కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద వివిధ సహాయ చర్యలు చేపడుతుండగా, మరోవైపు పలు రాష్ట్రాల్లోని భాజపా సర్కార్లు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. అసోం, కర్ణాటక, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోకి పెట్టుబడుల్ని ఆకర్షించే చర్యల్లో భాగంగా కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణలకు అత్యంత వేగంగా ఆమోద ముద్రవేసే పనిలో నిమగ్నమయ్యాయి.
నిబంధనల సరళీకరణ
నిర్దిష్ట కాలవ్యవధితో కూడిన ఉద్యోగాల పద్ధతిని ప్రవేశపెట్టడం, కార్మికుల పని వేళలు ఎనిమిది గంటల నుంచి 12 గంటలకు పెంచడం, కర్మాగారాల చట్టం అమలుకు కనీస ఉద్యోగుల సంఖ్యను నిర్వహించడం, ఒప్పంద కార్మికుల చట్టం అమలుకు కనీస కార్మికుల సంఖ్యను 20 నుంచి 50కి పెంచడం, కొద్దిమందే ఉద్యోగులుండే కర్మాగారాలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు, కర్మాగారాల తనిఖీకి సంబంధించి అధికార రికార్డుల నిర్వహణ తొలగింపు వంటి నిర్ణయాలు ఈ సంస్కరణల్లో ఉన్నాయి. ఇవేకాకుండా రాబోయే రోజుల్లో కార్మిక చట్టాల్లోని కొన్ని కఠిన నిబంధనలు/ పరామితుల విషయంలోనూ సడలింపులు ఇవ్వనున్నారు. కార్మికులకు అందించే సౌకర్యాల్లో భాగంగా పరిశుభ్రత నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, గాలి, వెలుతురుల అందుబాటు, తాగునీరు, మూత్రశాలలు, ఆహారశాలలు, విశ్రాంతి గదులు, శిశు సంరక్షణ సౌకర్యాలు, సెలవుల్లో వేతనాలు తదితర పలు అంశాల్లో కఠిన నిబంధనల్ని సరళీకరించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించింది. దీనివల్ల వ్యవసాయోత్పత్తుల్ని ప్రైవేటు రంగం కూడా సేకరించవచ్చు అంతకుముందు, వ్యవసాయోత్పత్తుల్ని ప్రభుత్వం ఆమోదించిన మండీల్లో కనీస మద్దతు ధరకు అమ్మాల్సిందే. మండీల్లో మధ్యవర్తులు రైతుల నుంచి లాభాల్లో గణనీయంగా వాటా పొందేవారు.
భారత్‌లో వివిధ రంగాల్లో శ్రామిక శక్తి ఇలాంటి కార్మిక చట్టాల్లో సంస్కరణలను పలు పారిశ్రామిక వర్గాలు వేర్వేరు కారణాలతో ప్రశంసిస్తున్నాయి. ఎంతోకాలంగా వేచి చూస్తున్న తదుపరి తరం సంస్కరణలుగా వీటిని అభివర్ణిస్తున్నాయి. ప్రస్తుత కల్లోల సమయంలో పరిశ్రమ మనుగడ సాగించడానికి వీలయ్యే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాలు తీసుకొచ్చే కార్మిక సంస్కరణలు కర్మాగారాలు సమర్థంగా పని చేసేందుకు తోడ్పడతాయని పరిశ్రమల సమాఖ్య ‘అసోచామ్’ అధ్యక్షుడు నిరంజన్ హీరానందనీ వ్యాఖ్యానించడం గమనార్హం. కార్మిక సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాల్ని స్వాగతిస్తూ, ఈ విషయంలో పరిశ్రమ వర్గాలు సంతోషకరంగా ఉండటానికి కారణాలున్నాయి. వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు తిరిగివెళ్లిపోవడంతో, కూలీల కొరత ఏర్పడే అవకాశం ఉంది. సవరించిన కార్మిక చట్టాల వల్ల కార్మిక విభాగం అధికారుల తనిఖీలు వంటి సమస్యలు లేకుండా పరిశ్రమల్ని విస్తరించుకోవడానికి, సుదీర్ఘ పనివేళలపాటు పని చేయించుకోవడానికి అవకాశం చిక్కినట్లయింది. అయితే, కార్మిక సంఘాలు మాత్రం ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ పరిణామాల్ని సాకుగా తీసుకుని, కార్మికులను బానిసలుగా మార్చే అజెండాతో ముందుకెళ్తోందని, సడలింపులంటే కార్మిక చట్టాల వర్తింపు ఉండదని, చిన్న పరిశ్రమల కార్మికులు తమకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటిని పొందలేరని, కనీస వేతన హక్కుల్నీ కోల్పోతారని సీఐటీయూ నేత తపన్ శర్మ విమర్శలు గుప్పించడం గమనార్హం. చట్టాల సంస్కరణలపై కార్మిక సంఘాలు వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నా... సదరు వాదనలతో చాలామంది ఇతర స్వతంత్ర నిపుణులు మాత్రం గట్టిగా విభేదిస్తున్నారు. పాతకాలపు కార్మిక చట్టాలు భారత్‌లో భారీస్థాయి వ్యాపార సంస్థల ఎదుగుదలను నిరోధిస్తున్నాయని, ఫలితంగా కార్మిక మార్కెట్ పెద్ద ఎత్తున అసంఘటిత రూపంలోనే ఉండిపోయిందనేది వారి వాదన. దేశంలో వ్యాపార సంస్థలు పెద్ద సంఖ్యలో లేకపోవడానికీ పురాతన కార్మిక చట్టాలే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం భారత్‌లో సుమారు 6.30 కోట్ల కంపెనీలు ఉన్నాయి. కానీ వాటిలో కేవలం 18,500 మాత్రమే కనీసం రూ.10 కోట్ల పెయిడప్ మూలధనాన్ని కలిగిఉన్నాయి. కార్మిక చట్టాల్లో సరళీకరణల విషయంలో వివిధ వర్గాల వాదనలు విభిన్న తరహాలో ఉన్నా... భాజపా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల విషయంలో గట్టిగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు, కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం ఇలాంటి వివాదాస్పద అంశంలో మౌనందాల్చడం విశేషం. కేంద్ర ప్రభుత్వం తనవంతుగా, ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడుల్ని ఆకర్షించడం తేలికవుతుందని.. అదేసమయంలో సంస్కరణల్నీ చేపట్టడం జరుగుతుందని, పెట్టుబడిదారుల్ని ఆకర్షించే దిశగా భాజపా పాలిత రాష్ట్రాలు ముందు వరసలో నడిస్తే, చట్టాల సరళీకరణ విషయంలో ఇతర రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... కార్మిక సంస్కరణలను మానవ హక్కుల ఉల్లంఘనగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆర్‌ఎస్‌ఎస్ కార్మిక విభాగమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) భాజపా పాలిత రాష్ట్రాల్లోని కార్మిక సంస్కరణల్ని ఖండిస్తూ, అవి కార్మికుల ప్రయోజనాలను పణంగా పెడుతూ, పెట్టుబడిదారులకు ప్రయోజనం కల్పించేవిగా ఉన్నాయని విమర్శించడం గమనార్హం. జంగిల్‌రాజ్‌ను అనుమతించబోమని, కార్మికులను కార్పొరేట్ల చేతుల్లో చిక్కనీయబోమని బీఎంఎస్ అధ్యక్షుడు సాజి నారాయణన్ స్పష్టం చేశారు. ఏ వర్గాల విమర్శలెలా ఉన్నా భాజపా కేంద్ర నాయకత్వం మాత్రం ఈ విషయంలో పూర్తిస్థాయిలో మౌనం దాల్చింది. తాజా పరిణామాలన్నీ రాష్ట్రాల పరిధిలోని అంశాలుగా నేతలు స్పష్టం చేస్తుండటం గమనార్హం.
రాష్ట్రాల పరిధిలోనే...
తొలిదశ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1990 ప్రారంభంలో నాటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ మన దేశపు పారిశ్రామిక విధానాన్ని సరళీకరించారు. కానీ, ఆ తరవాత మూడు దశాబ్దాల్లో పెద్దగా ముందడుగు పడలేదు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత పురాతన కార్మిక చట్టాలను ప్రక్షాళన చేసే దిశగా ప్రయత్నాలు తీవ్రస్థాయిలో మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, కార్మిక చట్టాలన్నింటినీ వేతనాలు, పారిశ్రామిక వివాదాలు, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం సామాజిక భద్రత వంటి అంశాలతో నాలుగు కార్మిక స్మృతుల కింద విభజించింది. వేతన స్మృతికి పార్లమెంటు ఇప్పటికే ఆమోదం తెలిపింది. పారిశ్రామిక వివాదాల స్మృతికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా చూపినా, పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. వృత్తిపరమైన రక్షణ; ఆరోగ్య, సామాజిక భద్రత స్మృతులు పార్లమెంటరీ కమిటీల పరిశీలనలో ఉన్నాయి. కార్మిక చట్టాల అంశం ఉమ్మడి జాబితాలోకి వస్తుంది. ఈ నాలుగు స్మృతులూ కేంద్ర చట్టాలన్న సంగతి మరవకూడదు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితా అంశం కావడంతో కేంద్రం ఆమోదం లేకుండానే కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
- రాజీవ్ రాజన్