తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నేటి అవసరం.. డిజిటల్‌కు అనుసంధానం! - Internet usage in India

కొవిడ్​ కారణంగా అన్ని రంగాల్లోనూ గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం సహా.. ఇతర నిబంధనలు తప్పనిసరి అయ్యాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశంలో విద్యారంగం కొత్త హంగులు దిద్దుకుంటోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగదారుల సంఖ్య 50 కోట్లకు మించిపోతోంది. ఫలితంగా ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్యలో చైనా తర్వాత స్థానాన్ని ఆక్రమించింది భారత్​.

Digital integration is a must in present days
నేటి అవసరం డిజిటల్‌ అనుసంధానం!

By

Published : Jul 10, 2020, 7:03 AM IST

కరోనా మహాసంక్షోభం దేశదేశాల్లో భిన్నరంగాల్ని, వ్యవస్థల్ని ఇప్పట్లో కోలుకోలేనంతగా గట్టి దెబ్బ తీసింది. కొవిడ్‌ పాలబడకుండా కాచుకునే ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పౌరులు భౌతికదూరంతోపాటు ఇతర జాగ్రత్తలూ పాటించడాన్ని తప్పనిసరి చేసేసింది. ఊహాతీతంగా మారిన పరిస్థితుల్లో దేశీయంగానూ పాలన, విద్యారంగాల్లో కొత్త యోచనలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, సర్కారీ కార్యాలయాల్లోనే కాదు- క్షేత్రస్థాయి స్థితిగతుల్నీ కళ్లకు కట్టే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ అవతరణకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే సుముఖత చాటింది. నేడది ‘కరోనా వ్యాప్తి భయం ఉండదు... దస్త్రాల నిర్వహణ సులభతరమై పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతాయి’ అంటూ ఇ-కార్యాలయాలకు ఓటేస్తోంది. త్వరలోనే మండలాఫీసు నుంచి సచివాలయం దాకా కంప్యూటర్ల ద్వారా ఆన్‌లైన్‌ పాలనకు రంగం సిద్ధమవుతోంది. నెల్లాళ్లక్రితమే అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టిన కేరళ 40లక్షల మందికి డిజిటల్‌ పాఠాలు చెబుతోంది.

ఇ-ఆఫీస్​ విధానం..

అంతర్గత ఫైళ్ల నిర్వహణ యాంత్రీకరణ నిమిత్తం పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్రబోర్డు గత నెలలోనే 'ఇ-ఆఫీస్‌' విధానం ప్రవేశపెట్టింది. కాగితాలతో పనే లేని ప్రభుత్వ కార్యాలయాలను అంచెలవారీగా అవతరింపజేసేందుకు హరియాణా లాంటిచోట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన’ స్ఫూర్తికి పట్టం కడుతూ ఈశాన్య రాష్ట్రాలన్నింటా ఇ-ఆఫీస్‌ ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది! ఆన్‌లైన్‌ పద్ధతికి మళ్లితే యంత్రాంగం పని సామర్థ్యం ఇనుమడిస్తుంది. అనుమతుల మంజూరు కోసం ప్రజానీకం అధికార సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేసే దురవస్థ తప్పుతుంది. సహజంగానే అవినీతీ తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ సాకారం కావాలంటే ఊరూరా ఇంటింటా అంతర్జాల సదుపాయం అందుబాటులోకి రావాలి!

'డిజిటల్ ఇండియా' అందుకే..

దేశీయంగా ఎలెక్ట్రానిక్‌ పాలన ప్రణాళికలు రెండు దశాబ్దాలుగా వినవస్తున్నా, పౌరులందరికీ అంతర్జాల (ఇంటర్‌నెట్‌) సౌకర్యం సమకూర్చి ఆన్‌లైన్‌లో వేగంగా ప్రభుత్వసేవలు అందించేందుకంటూ 'డిజిటల్‌ ఇండియా' పథకం ప్రారంభమైంది 2015లో. మూడేళ్ల తరవాత, 2022 నాటికి అందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాల్ని కల్పించడమే లక్ష్యమని టెలికాం నూతన విధాన ముసాయిదా ఘనంగా చాటింది. ‘భారత్‌ నెట్‌’ ద్వారా లక్షా ముప్ఫైవేల గ్రామ పంచాయతీలు, 48వేలదాకా గ్రామాలు అనుసంధానమయ్యాయని, మొత్తం రెండున్నర లక్షల పంచాయతీల్లో డిజిటల్‌ శకం చురుకందుకుంటుందని ఈ ఏడాది మొదట్లో కేంద్రం వెల్లడించినా- వాస్తవం వేరు. పనులు పరిపూర్తి అయినట్లు అమాత్యులు చెబుతున్న గ్రామపంచాయతీల్లో కేవలం ఎనిమిది శాతమే నెట్‌ సేవలకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి.

చైనా తర్వాత మనమే..

దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగదారుల సంఖ్య 50కోట్లకు పైబడి ఇంకా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా సొంత కంప్యూటర్లు కలిగిన కుటుంబాలు 11శాతమని ఆమధ్య జాతీయ నమూనా అధ్యయనం మదింపు వేసింది. అంతర్జాల వినియోగదారుల సంఖ్య చైనా (85కోట్లు) తరవాత ఇండియాలోనే (50.4కోట్లు) ఎక్కువ. బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో మాత్రం మందకొడితనం పీడిస్తోంది. శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌ తదితరాలూ మనకన్నా మెరుగ్గా రాణిస్తుండగా నెట్‌ వేగం ప్రాతిపదికన భారత్‌ 132వ స్థానాన అలమటిస్తోంది! నిరుడు జమ్మూకశ్మీర్‌ కేసులో స్పందిస్తూ, అంతర్జాల సేవలు పొందడమూ పౌరుల ప్రాథమిక హక్కేనని న్యాయపాలిక కరాఖండీగా ప్రకటించింది. ఆ స్ఫూర్తికి గొడుగు పట్టి ఊరూరా ఇంటింటా నెట్‌ అనుసంధానతను సాకారం చేసి అంతర్జాల వేగాన్ని ఇనుమడింపజేయడంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో ముందడుగేయాలి. ఆన్‌లైన్‌ పాలన, బోధనల్ని సజావుగా పట్టాలకు ఎక్కించడం- ‘శ్రేష్ఠ్‌ భారత్‌’ అవతరణలో మేలు మలుపవుతుంది!

ఇదీ చదవండి:జియో ఎఫెక్ట్​: భారత్​ కోసం 'జూమ్' ప్రత్యేక ప్లాన్

ABOUT THE AUTHOR

...view details