవల్లే కావడం గమనార్హం. విపత్తుల మూలంగా ప్రజలకు వాటిల్లుతున్న నష్టం పలు అంశాలపైన ఆధారపడి ఉంటున్నట్లు ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2000-2019 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది ప్రజలు విపత్తుల మూలంగా ప్రభావితమయ్యారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టమవుతోంది. ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 120 కోట్లు. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా విరుచుకు పడుతున్న విపత్తుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
భారత్‌లో తీవ్రతరం
ప్రపంచం మొత్తంమీద విపత్తుల ప్రభావానికి గురవుతున్నవారిలో అత్యధికులు చైనా, భారత్ పౌరులే కావడం గమనార్హం. ఈ రెండు దేశాల నుంచి విపత్తుల వల్ల ప్రభావితమవుతున్న ప్రజలు- ప్రపంచ జనాభాలో దాదాపు 70శాతమని ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. విపత్తుల వల్ల మానవాళికి వాటిల్లుతున్న ప్రాణ, ఆస్తినష్టం వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమై పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 2.97 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం ఈ 20 ఏళ్ల కాలంలో సంభవించింది. ప్రాంతాలవారీగా జరిగిన ఆస్తినష్టాన్ని పరిశీలించినట్లయితే అమెరికా వాటా ప్రపంచంలో 45శాతంగా నమోదైతే ఆసియా వాటా 43శాతం. ఈ విపత్తులవల్ల సంభవిస్తున్న నష్టం ఆయాదేశాల్లో ఆదాయ అసమానతలకు కారణమవుతోంది. ప్రాణ నష్టం వారీగా పరిశీలించినా మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో అల్పాదాయ వర్గ దేశాల్లోని మరణాలు 23శాతం; సంపన్న దేశాల్లోని మరణాలు 10శాతం. 1980-1999 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపత్తులవల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 19 లక్షలు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఆ సంఖ్య 12.30 లక్షలకు తగ్గింది. ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో పరిస్థితులు కొంత మెరుగైనప్పటికీ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో వైఫల్యం కనిపిస్తోంది.